EPAPER

UN Security Council: ఇంకెంత కాలం వేచి చూడాలి.. మీరు మారరా..? సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌కు భారత్ హెచ్చరిక..

UN Security Council: ఇంకెంత కాలం వేచి చూడాలి.. మీరు మారరా..? సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌కు భారత్ హెచ్చరిక..

UN Security Council newsUN Security Council news(Telugu news updates): యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ను భారత్ హెచ్చరించింది. ఇంకెంత కాలం వేచి చూడాలి.. మీరు మారరా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. 80 వసంతాలు దాటుతున్నా మార్పు ఎందుకు లేదని అడిగింది. భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని బల్లగుద్ది మరీ వాదించింది. భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ, భారత్ వాదనేంటీ..? యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్‌లో రావాల్సిన మార్పులేంటీ..?


అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు ఇండియా ఎదుగుతున్న శక్తి. బహుపాక్షిక అంతర్జాతీయ సంస్థల్లో.. ప్రత్యేకించి, ఐక్యరాజ్యసమితితో భారత్ బంధం మరింత పఠిష్టంగా మారింది. ప్రపంచంలో నెలకొన్న సంఘర్షణలపై భారత వైఖరి పలు దేశాలను ఆకర్షించింది. కచ్ఛితమైన నిర్ణయాలతో భారత్ దౌత్య వ్యూహాలు ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అయితే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మాత్రం భారత్‌కు శాస్వత సభ్యత్వంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఈ సందర్భంగా, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భద్రతా మండలికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్చి 9వ తేదీని న్యూయార్క్‌లో జరిగిన 78వ సెషన్‌లోని అనధికారిక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. భద్రతా మండలిలో తక్షణ సంస్కరణల ఆవశ్యకతను ఆమె ఎత్తిచూపారు. దశాబ్ధాలు గడుస్తున్నా భద్రతా మండలిలో సంస్కరణలకు ఇంకెంత కాలం పడుతుందని ఆమె ప్రశ్నించారు. సంస్కరణలపై చర్చలు దశాబ్దానికి పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్న రుచిరా కాంబోజ్.. ప్రపంచంతో పాటు మన భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని ఘాటుగా స్పందించారు.


వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. అలాగే, ఈ ఏడాది సెప్టెంబరులో కీలకమైన శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటువంటి, ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకోవడానికి ముందే యూఎన్ఎస్సీలో సంస్కరణలను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని రుచిరా కాంబోజ్ భద్రతా మండలికి కీలక సూచనలు చేశారు.

నిజానికి, 2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం సమ్మిట్‌లో కూడా ప్రపంచ నాయకులు భద్రతా మండలి అన్ని అంశాలలో సమగ్ర సంస్కరణను సాధించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఇది జరిగి దాదాపు పావు శతాబ్దం గడిచింది. ఇప్పటికీ మార్పులు జరగకపోతే ఎంతకాలం వేచి ఉండాలి? ఇంత జాప్యం ఎందుకవుతోంది ? అని ఆమే ప్రశ్నించారు.

చారిత్రకంగా కొన్ని దేశాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలనే డిమాండ్ మరింత బలపడుతున్న నేపథ్యంలో ఆఫ్రికాతో సహా ప్రపంచ యువత, భవిష్యత్ తరాల ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని సంస్కరణను ముందుకు తీసుకురావాలని కోరారు. లేకపోతే, కౌన్సిల్‌ సక్రమంగా నడవలేదంటూ కాంబోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత కూడా కౌన్సిల్‌లో యథాతథ స్థితిని కొనసాగించడం సరికాదని ఆమె హెచ్చరించారు.

భద్రతా మండలి విస్తరణను శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పులో అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతినిధులందరూ సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలని తెలిపారు. వీటో అధికారం ఉన్న దేశాలు ఈ సంస్కరణలను అడ్డుకోకూడదని పిలుపునిచ్చారు. సమీక్ష సమయంలో నిర్ణయం తీసుకునే వరకు శాశ్వత సభ్య దేశాలు వీటోను ఉపయోగించొద్దని సూచించారు. నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆమె పిలుపునిచ్చారు.

అయితే, భద్రతా మండలిలో సంస్కరణల కోసం భారత్ చేసిన సూచనలకు యునైటెడ్ కింగ్‌డమ్ మద్దతు తెలిపింది. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా భారత్ సూచనలను సమర్థించింది. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేటి ప్రపంచానికి మరింత ప్రాతినిధ్యం వహించాలని.. ఆ సంస్థ విస్తరణకు మద్దతిస్తామని’ యూకే వెల్లడించింది. ‘మరింత వైవిధ్యమైన, సమర్థవంతమైన కౌన్సిల్‌ను చూడాలనుకుంటున్నామన్న’ బ్రిటన్.. ‘జీ4 దేశాలైన బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్ శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండాలని’ ఎక్స్‌ వేదికగా డిమాండ్ చేసింది.

అలాగే, భారతదేశంతో కూడిన G4 దేశాలు- బ్రెజిల్, జపాన్, జర్మనీలు కూడా భారత్‌ సూచనలకు మద్దతు పలికాయి. 193 సభ్య దేశాల అభిప్రాయాల్లో ఉన్న వైవిధ్యం, బహుత్వాలను ప్రతిబింబించే విధంగా కౌన్సిల్ ఉండాలని.. కౌన్సిల్‌లో నాన్-పర్మనెంట్ దేశాల నుండి ఎక్కువ ప్రాతినిధ్యం కోసం భారతదేశం పిలుపు సమంజసమని వ్యాఖ్యానించాయి.

ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా UN భద్రతా మండలిని తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంపై తమ పట్టును వదలడానికి కొన్ని దేశాలు ఇష్టపడట్లేదని అన్నారు. సెప్టెంబరు 2023లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో జైశంకర్ కొన్ని సంస్కరణలను ప్రతిపాదించారు. అయితే, వాటిపై UNలో ప్రతిఘటన రావడంతో.. దానిని “అనాక్రోనిస్టిక్” అని వ్యాఖ్యనించారు. ఈ కౌన్సిల్‌లో ఇంత అరాచకం ఉంటే ప్రజలు వేరే చోట పరిష్కారాలను వెతక్కుంటారని హెచ్చరించారు.

UN భద్రతా మండలిలో మార్పు అనేదే లేకుండా చేస్తున్న శాశ్వత సభ్యులను తీవ్రంగా విమర్శించారు. అయితే, ఐక్యరాజ్యసమితి ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచంలోని గణనీయమైన మార్పులను గమనించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఐక్యరాజ్యసమితి సంస్కరణల అవసరాన్ని ఎత్తి చూపారు. ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు, ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉండేదనీ.. UNలో ఇప్పుడు దాదాపు 200 సభ్య దేశాలు ఉన్నప్పటికీ, భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు మాత్రం అలాగే ఉండిపోయారని” మోదీ విమర్శించారు.

నిజానికి, ఐక్యరాజ్య సమితి అంటే అంతర్జాతీయంగా ఒక గౌరవం ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాలపై కూడా బాధ్యతను కనబరుస్తుంది. అయితే, ఆయా దేశాలు ఇందులో పరస్పర సహకారం అందించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలి ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అంశాల పట్ల ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా మండలి అమెరికా, సోవియట్ మధ్య కోల్డ్ వార్‌ విషయంలో మౌనంగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో అంతర్జాతీయ భద్రతకు తన వంతుగా కృషి చేయకపోలేదు. అక్టోబరు 24, 1945న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 మంది సభ్యులు ఉండగా, ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యులుగా ఉన్నారు.

అవి, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్ దేశాలు. వీటికి వీటో పవర్ ఉంటుంది. అంటే, వీటిలో ఏ ఒక్క దేశం అందులో జరిగే నిర్ణయాలకు మద్దతుగా ఓటు వేయకపోతే, ఆ నిర్ణయాలు అమలుకు నోచుకోవంతే.. వీటో పవర్‌కు అంతటి పవర్ ఉందన్న మాట.

Tags

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×