EPAPER
Kirrak Couples Episode 1

Jubilee Hills Scam: జూబ్లీ గ్యారేజ్.. ఇచట ఏదైనా సాధ్యమే!, దందాకో రేటు.. లాబీయిస్టులదే రైటు!

Jubilee Hills Scam: జూబ్లీ గ్యారేజ్.. ఇచట ఏదైనా సాధ్యమే!, దందాకో రేటు.. లాబీయిస్టులదే రైటు!

Jubilee Hills Scam:  ది జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్. పేరుకే బడాబాబుల సొసైటీ. తెర వెనుక అంతా స్కాముల పంచాయితీ. సొసైటీలో నాన్ అలాటీస్ పేరుతో రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు సభ్యులకే కాదు, విషయం తెలిసిన ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.


బడాబాబుల సొసైటీలో సభ్యత్వాల స్కామ్
800 మందికి కేవైసీ లేదని రద్దుకు ప్రయత్నాలు
ఆ వెంటనే, ఒక్కోటి రూ.5 లక్షలకే అక్రమంగా అమ్మకాలు
టైటిల్ లేని రూ.2,500 కోట్ల ప్రాజెక్ట్‌ని చూపిస్తూ లాబీయింగ్
జూబ్లీ క్లబ్‌లో మెంబర్ షిప్ ఆశగా చూపించి తెర వెనుక దందా
అధిక మొత్తంలో చెల్లించి ఎగబడుతున్న జనాలు?
ఈ ప్రీలాంచ్ అమ్మకాలపై ఇప్పటికే రెరాలో ఫిర్యాదు
అక్రమ బదలాయింపులపై రిజిస్ట్రార్‌కు కంప్లయింట్
51 దర్యాప్తు రిపోర్టులో సంచలనాలు
అమలు చేయొద్దంటూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు
లిటిగేషన్ ల్యాండ్‌లో రియల్ స్కామ్ చేస్తున్నదెవరు?
అంతా ఆలోచించి బుక్ చేసుకుంటే బెటర్
లేదంటే మరో సాహితీ స్కామ్‌లా అవ్వొచ్చని సభ్యుల సూచన
రూల్సూ గీల్సూ జాన్తా నై అంటున్న జూబ్లీహిల్స్ బడాబాబుల సొసైటీపై స్పెషల్ – పార్ట్ 2

దేవేందర్‌ రెడ్డి చింతకుంట్ల, 9848070809


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ది జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్. పేరుకే బడాబాబుల సొసైటీ. తెర వెనుక అంతా స్కాముల పంచాయితీ. సొసైటీలో నాన్ అలాటీస్ పేరుతో రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు సభ్యులకే కాదు, విషయం తెలిసిన ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రాబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో సభ్యులకు అన్ని విషయాలు తెలిసేలా చేస్తామని నాన్ అలాటీస్ అంటున్నారు. 4976 మంది ఉన్న జూబ్లీహిల్స్ సొసైటీలో 3035 మందికి ప్లాట్స్ అలాట్మెంట్ జరిగింది. మిగిలిన 1941 మంది సభ్యులు 30 ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరందరికి న్యాయం చేయాలని పాలకమండలి ఆలోచిస్తోంది. అయితే ఆ ఆలోచనలు ఆర్థిక లావాదేవీలతో కూడుకోవడంతో భారీ స్కాంకి తెరతీస్తున్నారని తెలుస్తోంది. నాన్ అలాటీస్‌లో 800 మంది సభ్యులు కేవైసీ చేయించుకోలేదని వారి సభ్యత్వం రద్దు చేశామని సొసైటీ ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది.

 

రూల్స్ పాటించం.. అన్నీ మేనేజ్ చేస్తాం!

800 మంది సభ్యుల సభ్యత్వాన్ని ఇంకా సొసైటీ రిజిస్ట్రార్ రద్దు చేయలేదు. కానీ, ఆ 800 మందికి మంచిరేవులో అపార్ట్మెంట్స్ నిర్మించి ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. 13.30 గుంటల భూమిలో హైరేంజ్ అపార్ట్మెంట్స్‌లో 1900 ఫ్లాట్స్ వచ్చేలా ప్లాన్ గీశారు. అందమైన బ్రౌచర్ ఏర్పాటు చేసి రూ.5 లక్షలు నాన్ రీఫండబుల్ అంటూ సొసైటీ పేరు మీదగా తీసుకుంటున్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం 10 శాతం కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లిస్ట్ ఉండరాదని ఎన్నోసార్లు హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని పట్టించుకోకుండా 40 శాతం మంది ఎక్కువ ఉన్నా కూడా, సరెండర్, రద్దు లేకుండానే కొత్త సభ్యత్వాలు ఇస్తున్నారు. రూల్ 11(ఏ) ప్రకారం అలాట్మెంట్ కాకుండా సభ్యత్వ బదలాయింపులు ఉండరాదు. ఉన్నా అది నామినీలకు మాత్రమే ఉంటుంది. కానీ, ఇక్కడ అమ్ముకుంటూ ట్రాన్స్‌ఫర్ చేయాలని పాలక మండలికి విన్నవిస్తున్నారు. బదులాయింపులు కూడా యథేచ్ఛగా ప్రొత్సహిస్తున్నారు. ఇలా తెర వెనుక సభ్యత్వాలపై లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచారం.

 

టైటిల్, దారి లేని ల్యాండ్‌లో పెట్టుబడులు

మంచిరేవులలో నాన్ అలాటీస్‌కి 40 అంతస్తుల భవంతులు నిర్మిస్తామని సొసైటీ చెబుతోంది. ట్విస్ట్ ఏంటంటే, బ్రౌచర్‌లో చూపించే ల్యాండ్ టింబర్ లేక్ ఎఫ్‌టీ‌ఎల్‌ పరిధిలోకి వస్తోంది. పక్కనే ఉండే వేణుగోపాల స్వామి ఆలయ భూముల్లో ఉండే సర్వే నెంబర్స్‌లో భూమి ఖాళీగా ఉంది. అసలు టైటిల్ ఉన్న భూమి అక్కడ లభించడం లేదు. ఉన్న కొద్దిపాటి భూమికి కూడా సొసైటీకి అగ్రిమెంట్ కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్లు చూపిస్తున్న 13 ఎకరాలతో పాటు చుట్టూ ఉన్న 20 ఎకరాలపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ చేసింది. 292, 293, 294 సర్వే నెంబర్స్‌లో 52 ఎకరాల వేణుగోపాల స్వామి ఎండోమెంట్ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయి. సర్వే నెంబర్ 231, 232, 234లోని 680 గుంటల ఎస్టేట్ భూమిపై కోర్టు స్టే ఉంది. 236, 237లో 129 గుంటల్లో ఇప్పటికే ఇళ్లు ఉన్నాయి. 263 సర్వే నెంబర్‌లో 68 గుంటలు ఎల్బీనగర్ కోర్టు (ఓఎస్ నెంబర్ 859/2017) లో, 264లోని 104 గుంటలు హైకోర్టు (రిట్ నెంబర్ 33556/2013) లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చుట్టూ ఉన్న 265, 266, 267 సర్వే నెంబర్స్ కూడా హైకోర్టులో పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ, భూమి అంతా వేరే వారు పొజిషన్‌లో ఉన్నారు. వీరు క్లీన్ చేసి ఇదే భూమి అని చూపిస్తున్న ప్రాంతంలో 4 ఎకరాలు మాత్రమే టైటిల్ క్లియర్‌గా ఉంది. మిగితా అంతా దేవాదాయ, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు ధరణిలో క్లియర్‌గా కనిపిస్తోంది. పైగా, ఈ భూమికి దారి కూడా లేదు. అందుకు 2 ఎకరాలు కావాల్సిందిగా దేవాదాయ శాఖను కోరుతున్నారు. ప్రభుత్వ భూమి ఇస్తే వేరే చోట 2 ఎకరాలు ఇస్తామని అంటున్నారు. ఆ ప్రభుత్వ భూమి విలువ అక్షరాలా 120 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇలా ఏదీ సరిగ్గా లేకుండానే జూబ్లీహిల్స్ క్లబ్‌లో మెంబర్ షిప్ ఇస్తామనే ఆశతో భారీగా నగదు చేతులు మారుతుండటంపై బడా స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ప్లాట్ బుక్ చేసుకున్న వారికి ఏం జరిగినా అడిగే రైట్ లేదంటూ డిక్లరేషన్ తీసుకుంటున్నారు. అసలు సొసైటీ భూమి కొనుగోలు చేయాలంటే కలెక్టర్ నుంచి అనుమతి అవసరం. నాన్ అలాటీస్ 10 శాతం మించరాదని యాక్ట్ చెబుతోంది. అగ్రిమెంట్, దారి లేని భూమిలో 40 అంతస్తులు, 46 లక్షల స్క్వేర్ ఫీట్ల భవంతులు అంటూ ఊదరగొడుతున్నారు. రెండేళ్ల నుంచి ఈ బ్యాక్ డోర్ కొనుగోళ్ల వ్యవహారాన్ని నడిపిస్తున్నారని సమాచారం. ఈ కొనుగోళ్లపై అన్ని ఆధారాలతో రెరాకి మాజీ సెక్రెటరీ హన్మంత్ రావు ఫిర్యాదు చేశామని అంటున్నారు.

ఆంధ్రా వాళ్లకే.. ఆ సామాజిక వర్గాలకే!

ఎలాంటి టైటిల్ లేకున్నా, మోసాలు జరుగుతున్నాయని తెలిసినా, చట్ట పరంగా కోర్టులో నిలబడాలని చెబుతున్నా జనాలు సభ్యత్వం కోసం ఎగబడుతున్నారు. అయితే, తమ మాట వినే ఏపీకి చెందిన వారికి, కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ఇస్తుండటంతో తెలంగాణ ప్రాంతం వారు మెంబర్ షిప్‌పై గుర్రుగా ఉన్నారు. వారందరికీ ఓటు హక్కు రాబోతోందని దాంతో ఎలక్షన్స్‌ని మరో 20 ఏండ్లు గుప్పిట్లో పెట్టుకోవచ్చని, సభ్యత్వం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మెంబర్ షిప్ కోసం ఆరాటం

జూబ్లీ క్లబ్‌లో మెంబర్ షిప్ కావాలంటే రూ.35 లక్షలు చెల్లించాలి. అయినా అసోసియేట్ మెంబరే అవుతారు. ఓటు హక్కు ఉండదు. పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు సభ్యులు కాలేరు. కానీ, కొత్తగా ఇచ్చే 800 మందికి సభ్యత్వం తీసుకుంటే కుటుంబం అంతా రూ.15 లక్షలకే ఇస్తామని ఆశ పెడుతున్నారు. దీంతో సొసైటీలో, క్లబ్‌లో ఓటు హక్కు ఉంటుందని, స్టేటస్‌కి సింబల్‌గా చూసుకుని రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ అయినా, మరో రూ.5 లక్షలు బాక్ డోర్‌లో అయినా ఇచ్చేసి సభ్యత్వం తీసుకునేందుకు కొందరు ఆరాటపడుతున్నారు.

దర్యాప్తుపై స్టే కోసం లంచ్ మోషన్

జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమ కేటాయింపులపై రిజిస్ట్రార్ సెక్షన్ 51 దర్యాప్తు పూర్తి చేశారు. కానీ, ఇంత వరకు చర్యలు తీసుకున్నది లేదు. దీనిపై కోర్టు ధిక్కరణగా కేసు నడుస్తోందని తెలుస్తోంది. 51 రిపోర్టు సమర్పించడంతో దాన్ని అమలు చేసేలా 29న జరిగే జనరల్ బాడీ మీటింగ్ నిర్ణయం తీసుకోవద్దని మాజీ ప్రెసిడెంట్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జస్టిస్ శరత్ ధర్మాసనం లంచ్ మోషన్‌కి ఒప్పుకోలేదు. సొమవారానికి వాయిదా వేయడంతో ఆదివారం జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ ఎలా ఉండబోతుందని జూబ్లీహిల్స్‌లో టెన్షన్ నెలకొంది.

51 దర్యాప్తులో ఏముంది? (ఫస్ట్ పేజ్.. బాక్స్ ఐటమ్)

బడాబాబులు కలిసి ప్రభుత్వ ప్రదేశాలను ఎలా అమ్ముకున్నారు? తక్కువ ధరకు విక్రయించిన అక్రమాలపై ఎంత చెల్లించమన్నారు? మెగాస్టార్ చిరంజీవికి తగలబోయే షాక్ ఎలా ఉంటుంది? మేఘా కృష్ణారెడ్డి ఉంటున్న ఇంటిలో ప్రభుత్వ స్థలం ఎంత ఉంది? కాస్ట్లీ ఏరియాలో గజం 3 లక్షలు పలుకుతుంది, అలాంటి ప్రాంతంలో 251 ఎకరాల రూ.36 వేల కోట్ల విలువ చేసే పార్క్ ప్లేస్ ఇప్పుడు ఎంత ఉంది? ప్రభుత్వ భూములన్నింటి పైనా హైడ్రా ఎలా వ్యవహరిచతోతోంది? ప్రభుత్వ స్థలాలైన ఓపెన్ స్పేస్‌లు ఎలా అమ్ముకున్నారు? దర్యాప్తుల రిపోర్టుల్లో ఏముందో స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్స్‌క్లూజివ్‌గా పార్ట్ 3లో మీ ముందు ఉంచబోతోంది.
పూర్తి కథనం…

 

 

 

 

Related News

President Draupadi Murmu: కాసేపట్లో హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లొద్దు!

Kaleshwaram Commission : ఏమా తడబాటు… ఈఎన్సీపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం

Cm Revanth Reddy: సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. చారిత్రాత్మక భవనాలను మహర్దశ

High court on Hydra : హైడ్రాపై హైకోర్టు కన్నెర్ర.. కమీషనర్ రంగనాథ్‌కు నోటీసులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Big Stories

×