టీడీపీని కలవరపెడుతున్న మామాకోడళ్ల మధ్య పొలిటికల్ రచ్చ
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం టీడీపీకి అత్యంత పట్టు ఉన్న నియోజకవర్గం. టీడిపి నుంచి పరిటాల రవి వరుసగా ఇక్కడి నుంచే గెలుపొందారు. పరిటాల రవి పోటీ చేసినప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే అక్కడ ఓడిపోయింది టీడీపి. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మామాకోడళ్ల మధ్య పొలిటికల్ రచ్చ టీడీపీని కలవరపెడుతోంది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఇరువురి మధ్య నడిచిన కోల్డ్ వార్.. ఇప్పుడు మరింత ముదురుతోందని అంటున్నారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ, ఎంపీ బీకే పార్థ సారధి మధ్య ఇప్పటికీ విభేదాలు.. కొనసాగుతూనే ఉండడంతో మధ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నలిగిపోతుండడం చర్చనీయాంశంగా మారుతోంది.
పెనుకొండ కేంద్రంగా చక్రం తిప్పుతూ వస్తున్న ఎంపీ బీకే
ఉమ్మడి ఆనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా కీలక పదవులు అధిరోహించారు బి.కె. పార్థసారధి. పెనుకొండ కేంద్రంగా చక్రం తిప్పుతూ వస్తున్నారు. దశాబ్దాలుగా ఒంటి చేత్తో రాజకీయాలు నడిపిన పార్థసారధికి.. మంత్రి సవితమ్మ రూపంలో.. సొంత పార్టీలో ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పెనుకొండ అసెంబ్లీ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నించారు. చివరకు సవితమ్మను టికెట్ వరించడంతో ఆ సమయంలో బికే మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత బికె. పార్థసారథికి హిందూపురం లోక్ సభ టికెట్ రావడం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.
మంత్రి సవితమ్మ రూపంలో సొంత పార్టీలో ఎదురుగాలి
ఇదే సమయంలో ఎవరు ఊహించని విధంగా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన సవితమ్మకు మంత్రి వర్గంలో స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుబెట్టుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు కనబడుతుండడం నేతలను కలవరపెడుతుందట.
అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నాలు
ప్రస్తుతం నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో మంత్రి సవితమ్మ నిమగ్నమయ్యారట. చౌక దుకాణాల డీలర్ షాపులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, సహా వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు.. ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారని చర్చ జరుగుతోంది. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారని బీకే వర్గీయులు ఆరోపిస్తున్నారట. అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై.. ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారట.
Also Read: నన్నే అవమానిస్తారా.. వేమిరెడ్డి టీటీపీకి హ్యాండ్ ఇస్తాడా..?
పట్టు నిలుబెట్టుకోవాలని ఎంపీ బీకే వ్యూహాలు
హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఎంపీ
మరోవైపు టీడీపీలో దశాబ్దాలుగా క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్న కొందరు మంత్రిని కలసి తమకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారట. అందుకు స్పందించిన మంత్రి.. మామ పార్థసారథితో ఫోన్ చేయించండి అని చెప్పినట్లు సమాచారం. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీకే చెప్పేది ఉండదు.. మంత్రి చేసేది ఉండదు.. అనుకోని నేతలు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారట. ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో.. కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు నలిగిపోతున్నారని వాపోతున్నారట. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి. నేతలంతా మంచి జోష్ లో ఉన్న తరుణంలో.. తమ నియోజకవర్గంలో మాత్రం పార్టీలో అధికారం ఉందనే ఆనందం పొందలేకపోతున్నామని కొందరు కార్యకర్తలు చెబుతున్నారట.
ఎన్టీఆర్ విగ్రహం భూమిపూజ సాక్షిగానే ఇరువర్గాలు గొడవ
కోల్డ్ వార్ నడుస్తున్న తరుణంలోనే రీసెంట్ గా.. మరో వివాదంతో ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయిందట పరిస్థితి. మంత్రి సవిత రొద్దం మండల కేంద్రంలో NTR విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్టీఆర్ విగ్రహం భూమిపూజ సాక్షిగానే ఇరువర్గాలు గొడవకు దిగారు. ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయుల నిరసనకు దిగారు. ఈ వ్యవహారంలో ఎంపీ పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో వీరిద్దరి మధ్య వార్ మరింత పీక్స్ కి చేరిందని చర్చించుకుంటున్నారు.
ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పరిస్థితిపై ఫోకస్
పెనుకొండలో ఇంత జరుగుతున్నా కానీ పార్టీ అధిష్టానం.. నోరు మెదపకపోవడం పట్ల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. అయితే.. ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తగిన సమయంలో ఇరువురూ నాయకులకు క్లాస్ తీసుకోవచ్చని ప్రచారం నడుస్తోంది. మరి ఈ మామకోడళ్ల కోల్డ్ వార్ కి ఎప్పుడు బ్రేక్ పడుతోంది అని క్యాడర్ ఎదురుచూస్తుంది.