EPAPER

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

మన దేశంలో అత్యధికులు మాట్లాడే భాష.. హిందీ. స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజలందరినీ చైతన్య పరచేందుకు, మనమంతా ఒక్కటేననే భావనను ప్రోది చేసేందుకు మన జాతీయ నేతలు హిందీని ఒక ప్రధాన మాధ్యమంగా వినియోగించారు. మహాత్మా గాంధీ హిందీ భాషను బహుజనుల మాండలికంగా అభివర్ణించారు. హిందీని జాతీయ భాషగా చేయాలని, 1918లో నిర్వహించిన హిందీ సాహిత్య సమ్మేళనంలో ఆయన డిమాండ్ చేశారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దీనిపై సుదీర్ఘంగా చర్చలు కూడా సాగాయి. చివరికి మన రాజ్యాంగంలోని 343వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ సభ దీనిని ఆమోదించింది. జబల్‌పూర్‌కు చెందిన ప్రముఖ హిందీ కవి, ఆ భాషకు విశేష సేవలందించిన రాజేంద్ర సింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ రోజున హిందీని అధికారిక భాషగా ఆమోదించటం సముచితంగా ఉంటుందన్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సూచనను పరిగణనలోకి తీసుకుని నాడు రాజ్యాంగ సభ దీనిని ఆమోదించింది. తొలిసారి 1953లో ఇదే రోజున.. హిందీ భాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.


కొందరు హిందీని జాతీయ భాషగా చేయాలని స్వాతంత్ర్యానికి ముందునుంచే డిమాండ్ చేస్తూ వచ్చారు. జాతీయ భాష అంటే.. జాతీయ పతాకం, జాతీయ జంతువు, జాతీయ చిహ్నం తరహాలో మన దేశ సంస్కృతికి చిహ్నంగా ఉండే భాష. అయితే, ఆనాటికి 3,327 భాషలు లేదా మాండలికాలు, భిన్న సంస్కృతులున్న భారతదేశంలో మెజారిటీ ఆధారంగా హిందీని జాతీయ భాషగా చేయటం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తం కావటంతో.. జాతీయభాష అనే అంశాన్ని పక్కన బెట్టి, హిందీని అధికారిక భాషగా నిర్ణయించారు. నాటి నుంచి అధికార భాష హోదాలో దేశ, రాష్ట్రాల పాలనలో, అధికార యంత్రాంగం సమాచార మార్పిడిలో, మిగతా రాష్ట్రాలతో సంప్రదింపుల్లో ఆయా స్థానిక భాషలతో బాటు హిందీ, ఇంగ్లిష్‌ని వాడటం ఆరంభించారు. కనుక భారత రాజ్యాంగం ప్రకారం మనకు జాతీయ భాష అనేది లేదు. జాతీయ స్థాయిలో అధికార భాషలుగా హిందీ, ఇంగ్లిష్‌ కొనసాగుతున్నాయి. వీటితో పాటు.. రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 భాషలకు కూడా అధికార భాష హోదా ఉంది.

హిందీని జాతీయ భాషగా ఆమోదించాలనే డిమాండ్.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారితీసింది. మహాత్మా గాంధీ ప్రోత్సాహంతో 1918లో మద్రాసులో ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ ఏర్పడింది. ఆ తర్వాత 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ గాంధేయవాది రాజాజీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించటంతో ఇది మొదలైంది. దీని మూలంగానే పదిహేనేళ్ల పాటు హిందీ, ఇంగ్లిష్ అధికారిక భాషలుగా ఉండటానికి ఆమోదం కుదిరింది. అయితే 1965 నాటికే దక్షిణాదిలో మరోసారి హిందీపై వ్యతిరేకత రావటంతో ప్రధాని ఇందిరా గాంధీ జోక్యం చేసుకుని 1968లో లాంగ్వేజెస్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం తమ సొంత అధికారిక భాషను నిర్ణయించుకునే స్వేచ్ఛ, అధికారం రాష్ట్రాలకు దక్కటంతో ఆ ఉద్యమం చల్లబడింది. అలాగే, పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని 1966లో కొఠారీ కమిషన్ తన నివేదికలో సూచించింది. ప్రథమ భాషగా ప్రాంతీయ భాషను, ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లాన్ని తప్పక బోధించాలని చెప్పింది. దీని మూలంగానే నేటికీ మెజారిటీ హిందీయేతర రాష్ట్రాల పాఠశాలలో ఏదో ఒకస్థాయిలో హిందీ కొనసాగుతోంది. భిన్న భాషలు, సంస్కృతులున్న మన దేశంలో ప్రజల మధ్య ఐక్యత సాధించేందుకు త్రిభాషా సూత్రం మేలుచేస్తుందని కొఠారీ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.


Also Read: Mathu Vadalara 2 Review: ఫుల్ రివ్యూ.. ‘మత్తు వదలరా 2’ మత్తు వదలించిందా? జోకొట్టించిందా?

మన జాతీయ భాషగా హిందీ అధికారిక గుర్తింపు పొందలేకపోయినా, హిందీకి జాతీయ స్థాయిలో ఉన్న ఆదరణ, బలాన్ని కొట్టిపారేయటం సాధ్యం కాదు. హిందీ.. అనే పదం పర్షియన్ భాషలోని హింద్ (సింధునది ప్రవహించే నేల) నుంచి వచ్చింది. 11వ శతాబ్ద కాలంలో టర్కీ పాలకులు మనదేశంపై దండెత్తిన సమయంలో తొలిసారి ‘హింద్’ పదాన్ని తొలిసారి వాడినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతుంటారు. హిందీ భాష సంస్కృతం నుంచి పుట్టగా.. దీన్ని దేవనాగరిక లిపిలో రాయడం జరుగుతోంది. నిజానికి, దేవనాగరి లిపిలో రాసే హిందీలో బ్రజ్, ఖరీ, బోలీ, బుందేలీ, అవధి, బాఘేలి వంటి అనేక మాండలికాలున్నాయి. నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఫిజీ, మారిషస్, సురినామ్, కెనడా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఉగాండా, ట్రినిడాడ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లోనూ హిందీ మాట్లాడే జనాభా గణనీయంగా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా విశ్వ విద్యాలయాల్లో హిందీపై అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. భారతీయ మూలాలున్న జనాభా అధికంగా ఉన్న ఫిజి దేశంలో హిందీ ఒక అధికారిక భాషగా ఉంది. అక్కడి హిందీ మాండలికాన్ని ఫిజి బాత్ లేదా ఫిజి హిందీ అంటారు. ఈ టెక్నాలజీ యుగంలో వెబ్ అడ్రస్‌లు రూపొందించడానికి వాడుతున్న 7 భాషల్లో హిందీ కూడా ఒకటి. దేవనాగరి లిపికి చెందిన 1.77 లక్షలకు పైగా పదాలను ఐటీ నిపుణులు ఇంటర్నెట్‌లో నిక్షిప్తం చేయటంతో బాటు సంస్కృత భాష సహకారంతో హిందీలోని 8 లక్షల పదాలను కొత్తగా ఆవిష్కరించటం జరిగింది. హిందీ సాహిత్య సేవకు గానూ, 1968లో సుమిత్రా నందన్ పంత్ ‘జ్ఞానపీఠ’ అవార్డు అందుకోగా, ఆ ఘనత సాధించిన మహిళగా 1982లో మహాదేవి వర్మ రికార్డుకెక్కారు.

అంతర్జాతీయ వేదికల మీదా హిందీ గుర్తింపు పెరుగుతూనే వచ్చింది. అమెరికాలో జరిగిన విశ్వధర్మ సమ్మేళనంలో వ్యోహార్ రాజేంద్ర సింగ్ హిందీలో మాట్లాడి ఆ భాష గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసే యత్నం చేశారు. 1975 జనవరి 10న నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాగపూర్‌లో మొదటి ప్రపంచ హిందీ సదస్సును ఘనంగా నిర్వహించారు. 30 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 32వ సమావేశంలో విదేశాంగ మంత్రి హోదాలో వాజ్‌పేయి హిందీలో మాట్లాడి ఆ భాషకు మరింత గుర్తింపును తెచ్చారు. ఐక్యరాజ్య సమితిలోని ముఖ్యమైన అంశాలన్నింటినీ ఇతర భాషలతో బాటు హిందీలోనూ అందించాలనే భారత్ ప్రతిపాదించిన తీర్మానం 2018లో ఆమోదం పొందింది. ప్రపంచ స్థాయిలో హిందీకి ప్రాచుర్యం పెంచేందుకు ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ వాడుకలో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో పాలకులు హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక ప్రాంతీయ భాషలను కాపాడుకుంటూనే హిందీ వ్యాప్తికీ కృషి చేయటం వల్ల దేశ ప్రజల మధ్య అది వారధిగా నిలిచి సమైక్యతకు దోహదపడుతుంది. చివరగా.. హిందీ అనేది ఒక భాష మాత్రమే కాదు. ఒక భావోద్వేగం. అది కోట్లాది భారతీయుల హృదయ స్పందన.

గోరంట్ల శివరామకృష్ణ

సీనియర్ జర్నలిస్టు

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Big Stories

×