EPAPER

Reservations: ప్రైవేటులో రిజర్వేషన్లు అసాధ్యమా?

Reservations: ప్రైవేటులో రిజర్వేషన్లు అసాధ్యమా?

Private Sector: తమ రాష్ట్రంలోని ప్రైవేట్‌ కంపెనీల్లో గ్రూప్‌ సి, గ్రూప్‌ డి ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జులై మూడవ వారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన సోషల్ మీడియాలో చేసిన ప్రకటన కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. ఇందుకు సంబంధించిన ‘స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోక‌ల్ ఇండ‌స్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్ 2024’ను ముందురోజే తమ కేబినెట్ ఆమోదించిందించినీ ఆయన బయటపెట్టారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నాస్కామ్ ప్రకటన చేసింది. ఏకపక్షంగా, వివక్షపూరితంగా ఉన్న ఈ బిల్లు అమలైతే బెంగళూరులోని ఐటీ పరిశ్రమ కుప్పకూలడం ఖాయమని, ఇదే జరిగితే పరిశ్రమలు రాష్ట్రం దాటి పోవటం ఖాయమని ఆయా సంస్థల ప్రతినిధులు, అసోచామ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త బిల్లు చట్టమైతే నాన్-మేనేజ్‌మెంట్ స్థాయిలో 70 శాతం, మేనేజ్‌మెంట్ స్థాయిలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండేది. అయితే, దీనిపై పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటన కారణంగా.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పరిశ్రమ వర్గాలతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. మరోవైపు, ప్రైవేట్‌ కంపెనీల్లో కిందిస్థాయి ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన తన పోస్టును సీఎం సిద్ధరామయ్య డిలీట్ చేశారు. ఈ ఘటన తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చకు వచ్చింది.


నిజానికి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనేది ఏళ్లుగా చర్చల్లో నలుగుతూనే వస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు వర్గీకరణ సబబేనంటూ తీర్పు ఇచ్చిన సందర్భంగా జరిగిన చర్చలో.. ఎస్సీలంతా ఒక్కటై ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకై పోరాడాలని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు సామాజిక వేత్తలూ ప్రైవేటులో రిజర్వేషన్లు న్యాయమని చెబుతున్నారు. ప్రభుత్వాలు.. ప్రైవేటు రంగంలో పరిశ్రమలు, కంపెనీలు నెలకొల్పడానికి ఎన్నో పన్ను రాయితీలు, సబ్సిడీలతో బాటు తక్కువ ధరకే ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నాయని, కనుక సమాజంలో వెనకబడిన వారికి ఆ సంస్థల కొలువుల్లో హక్కు ఉంటుందని వీరి వాదన. అలాగే గ్లోబలైజేషన్, 1991 ఆర్థిక సంస్కరణలతో 1957లో 85 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగం ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందనీ, ఇప్పడు మిగిలిన ఆ గుప్పెడు ప్రభుత్వ రంగ సంస్థలనూ కేంద్రం పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో (పీపీపీ) ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తోంది గనుక ప్రైవేటులో రిజర్వేషన్లు ఇవ్వటం న్యాయమేననేది వీరి వాదన. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లోని లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్రం విత్‌డ్రా చేసుకున్నందున, దీంతో రిజర్వేషన్ల కింద రావాల్సిన 1.5 లక్షల ఉద్యోగాలను రిజర్వుడు వర్గాలు కోల్పోయాయి గనుక వారికి ఈ రూపంలో న్యాయం చేయటం అవసరమని, దీనివల్ల కొంతైనా ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయనేది వారి వాదన.

మరోవైపు, మనదేశంలో జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 17%, ఎస్టీలు 9% ఉండగా, నేటికీ 1981 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్ల అమలు జరుగుతోంది. దీనివల్ల ఈ మూడున్నర దశాబ్దాల్లో రిజర్వుడు వర్గాలకు దక్కాల్సిన 35% ప్రభుత్వ కొలువులు వేరే వర్గాలకు దక్కాయి. మరోవైపు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వల్ల సమాజపు ఉమ్మడి వనరుల మీద పెత్తనం గుప్పెడు వర్గాలకే దక్కుతోంది. ఒకవైపు ప్రభుత్వ బ్యాంకుల రుణాల్లో మెజారిటీ కార్పొరేట్లకే దక్కటంతో విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, రవాణా, మార్కెట్, రక్షణ వంటి అంశాలలోనూ వారి హవాయే సాగుతున్నప్పుడు.. ఇక వారి సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వటానికి ఉన్న అభ్యంతరమేంటని సామాజిక వేత్తల ప్రశ్న. అలాగే, 1978లో జనతాపార్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీపీ మండల్ కమిషన్ ను ఏర్పాటు చేయగా, 1990లో కేంద్రం బీసీలకు 27% రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ అవకాశాల్లో కల్పించింది. కానీ, వాటి అమలు మాత్రం 2008 నుంచే ప్రారంభమయ్యాయి. అయితే, నేటికీ కేంద్రంలోని ఉన్నత ఉద్యోగాల్లో బీసీల వాటా నేటికీ 4 శాతంగా ఉండగా, ఎస్సీ, ఎస్టీల వాటా 5 శాతంగా ఉంది. మిలిటరీ, జ్యుడీషియల్ లాంటి చాలా వ్యవస్థల్లోనూ ఎలాగూ రిజర్వేషన్లే లేవు.


Also Read: Viral: రిస్కీ స్టంట్ వేశాడు.. నీట మునిగి మరణించాడు.. వీడియో వైరల్

రిజర్వేషన్ల అంశంపై చర్చ.. స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉంది. జ్యోతిబా పూలే 1882లోనే రిజర్వేషన్లు ఉండాలంటూ హంటర్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. 1902లో కొల్హాపూర్ ప్రాంతాలలో సాహు మహారాజ్.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కింది కులాలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. మనదేశంలోని బీసీల స్థితిగతులపై 1921లో తొలిసారిగా మిల్లర్ కమిటీని వేయగా, మైసూర్ సంస్థాన పాలకులు ఆ కమిటీ అంశాలను బట్టి కొన్ని శ్రామికకులాలను బీసీల జాబితాలోకి మార్చి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. 1935లో ట్రావెన్‌కోర్ సంస్థానంలోనూ రిజర్వేషన్లు అమలు పరిచారు. ఇలాంటి అనేక ప్రయోగాలు, పోరాటాల తర్వాత రాజ్యాంగంలో రిజర్వేషన్లను చేర్చి ఆర్టికల్ 15(1) ప్రకారం చట్టబద్ధత కల్పించారు. అయితే కుల ప్రతిపాదిత రిజర్వేషన్లు కుదరదని, ఆర్థిక స్థితి ఆధారంగానే వీటిని అమలు చేయాలని అగ్రవర్ణాలు సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు అనేది.. రాజ్యాంగంలో అందరికీ సమానహక్కులు, సౌకర్యాలు కల్పించాలనే స్ఫూర్తికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు దొరైరాజన్ కేసులో తీర్పునిచ్చింది. దీంతో రాజ్యాంగానికి తొలి సవరణ చేసి.. 1951లో ఆర్టికల్ 16కు క్లాజ్ 4ను చేర్చి సామాజికంగా వెనుకబాటుకు గురైనవారికి ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ల అమలు పదేండ్లకు మించి అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇక.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఆయా సంస్థల పనితీరు తగ్గుతుందని వాదించేవారూ ఉన్నారు. కానీ, అవన్నీ అపోహలేనని తేలిపోతుంది. దేశంలోని వ్యవసాయ రంగంలో కూలీలు, చిన్న రైతుల్లో మెజారిటీ దిగువకులాల వారే. ఇక చేతి వృత్తులు, కుటీర పరిశ్రమల్లో బీసీల భాగస్వామ్యమే నేటికీ ఉంది. అందరూ ఎస్టీలుగా ఉన్న అరుణాచల్​ప్రదేశ్ నేడు టూరిజం, ప్రకృతి వ్యవసాయంలో ముందుకు సాగిపోతోంది. అరకు కాఫీ నేడు యూరోపియన్ల డైనింగ్ టేబుళ్ల మీదికి చేరిందంటే అక్కడి గిరిజనుల ప్రతిభ మూలంగానేననే వాస్తవం మనకు అర్థమవుతూనే ఉంది. కనుక ప్రైవేటులో రిజర్వేషన్ల వల్ల ఆకాశం ఊడి మీద పడుతుందనే భయాలకు అర్థమే లేదు. మరోవైపు.. భారత రాజ్యాంగం అమలైన తొలిరోజు డా. అంబేద్కర్ రాజ్యాంగ సభలో మాట్లాడుతూ.. భారత సమాజం అనేక వైరుధ్యాల నడుమ కొత్త ప్రయాణం ప్రారంభిస్తుందనీ, రాజకీయాలలో ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తున్నప్పటికీ, సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరికీ ఒకే విలువ అనే ప్రాథమిక సూత్రాన్ని మన సమాజం తిరస్కరిస్తోందనే వాస్తవాన్ని వెల్లడించారు. ఈ వైరుధ్యాలను వీలున్నంత వేగంగా తగ్గిస్తేనే పోరాడి సాధించిన స్వరాజ్యం నిలబడుతుందని, అది జరగని నాడు.. వంచించబడిన వర్గాలు ఈ ప్రజాస్వామ్య వ్వవస్థను పెకలించి వేస్తారని హెచ్చరించారు. ఆయన చెప్పిన ఆదర్శ సమాజం నేటికీ నిర్మితం కాకపోగా, మన పాలకులు దేశ సహజ వనరులు, సంపదను కొన్ని వర్గాల చేతికి అప్పజెబుతున్న వేళ.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనే అంశంపై విస్త్రత చర్చ జరగాల్సి ఉంది.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×