EPAPER

BRS Plans: బీఆర్ఎస్ యాత్రలు హిట్టు అయ్యేనా?

BRS Plans: బీఆర్ఎస్ యాత్రలు హిట్టు అయ్యేనా?
KCR Master Plan To Form BRS Goverment In Telangana: తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లు రాష్ట్రంలో గులాబీ పార్టీ హవానే నడిచింది. తన పార్టీ వారితో తెలంగాణ జాతిపిత అనిపించుకున్న కేసీఆర్.. పదేళ్లు ఫాంహౌస్, ప్రగతి భవన్‌ల నుంచే పాలన సాగించారు. సెంటిమెంట్‌నే నమ్ముకున్న ఆయన అన్నీ తానే అన్నట్లు వ్యవహరించి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఆ ఎఫెక్ట్ అధికారం కోల్పోయి 8 నెలలు కాకముందే కనిపిస్తుంది. నేతల వలసలతో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కుంటుంది. కేడర్ సైతం పక్క చూపులు చూస్తుంది. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీలు బంతాట ఆడుకుంటున్నాయి. ఆ క్రమంలో చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు.. ఉనికి కాపాడుకోవడానికి గులాబీ పెద్దలు పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెడుతున్నారు.

తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని 10 ఏళ్లు అధికారంలో ఉండి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు గులాబీ నేతలు.. పవర్‌లో ఉన్నంత కాలం అయితే ఫాంహౌస్ లేకపోతే ప్రగతి భవన్ అన్నట్లు ఒన్ మాన్ షో చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ ముఖం చూడటానికే ఇష్టపడలేదు. పార్టీకి తన ఫేస్ వాల్యూ చాలన్నట్లు వ్యవహరించిన ఆయన.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదు. పక్క పార్టీల నుంచి బలవంతంగా ఎమ్మెల్యేలను చేర్చేసుకుని.. తిరిగి సిట్టింగుల పేరుతో వారికే టికెట్లు ఇచ్చి. ముందు నుంచి పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు లేకుండా చేశారు.


ఆ ప్రభావం బీఆర్ఎస్‌పై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఓటమి తరువాత అవినీతి ఆరోపణలు, దారుణమైన విమర్శలతో సతమతమవుతున్న కారు పార్టీ క్రమక్రమంగా ఖాళీ అయిపోతుంది. అధికారం కోల్పోయి 8 నెలలు గడవకముందే నేతలు, కార్యకర్తలు తలో దారి చూసుకుంటున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 గురు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చారు. జిల్లా పరిషత్ ఛైర్మెన్‌లు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను సైతం అవిశ్వసంతో అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన గులాబీపార్టీకి అదే గ్రేటర్‌లో వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు పెద్ద సవాలే.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలే తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్ధులుగా తయారయ్యాయి. రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్‌ విలీనంపై బంతాట ఆడుకుంటూ ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పేశారు. కేసీఆర్ గవర్నర్‌గా, కేటీఆర్‌ కేంద్రమంత్రిగా, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారంటూ.. వారికి కొత్త పదవులు కూడా కట్టబెట్టేశారు.


రేవంత్ రెడ్డి కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. తాజాగా దానిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ కాంగ్రెస్‌లోనే విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు. పనిలో పనిగా ఆయన కూడా కేసీఆర్, కేటీఆర్, కవితలకు కాంగ్రెస్‌లో కొత్త పదవులు సృష్టించేశారు.

తన చాప కిందకు నీరొస్తే కాని నొప్పి తెలియదన్నట్లు.. ముందునుంచి వలస రాజకీయాలను ప్రోత్సహించి.. ఆ వాపే బలుపు అనుకుంటూ వచ్చిన గులాబీపార్టీ ఇప్పుడు స్వీయ రక్షణలో పడాల్సి వచ్చింది. పార్టీ ఉనికి కాపాడుకోవడానికి సంస్థగత నిర్మాణంపై దృష్టి సారిస్తుంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టు కొని నిలబడ్డ ప్రాంతీయ పార్టీ డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ లాంటిలతోపాటు ఏపీలోని టీడీపీ, వైసీపీల నిర్మాణాలపై అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ రెడీ అయింది.

Also Read: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సీఎం రేవంత్ రెడ్డి

సదరు ప్రాంతీయ పార్టీల పనితీరును పరిశీలించేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల పర్యటనకు సిద్దం అయింది. సెప్టెంబర్ మొదటి వారంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల పర్యటనకు కేటీఆర్ టీమ్ వెళ్లనుంది. అక్కడ ప్రాంతీయ పార్టీల పనితీరును పార్టీ విధానాలను తెలుసుకోనుంది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీ పనితీరు, ఆ పార్టీ సంస్థాగత బలంపై అధ్యయనానికి కేటీఆర్ మొదటగా తమిళనాడు వెళ్లనున్నారు. ఇప్పటికే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఒక బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించి డీఎంకే నిర్మాణంపై స్టడీ చేసి వచ్చింది.

75 యేళ్లుగా తమిళనాడు రాజకీయాలను డీఎంకే శాసిస్తోంది. అక్కడ జాతీయ పార్టీల ప్రభావం నామమాత్రమే.. అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకేల మధ్యే తమిళ రాజకీయం నడుస్తుంది. ఆ క్రమంలో డీఎంకే ఎత్తుపల్లాలు ఎలా అధిగమిస్తూ వచ్చింది అని తెలుసుకునేందుకు బిఆర్ఎస్ ఆసక్తి చూపిస్తుంది. అందుకే కేటీఆర్ తో పాటుగా 10 మంది బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ప్రాంతీయ పార్టీల పనితీరును అధ్యయనం చేసేందుకు వెస్ట్ బెంగాల్, ఒడిషాలలో కూడా పర్యటించడానికి కేటీఆర్ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఆ పర్యటనలు అయిపోగానే ఆగస్టు లేదా, సెప్టెంబర్ నెలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీల ఏర్పాటు చేసుకుంటామని కేటీఆర్ అంటున్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బిఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నిర్మాణం పై దృష్టి సారించకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితి తలెత్తిందని సొంత పార్టీ నేతల నుండే విమర్శలు వస్తున్నాయి.

నీళ్లు, నిధులు, నియామకాల అజెండాతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. కుటుంబ పార్టీగా ముద్ర వేసుకుంది. దాంతో పాటు జాతీయ పార్టీ అంటూ పార్టీ పేరు మార్చి అహంకార ధోరణితో ఓటమి చెందిందని గులాబీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కన్న గులాబీబాస్.. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉనికి కోసం ప్రాంతీయ పార్టీల గురించి స్టడీ చేయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

 

 

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×