EPAPER

Small Scale Industries: చిన్న పరిశ్రమలతోనే పెద్ద మార్పు

Small Scale Industries: చిన్న పరిశ్రమలతోనే పెద్ద మార్పు

Economy: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యల్లో గ్రామీణ నిరుద్యోగం ఒకటి. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధికి బయట కాలుష్యానికి అవకాశం లేని వ్యవసాయాధారిత చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని, తద్వారా గ్రామాలలో ఉపాధి సమస్య లేకుండా చేయాలనే దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల పల్లెల్లోని యువత, మహిళలకు స్థానికంగా ఉపాధి లభించటమే గాక పేదరిక నిర్మూలన కూడా జరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. భారీ పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమలే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం త్వరలో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిచాలని, అందులో చిన్న పరశ్రమలకు పెద్దపీట వేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. పదివేలకు పైగా గ్రామాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సమర్థవంతమైన, స్థిరమైన రాజకీయ పాలనా వ్యవస్థ, కష్టించి పనిచేసే మానవ వనరుల లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాలున్న రాష్ట్రమైన తెలంగాణలో చిన్నతరహా పరిశ్రమలు(ఎస్‌ఎస్‌ఐ) పెద్ద సంఖ్యలో వస్తే.. వేగంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు. నేటి జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం (ఆగస్టు 30) సందర్భంగా తెలంగానలో చిన్న పరిశ్రమల రంగానికి ఉన్న అవకాశాలు, పరిమితుల గురించి ఓసారి పరిశీలిద్దాం.


మన దేశ పారిశ్రామిక పురోగతిలో, జీడీపీలో చిన్నతరహా పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. గతంలో రూ.60 లక్షల పెట్టుబడితో నడిచే పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా నిర్వచిస్తుండగా, 1997లో వచ్చిన అబిద్‌ హుస్సేన్‌ కమిటీ చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ.3 కోట్లకు పెంచాలని సూచించింది. కాగా, మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఎస్‌ఎంఇ) యాక్ట్‌-2006 ప్రకారం, రూ.10 కోట్ల వరకు పెట్టుబడితో నడిచేవాటిని చిన్నతరహా పరిశ్రమగా వర్గీకరించారు. పేపర్ బ్యాగ్‌లు, పేట్ల తయారీ, చిన్న బొమ్మల తయారీ, వాటర్ బాటిల్స్, బేకరీ, ఊరగాయల తయారీ, అగర్ బత్తుల తయారీ, కొవ్వుత్తుల తయారీ, చేనేత, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు వంటివి ఈ కోవకు చెందుతాయి. దేశంలోని మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో 40 శాతం వాటా వీటిదే కాగా, దేశంలో వ్యవసాయరంగం తర్వాత 11 కోట్ల మంది గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతంలోని వారికి ఈ రంగం ఉపాధిని కల్పిస్తోంది. మారుతున్న పరిస్థితులు, డిమాండ్‌కు తగినట్లుగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు గ్రామీణ పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటం, బ్యూరోక్రాటిక్‌ అడ్డంకులు, చైనా వంటి బలమైన పోటీ దారును తట్టుకునేలా మన కార్మికులకు నైపుణ్యాలు అందకపోవటం, కొత్త టెక్నాలజీని అందుపుచ్చేందుకు పెట్టుబడిని పెంచకపోవటం వల్ల నేడు చిన్న తరహా పరిశ్రమలు పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోతున్నాయి.

తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన గురించి మాట్లాడేడటానికి ముందు.. ఇక్కడి గ్రామీణ సామాజిక ముఖ చిత్రాన్ని మనం అవగతం చేసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయం లాభసాటిగా లేదు. పొలం పనుల్లో శారీరక శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగులతో పోల్చితే పొలం పని చేసేవారికి సమాజంలో తగిన గుర్తింపు తగ్గిపోయింది. దీంతో సంప్రదాయ రైతు కుటుంబాలకు చెందిన యువత సేద్యానికి దూరమైపోతున్నారు. గ్రామాల్లో ఉంటూ వ్యవసాయం చేసేవారికి పిల్లనిచ్చేందుకు సైతం ఎవరూ ముందుకు రాకపోవటాన్ని బట్టి ఈ రంగం పట్ల సమాజంలో ఎంత విముఖత ఏర్పడిందో అర్థమవుతోంది. దీంతో ఈ పరిస్థితుల్లో గ్రామీణ యువత యువత ఏదో ఒక డిగ్రీ సంపాదించి పట్టణాలు, నగరాలకు వలసపోయి, అక్కడ చాలీచాలని జీతంతోనైనా జీవితాలను కొనసాగించేందుకు సిద్ధపడటం తప్పనిసరిగా మారుతోంది. నిలకడ కలిగిన నెల వేతనాన్ని ఇచ్చే ఉద్యోగం, డబ్బుతో ముడివడిన సౌఖ్యాలకు మన సమాజంలో ప్రాముఖ్యం బాగా పెరిగిందనేది కొట్టిపారేయలేని వాస్తవంగా ఉంది. ఈ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో తాము పొందే వేతనాల కంటే మెరుగైన ఆదాయం తమ ప్రాంతంలోనే సొంత పరిశ్రమ పెట్టుకోవటం ద్వారా సమకూరుతుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించగలిగితేనే వేగంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు పల్లెల్లో ఏర్పడతాయి.


Also Read: Scam: ఊరంతా కబ్జా..! రూ.170000000000 స్కాం

ఇక వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాల లభ్యత తెలంగాణలో అద్భుతంగా ఉన్నప్పటికీ పరిశ్రమలు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము లాంటి ఆహార, వాణిజ్య పంటలు, ఆయిల్‌పామ్‌, బొప్పాయి, జామ, మామిడి, జీడిమామిడి లాంటి పండ్లతోటలు, కూరగాయల పంటలు తెలంగాణలో సాగవుతున్నాయి. అయితే, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకునే పరిశ్రమలు లేకపోవటంతో రైతులు వాటిని నేరుగా అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల వారి ఉత్పత్తికి అదనపు విలువ చేకూరటం లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు దీని వల్ల లబ్దిపొందుతున్నారు. ఉదాహరణకు.. ఖమ్మం జిల్లాలో పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లులు లేకపోవడంతో ఆ ధాన్యాన్ని నల్లగొండ, కరీంనగర్‌ తదితర జిల్లాలకు పంపించి మిల్లింగ్‌ చేయాల్సి వస్తోంది. అలాగే, జిల్లాలో పత్తి గణనీయంగా సాగవుతున్నప్పటికీ, జిన్నింగ్ యూనిట్లు లేకపోవటంతో అదంతా గుంటూరు, కోయంబత్తూర్‌, చెన్నై, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. ఖమ్మం మిర్చికి దేశ, విదేశ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ముదిగొండ మండలంలో చైనా చిల్లీ పరిశ్రమ మినహా మరో మిర్చి ఆధారిత పరిశ్రమ లేదు. మిర్చి నుంచి నూనెలు, రంగులతోపాటు మసాలాలు, పలు రకాల పొడులు, చిల్లీ సాస్ వంటివి తయారుచేసే అవకాశం ఉన్నందున ప్రతి మండలంలో డ్వాక్రా మహిళల నాయకత్వంలో చిన్న యూనిట్లు పెట్టించగలిగితే.. అద్భుత ఫలితాలుంటాయి. కంది, పెసర, మినుము లాంటి పప్పుధాన్యాలు అపారంగా పండుతున్నా.. పప్పు మిల్లులు లేవు. అలాగే జిల్లాలో ఆయిల్‌ఫామ్‌ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమలున్నప్పటికీ, వాటిని వైరా, సత్తుపల్లి, ఖమ్మం, పినపాక ప్రాంతాల్లోనూ పెట్టాలనే డిమాండ్ ఉంది.

అలాగే రాష్ట్రంలో మామిడి, జీడిమామిడి, బొప్పాయి, జామ వేలాది ఎకరాల్లో సాగవుతున్నా ఒక్క పండ్ల ఆధారిత పరిశ్రమ లేదు. దీంతో ఈ పంటంతా ఇతర రాష్ట్రాల వ్యాపారులకు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాలో టమాట వంటి పంటలకు చిన్న ప్రాసెసింగ్ యూనిట్లూ లేవు. తక్కువ వడ్డీకి యువత రుణాలు తీసుకుని మేజర్ పంచాయితీల్లో గోదాములు, శీతల గిడ్డంగులు కట్టించి, వీటిని ప్రైవేటు మండీలుగా మార్చటం వల్ల రైతుల పంట పాడుకాకుండా ఉండటమే గాక మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంకో అడుగుముందుకు వేసి పండ్లు, కూరగాయలు గ్రేడింగ్‌ చేసి, శుభ్రపరచి, చక్కగా ప్యాక్‌ చేసి అధిక ధరకు విక్రయించవచ్చు. ఇదే విధంగా నూలు, వస్త్ర, చక్కెర, పొగాకు, పట్టు పరిశ్రమలకు అనుబంధంగా తయారయ్యే ఉత్పత్తులకూ తెలంగాణలో అపార అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ వంటి వెనకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ఆధారిత పరిశ్రమల కోవలో కాగితం, ప్లైవుడ్, బొమ్మల తయారీ, లక్క, జిగురు, ఆకు పరిశ్రమలకు తగినంత ముడి వనరులు ఉన్నప్పటికీ, ఐటీడీఏ ఈ అవకాశాన్ని గిరిజన, ఆదివాసీలకు అందుబాటులోకి తేలేకపోయింది. తెలంగాణలోని సిరిసిల్ల, పాశమైలారం, మల్కాపూర్ ప్రాంతంలో టెక్ట్స్‌టైల్ పార్కులున్నా.. అవి తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని టెక్స్‌టైల్ పరిశ్రమలా విస్తరించలేకపోయాయి. ఇక.. గద్వాల, పోచంపల్లి పట్టుచీరలు, ఆసిఫాబాద్, మహదేవ్‌పూర్ ప్రాంత గిరిజన ప్రజలు ఉత్పత్తి చేసే టుస్సార్ సిల్క్‌‌కు గొప్ప దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ, మూలధనం సమస్యలు, మార్కెటింగ్ నెట్‌వర్క్ లేకపోవటంతో వీటి తయారీదారులకు తగిన ఆదాయం రావటం లేదు. చక్కెర పరిశ్రమ విషయంలో తెలంగాణ వందేళ్ల నాటి నుంచే ముందున్నా.. ఏపీలోని తణుకు చక్కెర కర్మాగారంలో తయారయ్యే రాకెట్ ఇంధనం వంటి వాటి తయారీ దిశగా అడుగులు పడలేదు.

Also Read: Kambadari jitwani: జైత్వానీ కేసులో మరో అప్డేట్.. నేడు హైదరాబాద్‌కు రానున్న..

ఆశలను అవకాశాలుగా మార్చుకునే సాధనమే ఆధునిక టెక్నాలజీ. ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ పారిశ్రామిక విప్లవం నడుస్తోంది. 2010 నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలను అమలు చేస్తున్న మనదేశం ఐదవ దశకు చేరుకోవటానికి ఎక్కువ కాలం పట్టదు. కనుక చిన్న పరిశ్రమలలో టెక్నాలజీని ముందునుంచే అప్‌డేట్ చేయటం, ఆధునిక శిక్షణ వంటి అంశాలకు.. తెలంగాణ ప్రభుత్వం రూపొందిచబోయే నూతన ప్రారిశ్రామిక విధానంలో పెద్దపీట వేయాలి. అలాగే, రాబోయే పరిశ్రమలలో తెలంగాణ యువతకు అవకాశాలు వచ్చేలా చూడాలి. తెలంగాణలోని 65 ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌)లను టాటా గ్రూపు సహకారంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున రాబోయే రోజుల్లో ఇక్కడ శిక్షణ పొందే వారికి గ్రామాల్లోని వ్యవసాయాధారిత పరిశ్రమలలో ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి ఉద్యోగాలకు పూచీ ఏర్పడటం ఒక సానుకూల అంశంగా మారనుంది. అదే విధంగా స్కిల్ వర్సిటీనీ ఈ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీ కేంద్రంగా మలచుకోవాలి. తెలంగాణలోని పట్టిష్టంగా ఉన్న డ్వాక్రా నెట్‌వర్క్‌ను ఈ కొత్త ప్రయత్నంలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. వ్యవసాయం, పరిశ్రమను అనుసందానించటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో కేరళ అనుసరిస్తు్న్న బడ్జెట్ ప్రాధాన్యతలనూ పరిశీలన చేయాల్సి ఉంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో చిన్న తరహా వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించగలిగితే.. అనతి కాలంలోనే ఊహించనంత పెద్ద సానుకూల మార్పు సాధ్యమవుతుంది. అయితే, ఈ ప్రయత్నంలో స్పష్టమైన లక్ష్యాలతో ప్రభుత్వం, పరిశోధన, శిక్షణా సంస్థలు, యూనివర్శిటీలు, స్వయం ఉపాధి రంగంలో పేరున్న స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×