EPAPER

Kakatiya University Lands : కేయూ భూముల కబ్జా..!

Kakatiya University Lands : కేయూ భూముల కబ్జా..!

– 200 ఎకరాలు.. విలువ వేల కోట్లు
– హద్దు దాటి ముందుకొస్తున్న సీఆర్పీఎఫ్ కంచె
– అయినా పట్టించుకోని వర్సిటీ అధికారులు
– ప్రహరీ సరే.. కబ్జాల సంగతేంటి..?
– వర్సిటీ భూముల కబ్జాలపై తేల్చకుండా ప్రహరీ నిర్మాణం కరెక్టేనా?
– కేయూ భూముల రక్షణపై అధికారుల్లో కానరాని చిత్తశుద్ధి
– భూమి లెక్క తేలాకే ప్రహరీ కట్టాలని విద్యార్థుల డిమాండ్


Kakatiya University Lands Issue : వేలాదిమంది మేధావులను, సామాజిక వేత్తలను సమాజానికి అందించిన విద్యాలయం వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి ఎంతోమందికి దేవాలయంగా మారింది కేయూ. కానీ, ఇప్పుడు వర్సిటీకి రక్షణ కరువైంది. నాటి పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేనితనంతో యూనివర్సిటీ కోసం కేటాయించిన రూ.వేలాది కోట్ల విలువ చేసే సుమారు 200 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. ఇంటి దొంగలతోడు, అక్రమార్కులు దర్జాగా భూమి కబ్జా చేస్తున్నా కాపాడే నాథుడే కరువయ్యాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు అనేక ఉద్యమాలు చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోయారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత యూనివర్శిటీ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడంతో, కబ్జాకోరులు అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

దొంగ చేతికే తాళం ఇచ్చిన వీసీ


కాకతీయ యూనివర్సిటీకి మొత్తం లస్కర్ సింగారం, కుమార్ పల్లి, పలివెల్పుల, శివనగర్ ప్రాంతాలలోని పలు సర్వే నెంబర్లలో మొత్తం 622 ఎకరాల 22 గంటల భూమి ఉండాలి. చాలావరకు కబ్జాలకు గురి కాగా, ప్రస్తుతం 400 ఎకరాల భూమి వరకే మిగిలిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆక్రమణలు కొనసాగుతుండడంపై ఆందోళన పడుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పేరేషన్ 13 మంది యునివర్సిటీ భూమి ఆక్రమించారని నిర్ధారించి వారికి నోటీసులు జారీ చేసింది. ఈ 13 మందిలో ముగ్గురు యూనివర్సిటీలో పని చేసే ఉద్యోగులే ఉన్నారు. కేయూ భూముల ఆక్రమణకు సంబంధించి విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన అప్పటి వీసీ భూ సర్వే కమిటీ వేశారు. ఆ కమిటీలో కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న యునివర్సిటీ ఉద్యోగిని సభ్యునిగా చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. వర్సిటీ భూముల రక్షణపై అప్పటి వీసీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని భూ సంరక్షణ కమిటీలో సభ్యునిగా నియమిచడంపై అనేక విమర్శలు వచ్చాయి. ఆందోళనలు జరిగాయి. చివరకు ఆరోపణలు ఎదుర్కొన్న వర్శిటీ ఉద్యోగిని కమిటీ నుంచి తప్పించారు. ఆ కమిటీ నివేదిక, అక్రమార్కుల చిట్టాను మాత్రం బయట పెట్టకపోవడం, భూమి రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కేయూ భూమిలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ కంచె

కాకతీయ యూనివర్సిటీ భూమిలో గతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు స్థలం కేటాయించారు. అధికారుల అలసత్వం ఆసరాగా చేసుకుని బెటాలియన్ వారికి కేటాయియించిన స్థలం కంటే పది రెట్లు ముందుకు జరిగి కంచె వేశారు. ఇప్పుడు రేకులతో కాంపౌండ్ కట్టి భూమి వారి ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నం సాగిస్తున్నారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు కంచె వేసిన రేకులతో కాంపౌండ్ నిర్మాణం చేస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు.

నకిలీ సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు.. దర్జాగా నిర్మాణాలు

యూనివర్సిటీలోని వందలాది ఎకరాల భూమి ఆక్రమించుకున్న కబ్జాదారులు రిజిస్ట్రేషన్, ఇండ్ల నిర్మాణం అనుమతి కోసం నకిలీ సర్వే నెంబర్లు వేసి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగాయి. వర్సిటీ భూములు కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగానే భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు కాకతీయ యూనివర్సిటీకి వీసీగా పనిచేశారు తాటికొండ రమేష్. ఈయన హయాంలో సమయంలోనే ఆయన అనుచరులు సహా పలువురు కబ్జాదారులు రెచ్చిపోయి వర్సిటీ భూములు కబ్జా చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో వేసిన హద్దులు, ఏర్పాటు చేసిన బోర్డులు దాటి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు.

ప్రహరీ సరే.. కబ్జాల సంగతేంటి..?

అనేక సంవత్సరాలుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు చూసి రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ యూనివర్సిటీ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. చుట్టూ 10 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మాణం కోసం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే, అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. యూనివర్సిటీ భూముల లెక్క తేల్చకుండా, హద్దులు నిర్ణయించకుండా ప్రహరీ నిర్మాణం చేస్తే నష్టం చేసి అక్రమార్కులకు లాభం చేసినట్టే అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెద్దలు భూముల లెక్క తేల్చకుండానే ప్రహరీ నిర్మాణం చేసి చేతులు దులుపుకుని కబ్జాలకు పాల్పడ్డ వారికి లాభం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారా అనే అనుమానాలను లేవనెత్తుతున్నారు. అక్రమార్కుల ఆట కట్టించి, భూముల సర్వే చేసి, హద్దులు నిర్ణయించిన తరువాత ప్రహరీ నిర్మాణం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

పోరాటాలు చేసినా వీసీ పట్టించుకోలేదు
యూనివర్సిటీ భూమి అన్యాక్రాంతం అవుతున్న విషయం అనేకసార్లు అప్పటి వీసీ తాటికొండ రమేష్ దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందించలేదు. ఆయన అవినీతిలో భాగస్వామిగా ఉండే వ్యక్తి సహా ఆయన అనుచరులు భూ ఆక్రమణకు పాల్పడ్డారు. ప్రభుత్వం స్పందించి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం శుభపరిణామం. కానీ యూనివర్సిటీ భూమి ఎంత? అనేది సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి నిర్మాణం చేపట్టాలి. – మాచర్ల రాంబాబు, కేయూ విద్యార్థి

అధికారుల తీరులో మార్పు రాలేదు
600 ఎకరాలకు పైగా ఉండాల్సిన కేయూ భూముల్లో 200 ఎకరాల వరకు కబ్జా అయింది. అధికారుల తీరులో మార్పు రావడం లేదు. యూనివర్సిటీల సంస్కరణకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకోవాలి. – ఆరేగంటి నాగరాజు, కేయూ విద్యార్థి

ఇంచార్జ్ వీసీపై నమ్మకం ఉంది
భూములు కబ్జా అవుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా, ఆందోళనలు చేసినా గత వీసీ రమేష్ పట్టించుకోలేదు. కొత్తగా వచ్చిన ఇంచార్జ్ వీసీ వాకాటి కరుణపై మాకు నమ్మకం ఉంది. ఆమె గతంలో వరంగల్‌లో పని చేసిన సమయంలో కేయూ భూములు సహా ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. – రాజు నాయక్, కేయూ విద్యార్థి

10 కిలోమీటర్ల వరకు కాంపౌండ్ వాల్
కేయూ భూముల కబ్జా వ్యవహారంపై ఆడిషినల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసాం. ఎలాంటి ఆక్రమణలు ఉన్నా వాటిని కూల్చేస్తాం. భౌతికంగా సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తాం. హద్దులు నిర్ణయించిన తరువాత ప్రహరీ నిర్మాణం చేస్తాం. – వాసుదేవ రెడ్డి, కేయూ డెవలప్మెంట్ ఆఫీసర్

వర్సిటీ భూమి ఇంచు కూడా వదిలేయం
కేయూ భూముల పరిరక్షణ కోసం ఇంచార్జ్ వీసీ కరుణ పట్టుదలతో ఉన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం రూ.10 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తరువాత కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతాం. – మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్

Tags

Related News

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Big Stories

×