EPAPER

HYDRA: గులాబీ గుండెల్లో హైడ్రా గుబులు..!

HYDRA: గులాబీ గుండెల్లో హైడ్రా గుబులు..!

BRS Party: గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. హైదరాబాద్‌లోనైతే ఇది మరీ మితిమీరిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటల కబ్జాలు జరిగాయనే ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తాయి. అయితే, గతేడాది డిసెంబర్‌లో అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్‌ ప్రభుత్వం గత ప్రభుత్వ అవకతవకలను ఒక్కటొక్కటిగా వెలికి తీస్తూ వస్తోంది. తాజాగా.. ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చర్యలతో రాజధాని హైదరాబాద్‌లోని చెరువుల్లో ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే హైడ్రా అధికారులు హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రదేశాలలోని ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లోని అక్రమభవనాలపై దృష్టిసారించారు. చట్టాల పరిధిలో పనిచేస్తూ, చట్టాలను తోసిపుచ్చి నిర్మించిన అనేక భవనాలను బుల్డోజర్లతో కూల్చేస్తూ.. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా హైడ్రా అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రాకు స్వయంప్రతిపత్తి కల్పించి ఆ సంస్థ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌‌ను నియమించిన ప్రభుత్వం.. ఆ సంస్థ స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పించి, రాజకీయ విమర్శలు రాకుండా జాగ్రత్తపడుతోంది.


ఇదే సమయంలో గత పదేళ్ల కాలంలో తమ ప్రాంతాలలో జలసిరితో కళకళలాడిన చెరువులు, కుంటలను పూడ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టిన బీఆర్ఎస్ నేతల అక్రమాలను బయటపెట్టటమే హైడ్రా లక్ష్యమని, వారు చెరపట్టిన ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల కబ్జాల అంతు చూడాలని కూడా సామాజిక, పర్యావరణ వేత్తలు బలంగా కోరుకుంటున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలపై కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోగా, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ భూములను చెరబట్టిన వారి పీచమణచటమనే పనిని మొదలు పెట్టి తన నిబద్ధతను చాటుకుంటోందనే ప్రశంసలు తెలంగాణ ప్రజానీకం నుంచి వెల్లువెత్తుతున్నాయి. అయితే, విపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం హైడ్రా తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శలకు దిగుతున్నారు. హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అయితే, ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఎదురుదాడి మొదలుపెట్టారు. హైడ్రా కేవలం తమ పార్టీ నేతల నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకుంటోందని, కాంగ్రెస్ మంత్రులు, టీడీపీ అధినేత నిర్మాణాల జోలికిపోగలదా? అంటూ పస లేని వాదనను తెరపైకి తెచ్చే యత్నం చేశారు. తద్వారా ఒక స్వతంత్ర ప్రభుత్వ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆటంకం కలిగించటమే కాకుండా వాటికి రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తమ పార్టీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపట్టారనే విషయాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించారని భావించాల్సి వస్తోంది.

ఇక నిబంధలను అతిక్రమించి నిర్మించిన జన్వాడ ఫాంహౌస్ మీద కూడా హైడ్రా దృష్టి సారించిందనే వార్తలు రావటంతో ఒక్కసారిగా కేటీఆర్ అండ్ కో భుజాలు తడుముకున్నారు. వెంటనే ‘ఉండేది నేనే.. కానీ నాది కాదు’ అన్నట్లుగా కేటీఆర్ ప్రకటన చేశారు. అంతేకాదు.. అది తాను లీజుకు తీసుకున్నానని చెబుతూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఆఘమేఘాల మీద ఫాంహౌస్‌పై హైడ్రా చర్యలు తీసుకోకుండా ఉండేందుకు హైకోర్టులో ప్రదీప్‌ రెడ్డి అనే వ్యక్తి చేత స్టే కోసం పిటిషన్‌ కూడా దాఖలు చేయించారు. అయితే, హైడ్రా చట్టానికి లోబడి ఒక స్వతంత్ర ప్రభుత్వ సంస్థగా అది తీసుకునే నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా నజర్ వేసింది. హైడ్రాను నిలువరించేందుకు పల్లా హైకోర్టును ఆశ్రయించగా, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైడ్రాకు కోర్టు సూచించింది.


మరోవైపు.. తమ్మిడికుంట చెరువును ఆక్రమించిన నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లోని అనధికారిక నిర్మాణాలను శనివారం హైడ్రా కూల్చేసింది. ఇది అక్రమ నిర్మాణమని దశాబ్దానికి పైగా ఆరోపణలు వస్తున్నా.. గత ప్రభుత్వం వాటిని ఉపేక్షించింది. ఎన్‌ కన్వెన్షన్‌ యజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి 3.30 ఎకరాల్లో చేపట్టిన అనధికార నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులే లేవని, బిల్డింగ్‌ రెగ్యులరైజ్‌ స్కీమ్‌ కింద వారు పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయ్యిందని హైడ్రా వెల్లడించింది. తమ్మిడికుంట చెరువుకు మాదాపూర్‌ ప్రాంతాల్లోని నాలాలు ఈ చెరువుతో అనుసంధానమై ఉన్నాయని, ఈ చెరువు కబ్జాతో భారీ వర్షాలు పడినప్పుడు దిగువ ప్రాంతాలు మునిగిపోతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, దీనిపైన యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా కోర్టు దానిపై స్టే ఇచ్చింది. అయితే.. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంత పెద్దలైనా, వారిపై చర్యలు తప్పవనే సందేశాన్ని ప్రభుత్వం పంపినట్లయింది.

Also Read: HYDRAA: హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్.. 43 ఎకరాల్లో కూల్చివేతలు

హైడ్రా తీసుకుంటున్న చర్యలను సామాన్యులు స్వాగతిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా పొంతనలేని వాదనలు చేస్తు్న్నారు. ఒకవేళ, రేపోమాపో హైడ్రా గనక జన్వాడ ఫాంహౌస్‌‌ను కూల్చివేసే పరిస్థితే వస్తే, గత పదేళ్ల కాలంలో కేటీఆర్‌ను నమ్ముకొని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టుకున్న తమ భవనాల పరిస్థితి ఏమిటి? పార్టీ అధినేతే తన అక్రమ భూములను కాపాడుకోలేక పోతే ఇక తమ పరిస్థితి ఏమిటని మెజారిటీ నేతలు లోలోన అంతర్మధనం చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్‌కే పరిమితం కాదని, రానున్న రోజుల్లో జిల్లా, మండల స్థాయి వరకు హైడ్రా చర్యలు తీసుకోనున్నదనే వార్తలతో క్షేత్రస్థాయిలోని గులాబీ శ్రేణుల్లో కలకలం నెలకొంది. ఇదే సమయంలో.. గత పదేళ్లుగా వీరు చేపట్టిన అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదులు చేసీచేసీ విసిగిపోయిన సామాజిక కార్యకర్తలు, పర్యవరణ ప్రేమికులు.. మరోసారి ధైర్యంగా తమ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ హయాంలో సాగిన పలు అక్రమాలను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వీటిని రాజకీయకోణంలో చూస్తూ విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ప్రతిష్టకు మచ్చ తెచ్చే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ సర్కారు ఉపేక్షించటం లేదు. డ్రగ్స్ మీద ఉక్కుపాదం, శాంతిభద్రతల వంటి అంశాలలో ఇప్పటికే ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అటు.. గొర్రెల స్కామ్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలోనూ ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుల మన్ననలు అందుకున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు మరో గుర్తింపు తెచ్చేందుకు రాజధానిని ఆనుకుని మరో నగర నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ఐటీ పార్కులు, హెల్త్ హబ్, ఏఐ ఆధారిత సంస్థలు ఈ కొత్త నగరంలో కొలువుదీరనున్న వేళ.. భాగ్యనగరపు భవితను దెబ్బతీసే ఏ చర్యనూ సహించకూడదనే ధోరణితో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకే సీఎం వ్యూహాత్మకంగా హైడ్రాను తెరమీదికి తెచ్చారనే ఆరోపణలున్నా.. దీనివల్ల జరుగుతున్న మేలును ప్రత్యక్షంగా చూస్తున్న జనం వాటిని పట్టించుకోవటం లేదు. ముఖ్యమంత్రి నిర్ణయాలలో రాజకీయ కోణాలున్నప్పటికీ.. నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల ఈ మహానగరంలోని అక్రమ నిర్మాణాల లెక్కలు సరిచేసి, ప్రపంచ పటంలో దీనికి ఒక సరికొత్త గుర్తింపును తెచ్చేందుకు ఆయన చేసే ప్రయత్నాలను తెలంగాణ సమాజం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది.

శ్రీనివాస్‌ గుండోజు,
జర్నలిస్ట్‌, 9985188429

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×