EPAPER

WWIII: మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. మనమెటు?

WWIII: మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. మనమెటు?

Second World War: సరిగ్గా 85 ఏళ్ల క్రితం 1939లో ఇదే రోజు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పోలాండ్ మీద నాజీ జర్మనీ సేనలు దాడి ఆరంభంచాయి. ఈ దాడిని ఖండిస్తూ సెప్టెంబరు 3న యుకె, ఫ్రాన్స్‌ జర్మనీపై యుద్ధం ప్రకటించడంతో భీకర యుద్ధం ఆరంభమైంది. ఇది మొత్తం ప్రపంచాన్ని రెండు కూటములుగా విడదీసింది. 1945 వరకు సాగిన ఈ యుద్ధంలో 6 కోట్ల మంది చనిపోయారు. చివరకు హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ తాను దురాక్రమణ చేసిన భూభాగాలను వదులుకోవటం ద్వారా 1945 మే 8న తన ఓటమిని అంగీకరించింది. అయితే, ఈ యుద్ధంలో జర్మనీ పక్షాన ఉన్న మరో ప్రధాన భాగస్వామి అయిన జపాన్‌ తీవ్రస్థాయిలో ప్రతిఘటించటంతో హిట్లర్ వ్యతిరేక కూటమి నుంచి అమెరికా రంగంలోకి దిగి.. ఆగష్టు 6 న హిరోషిమా, ఆగస్టు 9న నాగసాకి నగరాలపై రెండు అణు బాంబులు వేసింది. దీంతో సెప్టెంబరు 2న జపాన్‌ చేతులెత్తేయటంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ ప్రపంచ యుద్ధం నేర్పిన గుణపాఠాలను గుర్తించిన ఐరాస భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు రాకుండా అగ్రరాజ్యాలైన యుఎస్‌, రష్యా, యుకె, ఫ్రాన్స్‌, చైనా సభ్యుల శాశ్వత సభ్యత్వంతో కూడిన ‘భద్రతా మండలి’ని ఏర్పరచింది. ఆ తర్వాత కూడా 50 ఏళ్ల పాటు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.


రెండవ ప్రపంచం యుద్ధం ముగిసిన రెండేళ్లకు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అప్పటికీ అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల నాయకత్వంలో ప్రపంచమంతా రెండు వర్గాలుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చీలిపోయింది. భయంకరమైన ఆయుధ పోటీ కొనసాగింది. రెండు ప్రపంచ యుద్ధాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకుండా, ఆధిపత్యం కోసం రెండు అగ్ర రాజ్యాలూ.. భయంకరమైన అణ్వాయుధ క్షిపణి సైనిక సంపత్తి పెంపొందించుకునే పోటీలో పడిపోయాయి. ప్రపంచంలోని పేద, అప్పుడప్పుడే స్వాతంత్ర్యం పొందుతున్న దేశాలను అగ్రరాజ్యాలు తమ కూటమిలో చేరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్న రోజుల్లో భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. వినూత్నమైన నిర్ణయం దిశగా అడుగులేశారు. పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకోవటానికి, తన ప్రజల సాంఘిక, ఆర్థికాభివృద్ధిని పెంపొందించటానికి శాంతి, పరస్పర సహకారం, సహజీవనం అవసరమని గుర్తించి అందుకు అలీన విధానమే ఏకైక ప్రత్యామ్నాయమని ప్రపంచదేశాల ముందు నిలబడి ధైర్యంగా ప్రకటించారు.

అలీన విధానం అంటే తటస్థ విధానం కాదనీ, ఏ అగ్రరాజ్య సైనిక కూటమిలోనూ విలీనం కాకపోవడం మాత్రమేనని ఆయన ప్రపంచానికి వివరించారు. సైన్యాన్ని వినియోగించడానికి ఈ విధానం వ్యతిరేకం కాదనీ, కానీ, దేశ రక్షణకు మాత్రమే సైనిక వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రతిపాదించారు. మరోలా చెప్పాలంటే… స్వాతంత్ర్యం, సమానత్వం, పరస్పర ప్రయోజనాలు ప్రాతిపదికలుగా ఉన్న సైనిక కూటముల ఏర్పాటును, వాటిలో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ సాంఘిక, రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో పరస్పర సహకారానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే రాజ్యాల స్వతంత్ర విధానమే అలీన విధానం. శాంతి, స్వాతంత్ర్యం, సమానత్వం, న్యాయం, సౌరభౌమత్వం, భద్రత, పరస్పర సహకారం, అభివృద్ధి ఈ విధానంలో నిక్షిప్తమై ఉన్న భావనలని ప్రపంచానికి వివరించారు. ఈ నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ (NAM ) రూపకల్పనలో నాటి యుగోస్లోవియా పాలకుడైన జోసెఫ్​ టిటో, ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దుల్ నాజర్, ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణోను.. పండిట్ జీ భాగస్వాములను చేశారు. నామ్​అనే పదాన్ని మొదటిసారిగా వి.కె.కృష్ణమీనన్​ ఉపయోగించారు. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్​ అనే నామ్​ నగరంలో నిర్వహించిన సదస్సులో భారత ప్రధాని సూచన మేరకు నామ్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సదస్సులో పైన పేర్కొన్న దేశాల పాలకులు పాల్గొన్నారు. ప్రతి మూడేండ్లకు ఒక్కసారి నిర్వహించాలని నిర్ణయించారు. నాటి నెహ్రూ చొరవతో 29 దేశాలతో ప్రారంభమైన అలీన కూటమిలో నేడు 120 దేశాలు సభ్యత్యం తీసుకున్నాయి. ‌‌ అలీన ఉద్యమం కొంత మేరకు తూర్పు, పశ్చిమ దేశాల సంఘర్షణలో ఉద్రిక్తతల సడలింపునకు, సయోధ్యతో కూడిన వాతావరణం నెలకొనడానికి తోడ్పడింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలను గణనీయంగా తగ్గించటంలో సఫలమైంది.


Also Read: Karishma Tanna: కరిష్మా తన్నా మత్తెక్కించే అందాలివే..

ఇక వర్తమానానికి వస్తే.. మరో సారి ప్రపంచయుద్ధం తప్పదేమో అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ మీద రష్యా దాడితో మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే, నిరుటి అక్టోబర్‌ 7న హమాస్ గాజా దక్షిణ హద్దులో ఇజ్రాయెల్ సైనికుల రక్షణను దాటుకుని ఒక గ్రామం చేసిన దాడిలో కొందరిని చంపి మరికొందరు ఇజ్రాయెలీ పౌరులను ఎత్తుకుపోయారు. దీంతో ఇజ్రాయెల్ తమ పౌరుల విడుదల పేరుతోనూ, హమాస్‌ను నిర్మూలించే పేరుతోనూ గాజా పట్టీలో నరమేధం మొదలుపెట్టింది. దాదాపు యాభై వేల మంది అమాయక పాలస్తీనీయుల ప్రాణాలను బలిగొన్నది. పాలస్తీనా పౌరులను రక్షించడం కోసం ఏర్పడిన హమాస్‌ సంస్థను నిర్మూలించే పేరుతో ఇజ్రాయెల్ కొనసాగుతున్న ఈ యుద్ధ బీభత్స లక్ష్యం పాలస్తీనాను పూర్తిగా ఆక్రమించడమే అన్నట్లుగా సాగుతోంది. నెలలు గడిచేకొద్దీ లెబనాన్‌, ఇరాన్‌లు పాలస్తీనా పక్షాన చేరి ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తున్నాయి. మొత్తంగా ఇదంతా మరోసారి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ సమయంలో భారత్ వైఖరిపై అగ్రదేశాల దృష్టి పడింది.

Also Read: HYDRA: అక్రమార్కుల పాలిట సింహస్వప్నం హైడ్రా.. వాళ్లే టార్గెట్

ఇప్పటికి ఏ అగ్రదేశం వైపు కూడా మొగ్గని విదేశాంగ విధానాన్ని భారత్ అనుసరిస్తూ వస్తోంది. అతిపెద్ద ప్రపంచ జనాభా, మార్కెట్ వంటి సానుకూల అంశాలను తెరమీద పెట్టి తెలివిగా, లౌక్యంగా పనులు పూర్తి చేసుకోగలుగుతోంది. అయితే, రాబోయే భవిష్యత్తులో అమెరికా-చైనాల పెత్తనం కింద భిన్న ధ్రువ ప్రపంచం ఏర్పడుతుందనే సూత్రీకరణలు వినిపిస్తున్నాయి. అది ప్రపంచంలో అస్థిరత, కలహాలను పెంచబోతోందనే భయాలూ ఉన్నాయి. అయితే, వీటిని నివారించే సామర్థ్యం ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఉన్నట్లు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో భారత్ లౌక్యం అన్ని సందర్భాలలో అక్కరకు రాకపోవచ్చు. ఇప్పటికే మన పొరుగుదేశాలు మనకు దూరంగా జరిగిపోగా, మరో పెద్ద మిత్రదేశమైన బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాల తర్వాత మన విదేశాంగ విధానంపై పరిమితంగానైనా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన కేంద్రపాలకులు దూకుడుతో కూడిన ఒంటెత్తుపోకడలకు పోతే, రాబోయే భవిష్యత్తులో దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కనుక.. ఈ కీలక సమయంలో వర్తమాన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూనే, మరోసారి నెహ్రూ ప్రవచించిన విలువల ప్రాతిపదికన నూతన విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రెండవ ప్రపంచయుద్ధం ప్రపంచ అనుభవాల దృష్ట్యా.. ప్రపంచపు అయిదవ ఆర్థిక శక్తిగా, అత్యధిక జనాభా ఉన్న దేశంగా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవటం మీద దృష్టి పెట్టాల్సి ఉంది.

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×