భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారని టాక్ నడుస్తుంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవ్వడంతో పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయం ఉంది. కేటీఆర్ జిల్లా పర్యటనల పైన దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు జిల్లాల పర్యటనలు , కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రైతు నిరసనల పేరుతో హరీష్ రావు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. హరీశ్ దూకుడుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వెనుక పడిపోతున్నారని చర్చ జరుగుతోంది.
ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికే కేటీఆర్ రైతు నిరసన రాగం ఎత్తుకుని చేవెళ్ళ నియోజకవర్గంలో దీక్ష చేపట్టారంటున్నారు. అయితే పార్టీలో నెంబరు టూ అనిపించుకోవడానికి కేటీఆర్ ప్రదర్శిస్తున్న దూకుడు తాజాగా అభాసుపాలైంది. పిలవని పేరంటానికి వెళ్లినట్లు హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నాకు అటెండ్ అవ్వడానికి కేటీఆర్ రెడీ అవ్వడంపై ఏఐటీయూసీ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్‌ను రమ్మని తాము పిలువలేదన్నారు. రాజకీయ లబ్ది పొందడానికే కేసీఆర్ వచ్చేందేకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు
బీఆర్ఎస్‌లో బావబామ్మరుదల మధ్యపోటీ మొదటి నుంచి కొనసాగుతుంది. కేసీఆర్ తరువాత ఎవరు కీలకం కానున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. కేసీఅర్ తరువాత బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్‌రావులే కీలకం. హరీశ్ రావుకు జిల్లాల్లో పట్టున్న నేతగా పేరుంటే , వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు.
Also Read: స్పీడ్ పెంచుతున్న హైడ్రా.. రిజిస్ట్రేషన్ లావాదేవీలపై కన్ను.. రంగంలోకి స్పెషల్ టీమ్
ఇలాంటి తరుణంలో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర అంశాన్ని తెరపైకి తెచ్చారు కేటీఆర్. పాదయాత్రపై అధికారంగా ప్రకటన చేయనప్పటికీ.. ప్రజల్లో విసృత్తంగా చర్చ నడిలా సోషల్ మీడియాలో కేటీఆర్ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రపై అధికార ప్రకటన చేయకుండా.. ప్రచారాన్ని మాత్రం స్టార్ట్ చేయడం వెనక ఉన్న వ్యూహం ఏంటనేది అంతుపట్టకుండా తయారైంది. గ్రేటర్ ప్రాంతానికే కేటీఆర్ పరిమితం అయ్యారనే టాక్ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకునేందుకే పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది.
అయితే కేటీఆర్ నిజంగా పాదయాత్రకు రెడీ అయితే… తమ నేత కూడా యాత్ర చేపడతారని హరీష్‌రావు వర్గీయులు సంకేతాలు ఇస్తున్నారు . కేటీఆర్ ఉత్తర తెలంగాణలో పాదయాత్ర మొదలు పెడితే దక్షిణ తెలంగాణ నుంచి హరీష్ రావు పాదయాత్ర స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కేసీఅర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే దాక ఇద్దరు నేతల మద్య పోటీ ఇలానే కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీదే అధికారం .. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ , హరీష్ రావు పదేపదే చెప్తున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్య రీత్యా ఆయన ఫాం హౌస్ కే పరిమితం అవుతున్నారని, మున్ముందు కూడా అదే పరిస్థితి ఉండవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. దాంతో రానున్న రోజుల్లో గులాబీబాస్ తన రాజకీయ వారసత్వాన్ని ఎవరికి కట్టబెడతారన్న చర్చ నడుస్తుది. ఒకవైపు మేనల్లుడు, మరోవైపు కొడుకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరికో ఒకరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలి కాబట్టి.. ఆయన కొడుకు వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే హరీష్ రావు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది . కేసీఆర్ మాటను తూచ తప్పకుండా పాటిస్తాను అని చెప్పే హరీష్ రావు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారా అనేది అనేది చర్చినీయాంశంగా మారింది
ఇలాంటి పరిస్థితుల్లో అసలు కేటీఆర్ పాదయాత్రకు కేసీఆర్ క్లియరెన్స్ ఇస్తారా? ఇచ్చి లేనిపోని తలనొప్పి కొనితెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. తండ్రి అనుమతితో కేటీఆర్ పాదయాత్ర మొదలుపెడితే.. రాష్ట్రంలో రెండో మూల నుంచి హరీష్‌రావు పాదయాత్ర కూడా ప్రారంభం అవ్వడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. అలా జరక్కుండా ఉండాలంటే కేటీఆర్ పాదయాత్రకు కేసీఆర్ రూట్ క్లియరెన్స్ ఇచ్చి.. హరీష్ రావుకి వ్యూహాత్మకంగా వేరే బాధ్యతలు కట్టబెట్టే అవకాశముందంటున్నారు. మరి చూడాలి బావబామ్మరుదుల ఆధిపత్య పోరు ఎటు నుంచి ఎటు దారితీస్తుందో.