EPAPER
Kirrak Couples Episode 1

Israel-Hezbollah War: భూతల దాడులు.. కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యం!

Israel-Hezbollah War: భూతల దాడులు.. కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యం!

లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాద గ్రూపు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ఆగట్లేదు. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్‌ సేనలు.. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి దాటాక లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. ఆ రోజు ఉదయం నుండి అంతర్జాతీయ మీడియా ఇజ్రాయెల్ భూతల దాడులకు సిద్ధమవుతుందని కథనాలు ప్రచురించాయి. ఇజ్రాయెల్‌ మాత్రం అర్ధరాత్రి అధికారికంగా నిర్ధారించింది. ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో లెబనాన్‌ సైన్యం సరిహద్దుల్లోని రమిష్‌, అబూషానన్‌ ప్రాంతాల్లోని పోస్టుల్లోంచి వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, అర్థరాత్రి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్-IDF యుద్ధట్యాంకులతో లెబనాన్‌లోని అల్‌-వజానీ, అల్‌-ఖియామ్‌ వైపు దూసుకెళ్లాయి. ఆ ప్రాంతాల్లో యుద్ధట్యాంకులు, ఫిరంగులతో దాడులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో లెబనాన్‌ మరో గాజాలా మారనుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు హమాస్ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఇప్పుడు హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌ను ఏం చేస్తుందో అని అంతర్జాతీయంగా ఆందోళన మొదలయ్యింది.

ఇటీవల లెబనాన్‌లో కొనసాగుతున్న ఇజ్రాయేల్ దాడుల్లో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 6 వేల మందికి పైగా గాయపడ్డారు. 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా సుమారు లక్ష మంది లెబనాన్‌ను వదిలి సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఐరాస 79వ వార్షిక సర్వప్రతినిధి సభలో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. పూర్తిస్థాయి యుద్ధం ఎవరికీ ఉపయోగకరం కాదని, హింసను ఎగదోసుకుంటూ పోవడం కంటే దౌత్యపరమైన పరిష్కారమే శాంతికి మార్గమని బైడెన్ సూచించారు. అయితే, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎవ్వరి మాటా వినడానికి సిద్ధంగా లేదు. అమెరికా, ఫ్రాన్స్‌లు 21 రోజుల కాల్పుల విరమణ ప్రకటించాలని విజ్ఞప్తి చేసిన తర్వాతే.. దాదాపు, రెండు వందల బాంబులు వేసి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టింది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత లెబనాన్‌లో భూతల దాడులకు దిగింది.


Also Read: యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

నిజానికి, నస్రల్లాను చంపిన తర్వాత ఇజ్రాయెల్ యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులపై తెగబడుతుందని కొందరు ఊహించారు. అయితే, ఇజ్రాయెల్ స్కెచ్ మార్చింది. యుద్ధాన్ని మరో దశకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 29 నుంచి యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై వైమానికి దాడులు చేస్తూనే. గత నాలుగు రోజులుగా 2 వేలకు పైగా హెజ్బొల్లా స్థావరాలపై లక్షిత దాడులు చేసింది. ఇప్పుడు, లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా మిలటరీ సదుపాయాలే లక్ష్యంగా భూతల దాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై దాడులు జరుగుతాయిని నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం మేరుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు హిజ్బుల్లా సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేస్తోంది. ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే యెమెన్‌ కేంద్రంగా పని చేసే హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. ఇజ్రాయెల్‌ దాడిలో మరణించిన హిజ్బుల్లా నాయకుడు మహమ్మద్‌ స్రుర్‌ మృతికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని హౌతీలు ప్రకటించారు. ఇక, హౌతిలు లక్ష్యంగా సిరియాలోని డమాస్కస్‌పైనా కూడా ఇజ్రాయెల్‌ దాడికి దిగింది.

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత హిజ్బుల్లా సీనియర్ నాయకుడు చేసిన మొదటి ప్రకటన సెప్టెంబర్ 30న వెలువడింది. హసన్ స్థానంలో ఎవరు? అన్న ప్రశ్నపై త్వరలో కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హిజ్బుల్లా ఉపనేత నయీమ్ ఖాసిం తెలిపారు. యుద్ధం చాలాకాలం కొనసాగవచ్చని కూడా అన్నారు. ‘హిజ్బుల్లాకు చాలా ఆప్షన్లు ఉన్నాయనీ… ఇజ్రాయెల్ భూతల దాడులు మొదలుపెట్టినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని’ తెలిపారు. ‘పెద్ద ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ హిజ్బుల్లా ఇంకా నిలబడే ఉందని’ స్పష్టం చేశారు. అయితే, ఈ యుద్ధం ఏ స్థాయికి వెళ్లినా ప్రతిఘటన ఇంకా బలంగా కొనసాగుతుందని హిజ్బుల్లా చెబుతోంది. అయితే, ఇప్పుడు లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు పెరగిన నేపథ్యంలో అందరి కళ్లూ ఇరాన్‌ వైపు మళ్లుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.

ఇక, ఇటీవల, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇచ్చిన ప్రసంగంలో.. ‘లెబనాన్‌ సరిహద్దులో మా లక్ష్యాలు సాధించే వరకు హిజ్బుల్లాను తుదముట్టించే వరకూ యుద్ధం చేస్తామని’ ప్రకటించారు. ‘ఇజ్రాయెల్‌కు ఉన్న ముప్పును తొలగించడానికి.. ఇజ్రాయెల్ పౌరులను వారి ఇండ్లకు సురక్షితంగా చేర్చడానికి… ఇజ్రాయెల్‌కు అన్ని హక్కులు ఉన్నాయని’ అన్నారు. ‘ఎల్‌పాసో, శాన్‌డియాగోను ఉగ్రవాదులు ఘోస్ట్‌ టౌన్‌లుగా మారిస్తే అమెరికా సహిస్తుందా?’ కానీ, ఇజ్రాయెల్‌ ఏడాదిగా సహిస్తుందనీ.. హమాస్‌ లొంగిపోతేనే యుద్ధం ముగుస్తుందనీ… లేకపోతే విజయం సాధించే వరకు ఇజ్రాయెల్ పోరాటం కొనసాగుతుంది’ అని నెతన్యాహూ స్పష్టం చేశారు. అంతేకాదు, ‘ఇరాన్‌లో కూడా తాము చేరుకోలేని ప్రాంతం అంటూ ఏదీ లేదని’ హెచ్చరించారు.

Related News

Kolikapudi Srinivasa Rao: కొలికపూడి వివాదంలో కొత్త ట్విస్ట్.. అరెస్ట్ తప్పదా

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్ట్‌కి కేంద్రం ఏం చెప్పబోతోంది?

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Big Stories

×