అనంతపురం జిల్లా. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీకి 12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు వచ్చాయి. వైసీపీ హవాతో పాటు జగన్ మానియాతో.. ఫ్యాన్ పార్టీ అనుకోని విధంగా రిజల్ట్ సాధించింది. దీంతో జిల్లా మొత్తాన్ని దున్నేయ్యెచ్చుని భావించిన కొందరు.. తమకున్న స్థాయికి వ్యవహారాలు నడిపారట. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కంగుతింది. అధికారం కోల్పోయినా.. ఆ పార్టీ నేతల్లో మాత్రం మార్పు లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్షంగా ఉండి.. ప్రభుత్వ లోపాలపై ఎత్తి చూపాల్సిన నేతలు.. గ్రూపులుగా మారటం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ నేతలు.. తమంతటి వారు లేరనే విధంగా ప్రవర్తించారని సొంత క్యాడర్‌లోనే చర్చ సాగుతోంది. ఫ్యాన్ సునామీతో జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవటంతో.. కొందరి నేతల కనుసన్నల్లోనే పాలన జరిగిందట. దీనిపై అప్పుడే పార్టీలో ధిక్కార స్వరం వినిపించగా.. అధిష్టానం బుజ్జగించింది. ఆ ప్రభావం కూడా 2024 ఎన్నికల్లో చూపిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
2019లో విజయం సాధించాక.. రాజకీయంగా, ఆర్థికంగా వైసీపీ నాయకుల మాటే చెల్లుబాటు అయ్యే విధంగా మూడేళ్ల పాలన సాగిందట. తర్వాత అనంతపురం జిల్లాపై మాజీ మంత్రి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను పడింది. అక్కడ నుంచి అంతా తానై పార్టీని నడపటంతో .. చాలామంది నేతలూ ఇబ్బంది పడినట్లు సమాచారం. ఇవేమీ లెక్కచేయని పెద్దిరెడ్డి.. తన అనుచరులు, అనుకూలమైన మాజీ ఎమ్మెల్యేలతో ఎక్కడిఎక్క్కడే చెలరేగిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయ, ఆర్థిక నిర్ణయాలు అన్నీ కూడా పెద్దిరెడ్డి నియంత్రణలో నడిచేవట. ఆనాడు అతనికి ఎదురు తిరిగే సాహసం ఎవరూ చేయకపోవటంతో.. ఆడింది ఆటా.. పాడింది పాటగా.. పాలన సాగిందని..అదే 20204 ఎన్నికల్లో దెబ్బతీసిందనే కొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
జిల్లాలో అమీగోస్ పేరుతో విచ్చలవిడిగా.. మట్టి ,ఇసుక, గ్రావెల్ తవ్వకాలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి కోట్లు దోచుకున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేశారు. ఆ వార్తలను నిజం చేసేలా.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. రాయల్టీ వసూలు పేరుతో వైసీపీ నాయకుల్ని కూడా ఆయన హింసించాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. జిల్లాలో ముఖ్యమైన వైసీపీ నాయకులంతా పెద్దిరెడ్డి బాధితులే అనే టాక్ కూడా నడిచింది. అధినేతకు అత్యంత సన్నిహితుడు కావటంతో ఆయనకు అడ్డంకి లేకుండా పోయిందట. ఒకవేళ ఎదురు తిరిగినా తర్వాత తమ రాజకీయ పరిస్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే భయంతో కొందరు సైలెంట్‌గా ఉండిపోయారట. ఆయన ఏం చెప్పినా.. ఏం చేసినా.. జీ-హుజూర్ అంటూ వంటపాడటం నేర్చుకున్నారట.
గత ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి.. తాను అనుకున్నవారికే టికెట్లు ఇప్పించుకున్నారనేది బహిరంగ రహస్యమే. ఎవరైతే తన దందాలకు అడ్డు వచ్చారో.. లేక తన వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టాలని చూశారో… అందర్నీ మార్చేసి.. తన.. అనుకున్న వారికే టిక్కెట్లు ఇప్పించుకున్నారట. రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల, కదిరి, హిందూపురం పార్లమెంట్, హిందూపురం అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్, పెనుగొండలో అభ్యర్థులను మార్చి…తనకు అనుకూలమైన వారికి ఇప్పించుకోవటంతో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. దీంతో చాలామంది అసంతృప్తికీ గురయ్యారని… అదే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన పెద్దిరెడ్డిని మందలించిన దాఖలాలు లేవని పార్టీలో నాడు చర్చసాగిందట. అప్పటి నుంచి జిల్లాలో పెద్దిరెడ్డిపై వ్యతిరేకత మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అయ్యోపాపం తొడ కొట్టాడు.. దాక్కొని వెళ్తున్నాడు
పెనుగొండలో మాజీమంత్రి శంకర్ నారాయణ అనుచరులు… అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చెప్పులతో దాడికి యత్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన రామచంద్రారెడ్డి… ఆయన టికెట్ మార్చి తీరాలని కంకణం కట్టుకున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. అనుకున్నట్టుగానే మాజీమంత్రి శంకర్ నారాయణను పెనుగొండ నుంచి అనంతపురం పార్లమెంట్‌కు.. అధిష్టానం మార్చేసింది. పెనుగొండ అసెంబ్లీ స్థానానికి కల్యాణదుర్గం నుంచి తనకు అనుకూలమైన ఉష శ్రీ చరణ్‌ను పెద్దిరెడ్డి బరిలో దింపారట. దీంతో శంకర్ నారాయణ.. తనకు ఇష్టం లేకపోయినా సరే పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాల్సిన పరిస్ధితి నెలకొందని.. ఆయన వర్గీయులే చెప్పుకున్నారట. కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డిని కాదని… తన అనుచరుడు మక్బూల్ బాషాను అభ్యర్థిగా రంగంలోకి దించారు. మక్బూల్ బాషా అంటే ఎవరో కూడా అక్కడ ప్రజలకు తెలియదట. దీంతో శిద్దారెడ్డి వైసీపీకి దూరంగా ఉంటూ మక్బూల్ ఓటమికి కృషి చేశారనే టాక్ అప్పట్లో తీవ్రంగా నడిచింది.
ఒకటా రెండా.. ఇలా తనకు అనుకూలంగా లేని నేతలను మార్చేసి.. అనుకూలమైన వ్యక్తులను, అనుచరులను పోటీకి దించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ఓటమికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణం అయ్యారనే సొంత పార్టీ నేతలే విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ వరకూ ఓకే.. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాతా పెద్దిరెడ్డి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదట. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ పదవుల్లోనూ.. అనుకున్న వారినే కూర్చోబెట్టేందుకు పాకులాడుతున్నాడట. ఇటీవల పెనుగొండ నియోజకవర్గంలో మాజీమంత్రులు ఉషశ్రీ చరణ్,శంకర్ నారాయణ వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. ఈ పంచాయితీ కాస్తా.. అధిష్టానం పెద్దలకు చేరింది. అధినేత జగన్ కూడా పెద్దిరెడ్డి ఎలా చెప్తే.. అలా వినాలని శంకర్ నారాయణను ఆదేశించిందట. పదేళ్లపాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన శంకర్ నారాయణ. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోయారనే వార్తలు గుప్పుమన్నాయి.
అనంతపురం జిల్లాలో మెజార్టీ ఓటర్లుగా కురుబ సామాజికవర్గం ఉంది. అక్కడ కూడా పెద్దిరెడ్డి తమదైన మార్కు రాజకీయం చేయటంతో.. ఓటర్లలో గందరగోళ పరిస్థితి నెలకొందట. రాయదుర్గంలోనూ సేమ్ సిట్యువేషన్ నెలకొందని టాక్ నడిచింది. బీసీ నాయకుడైన కాపు రామచంద్రారెడ్డిని కాకుండా మెట్టు గోవిందారెడ్డిని అసెంబ్లీ బరిలో నిలిపి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఓడిపోయేలా చేశారని.. పెద్దిరెడ్డిపై ఫ్యాన్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారట. నాటి నుంచి నేటి వరకూ ప్రతి నియోజకవర్గంలోనూ వేలుపెట్టిన పెద్దిరెడ్డి తీరుతో వైసీపీ శ్రేణులు లోలోన రగిలిపోయారట. ఒకవేళ అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే.. ఆ కేసు.. తిరిగి ఆయన వద్దకే రావటంతో.. ఏం చేయాలో తెలియక.. కొందరు విసుగు చెందారనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
గత ఎన్నికల తర్వాత జగన్ కూడా కొందరి నేతల తీరుపై దృష్టి సారించారట. పార్టీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావటానికి ఉన్న కారణాలపై అన్వేషణ చేస్తుండగా.. అనంతపురం జిల్లా నేతలు.. పెద్దిరెడ్డి అంశాన్ని అధినేత దృష్టికి మరోసారి తీసుకెళ్లారని తెలుస్తోంది. సీనియర్ వైసీపీ నాయకులంతా కలిసి పెద్దిరెడ్డి విషయంపై తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. రాయలసీమలో రాజకీయాలను పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పగించిన జగన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొందట.