EPAPER

Constitution: రాజ్యాంగ ఫలాలు కొందరికేనా?

Constitution: రాజ్యాంగ ఫలాలు కొందరికేనా?

Dr. BR Ambedkar: ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా, ఉత్తమమైనదైనా దానిని అమలు చేసే పాలకులు ఉత్తములు కాకపోతే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరవు’ అన్నారు డా. బి.ఆర్.అంబేద్కర్. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో పాలకులు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగించారు. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం అయింది. సాగునీటి ప్రాజెక్టులు, కొన్ని భారీ పరిశ్రమలు దేశంలో నెలకొల్పబడ్డాయి. తర్వాతి పదేళ్ల పాటు కూడా కొంత సానుకూల వాతావరణం కొనసాగినా, రాను రానూ అధికారమే లక్ష్యంగా సాగిన రాజకీయాల కారణంగా పాలన గాడితప్పుతూ వచ్చింది. ఎన్నికల్లో గెలుపు కోసం కుల, మత, ధన ప్రభావాలను నాయక శ్రేణి పెంచి పోషిస్తూ వచ్చింది. దీంతో రాజ్యాంగం అనేది అప్రస్తుతమనే భావన పాలక వర్గాలలో బలంగా ఏర్పడిపోతూ వచ్చింది.


‘రాజ్యాంగం అంటే పెత్తనం చెలాయించే సాధనం కాదని అది కేవలం సమాజంలో అసమానతలను చట్టబద్ధంగా తొలగించి నవ జీవనాన్ని క్రమ పద్ధతులలో నడిపే ఒక మార్గదర్శిగా ఉండాలని’ అంబేడ్కర్ కోరుకున్నారు. కానీ, ఇన్నేళ్ల స్వతంత్ర పాలనలో అత్యధిక సంఖ్యాకులైన సామాన్య ప్రజానీకం ప్రాథమిక అవసరాలైన నివాసం, విద్య, వైద్యాలకు దూరంగా ఉండిపోయారు. ఈ వర్గాల ప్రజల ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడుతూ అత్యంత దీన స్థితిలో తమ జీవితాలను వెళ్లదీస్తూ రావటం మనం చూస్తున్నాం. మరోవైపు దేశంలోని రాజకీయ పక్షాలు కుటుంబ పాలన, కుల, మత, వర్గ రాజకీయాల పేరుతో రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటూ ఇప్పుడున్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీల నేతలు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, దేశపు వాస్తవిక స్థితి, బహుళత్వపు విలువల కంటే.. తమ పార్టీ నేతల మనోభావాలకే పెద్దపీట వేస్తూ వారికి పూర్తి విధేయులుగా మారిపోవటం విషాదం. దీంతో ప్రజల సమస్యలను చర్చించాల్సిన చట్టసభలలో ఎలాంటి చర్చలు లేకుండానే దేశ భవిష్యత్తును నిర్ణయించే బిల్లులు అలవోకగా చట్టాలుగా మారిపోతున్నాయి. తమ కళ్లముందే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పటికీ, తాము ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వాలను, పార్టీలను సామాన్య ప్రజలు నిలదీయలేకపోవటం ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యపు బలహీనతగా మారిపోయింది. స్థానిక పాలనలోనూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సినంతగా మన పౌరుల చైతన్యం పడిపోవటంతో.. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సీఎం రాజకీయ ప్రచారం చేయాల్సి వస్తోంది. దీంతో కింది స్థాయిలో.. కొత్త నాయకత్వం రావటం లేదు. ఇదీ మన ప్రజాస్వామ్యం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు నిండినా, రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటివి పేదలు, దిగువ వర్గాలకు అందని ద్రాక్షగానే మిగిలాయి. మరోవైపు, పాలక వర్గాల ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో.. రాజ్యాధికారంలో తమకు న్యాయమైన వాటా దక్కటం లేదనే అసంతృప్తి దిగువ వర్గాల యువతలో పెరుగుతూ పోతోంది. దేశపు ఉమ్మడి వనరులలో తమ వాటాను తమ కళ్లముందే కార్పొరేట్లకు కట్టబెడుతున్న పాలక వర్గాలను నిలదీయటానికి వారికి వేదికలూ లేకుండా పోతున్నాయి. ఆర్టికల్‌ 14 సమాజంలో పౌరులందరూ సమానమేనని, ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి వివక్షత చూపరాదని చెబుతోంది. కానీ, ఇప్పట్లో ఇవేవీ బలహీన వర్గాలకు అందేలా కనిపించటం లేదు. సమాజంలో నేటికీ వారు ఏ హక్కులూ లేని, ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతుకుతున్నారు. విద్య, ఉద్యోగాల్లో వివక్షత, ఆదివాసీ, గిరిజనులు హక్కుల విషయంలో గళం విప్పిన కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరుగుతోంది. దీంతో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ దిగువ వర్గాల ప్రజలకే లేదా? అనే అనుమానం కలుగుతోంది. ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడటం, అందిన కాడికి అమ్మేసే ప్రక్రియ కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలే లేకుండా పోవటంతో విద్య, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా కోరే వాతావరణమే నేడు లేకుండా పోతోంది. ఉన్న ఉద్యోగాలనూ ఏళ్ల తరబడి భర్తీ చేయకుండా ఎన్నికల ముందు హడావుడి చేయటమే జరుగుతోంది. దీంతో దిగువ వర్గాలనుంచి చదువుకుని పట్టా పుచ్చుకున్న తొలితరం యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉపాధి లేని విద్య వారి కుటుంబాలను ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది.


Also Read: Kaleshwaram Project: కేసీఆర్ ఒత్తిడి వల్లే.. : కాళేశ్వరం విచారణ కమిషన్ విచారణలో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి

మరోవైపు మనదేశంలో ఎన్నికలు అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. చట్టసభలు ధనికుల అడ్డాలుగా మారుతున్నాయి. దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ బ్యాంకులనుంచి కార్పొరేట్లు తీసుకున్న రూ. 10.72 లక్షల కోట్ల ఋణాన్ని కేంద్రం మాఫీ చేసిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ రెండేళ్ల నాడు వెల్లడించింది. వీటిలో 85 శాతం రుణాలు కార్పొరేట్ కంపెనీలు చెల్లించాల్సినవే కావటం గమనార్హం. మరోవైపు, 2020-21లో బడా కార్పొరేట్స్ లాభం 5.5 లక్షల కోట్లు, 2021-22లో 9.3 లక్షల కోట్లతో దేశంలో గుప్పెడు మందితో కూడిన ప్రభుత్వ అనుకూల సూపర్ రిచ్‌ వర్గం బలపడింది. దేశంలోని ఒక శాతంగా ఉన్న ధనిక కుటుంబాల చేతిలో 42.5 శాతం, పది శాతం మంది చేతిలో 74.3శాతం, తొంభై శాతం చేతిలో 25.7 శాతం దేశ సంపద కేంద్రీకృతమైంది. విచిత్రంగా దేశంలో సగం జనాభా మొత్తం సంపద విలువ 2.8 శాతానికే పరిమితమైంది. గత రెండేళ్ల నుంచి ఈ సంపద కేంద్రీకృతం కావటం నిలకడగా సాగుతూనే ఉంది. ఈ ఆర్థిక గణాంకాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ధేశ జనాభాకు సరిపడా ఉద్యోగాల కల్పన జరగక నిరుద్యోగం పెరిగిపోతుండగా, ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకున్న యువత దేశం విడిచి, శాశ్వతంగా విదేశాలకు వలస పోతోంది. ఈ పరిణామాలను చూసినప్పుడు మన స్వాతంత్ర్యోద్యమం, మనం రాసుకున్న రాజ్యాంగపు లక్ష్యాలు నెరవేరలేదనే నిర్వేదం కలుగుతోంది.

చట్టసభల్లో గణనీయమైన మెజారిటీ సాధించిన తర్వాత పార్టీలు, అవి ఏర్పరచే ప్రభుత్వాల వైఖరి సామాన్యులను నివ్వెరపరుస్తోంది. ఒకవైపు అంతులేకుండా సాగుతున్న అధికార దుర్వినియోగం, చాపకింద నీరులా సాగే అవినీతి కారణంగా మన రాజ్యాంగం నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కుప్పకూలి పోయే వాతావరణం దేశంలో ఏర్పడుతోంది. ఈ కీలక సమయంలో మరోసారి రాజ్యాంగం, దాని లక్ష్యాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న పరిణామాల కారణంగా రాబోయే రోజుల్లో సంభవించబోయే పరిణామాల మీద విద్యాధికులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, విశేషించి పౌర సమాజం సమన్వయంతో కలిసి పనిచేయటమే గాక వర్తమాన సమాజంలో సంభవిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉంది. రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేస్తున్న శక్తులను ప్రతిఘటించేందుకు, రాజ్యాంగ వ్యవస్థల జవాబుదారీతనాన్ని పెంచేందుకు.. ఇప్పుడు దేశంలో మరిన్ని కొత్త వేదికలు, సరికొత్త కార్యాచరణల అవసరం మరింతగా ఉంది.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×