EPAPER

Warangal : ఓరుగల్లులో ఆక్రమణలు.. ఆక్రందనలు..!

Warangal : ఓరుగల్లులో ఆక్రమణలు.. ఆక్రందనలు..!

– కబ్జాల్లో చెరువులు, కుంటలు, నాలాలు
– చినుకు రాలితే వరద నీటిలో కాలనీలు
– హడావుడి చేసి మాయ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
– ఆక్రమణలపై కంటి తుడుపు చర్యలు
– ఇప్పటికీ షురూ కానీ బొందివాగు విస్తరణ పనులు
– ఆక్రమణల తొలగింపు, నాలాల విస్తరణకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు
– వరంగల్‌లో అక్రమ కట్టడాలపై స్వేచ్ఛ-బిగ్ టీవీ ప్రత్యేక కథనం


Encroachment of canals in Warangal : చిన్నపాటి వర్షం వస్తే నగరం వరదమయంగా మారుతుంది. వరద నీటితో రోడ్లు నదులను తలపిస్తాయి. కాలనీల్లో వాహనాలకు బదులు పడవలు దర్శనం ఇస్తాయి. నాటి పాలకుల పట్టింపు లేని తనమే ఈ దుస్థితికి కారణం. కాకతీయుల కాలం నాటి వందలాది గొలుసు కట్టు చెరువులు, కుంటలు కనుమరుగు కావడానికి తోడు నాలాలన్నీ ఆక్రమణకు గురి కావడంతో వరద కాలువలు కుచించుకుపోయి నీరు కాలనీలను ముంచెత్తుతోంది. ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతున్నా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆక్రమణల తొలగింపును గాలికొదిలేసింది. నగరంలో అనేక కాలనీలు మునగడానికి కారణం ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలేనని అధికారులు తేల్చినా, వాటిని కూల్చివేయకుండా గత ప్రభుత్వం వారి చేతులు కట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్లక్ష్యం ఫలితంగా చిన్నవర్షం పడినా వరంగల్, కాజీపేట, హనుమకొండలలో వందలాది కాలనీలను వరద నీరు ముంచెత్తుతోంది. ప్రతిసారీ వర్షాకాలం వరద బాధిత కాలనీల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది.

నియంత్రించాల్సిన సమయంలో మౌనం


చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహా నగరానికి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాలకులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం శాపంగా మారింది. అనేక చెరువులు, కుంటలు ఆక్రమించుకుని బఫర్ జోన్‌లో, నాలాలపై యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్నా వాటిని నియంత్రించలేదు. పాలకులు పట్టించుకోలేదు. కొంతమంది అయితే, దర్జాగా జీడబ్ల్యూఎంసీ అనుమతి తీసుకుని మరీ నిర్మాణాలు చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అందినకాడికి దండుకొని అనుమతులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో నాళాలు పూర్తిగా కుచించుకుపోయి వర్షాకాలం వరద నీరు పోయేందుకు సరిపడే పరిస్థితి లేక కాలనీల్లో వరద చేరుతోంది. 2020, 2023లో వచ్చిన వరదల్లో వందలాది కాలనీలు వరదల్లో చిక్కకుపోయాయి. ప్రజలు సర్వం కోల్పోయి వారం రోజులకు పైగా వరద నీటిలోనే బిక్కుబిక్కు మంటూ గడిపారు. అప్పుడు అన్ని రకాలుగా దెబ్బ దిన్న ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు.

ముందే తేరుకున్న కాంగ్రెస్ సర్కార్

గతంలో వరంగల్ నగరంలో వరద ముంపు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు బాధను తప్పించేందుకు ప్రయత్నం ప్రారంభించింది. ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ముంపు అరికట్టే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నాలాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిపై ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధి నుంచి గోపాల్పూర్ చెరువు మత్తడి నుంచి వచ్చే వరదను నియంత్రించేందుకు నాలాలపై అక్రమ కట్టడాలు తొలగించే చర్యలు వేగవంతం చేయడంతోపాటు, నయీమ్ నగర్ నాలాపై వంతెన నిర్మాణం పనులు వేగవంతం చేశారు. అయినప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా కొన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజవర్గంలో ఉన్న బోందివాగు నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు తొలగింపు, విస్తరణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

నాలాలపై వందల్లో ఆక్రమణలు

వరంగల్ మహా నగరంలో వరద నీటి ప్రవాహానికి ప్రధానంగా నయీంనగర్, భద్రకాళి, బొందివాగు నాలాలున్నాయి. ఈ మూడు ప్రధాన నాలాల పొడవు 24.5 కిలోమీటర్లు కాగా వాటిపై ఎక్కడికక్కడ వందలాది ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. కొంతమంది రాజకీయ బలంతో నాలాలపైనే భవనాలు నిర్మించారు. బఫర్ జోన్లను కూడా పట్టించుకోకుండా దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలతో కనీసం వంద అడుగులైనా ఉండాల్సిన కాల్వలు చాలాచోట్ల 30 నుంచి 50 అడుగుల వరకే ఉన్నాయి. దీంతో 2020 ఆగస్టు రెండో వారంలో కురిసిన వర్షాలు, నాలాల దుస్థితిని కళ్లకు కట్టాయి. ఆగస్టు 14 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురవగా మూడు రోజుల వానకు నగరం మొత్తం నీట మునిగిపోయింది. సిటీలో ఉన్న 1,500 కాలనీల్లో సగం వరకు వారం రోజులపాటు నీళ్లలోనే ఉండిపోయాయి. కాలనీల్లో ఇండ్లు పూర్తిగా జలమయం కావడంతో వందలాది మంది పునరావాస కేంద్రాల బాట పట్టారు. అప్పటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు వరంగల్ నగరంలో పర్యటించారు. మంత్రులు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయగా వరద ముంపునకు నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని తేల్చారు. అనంతరం క్షేత్రస్థాయి సర్వే చేసి 415 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటన్నింటినీ తొలగించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో కొద్ది రోజులు కూల్చివేతల పేరున హడావుడి చేసినా, పొలిటికల్ సపోర్ట్ లేని ఇండ్లను కూల్చేసి మిగిలిన అక్రమ కట్టడాలు ముట్టుకోకుండా వదిలేశారు.

అక్రమ కట్టడాలు కూల్చలేక నాలాల విస్తీర్ణం ఎలా కుదిరించారో, హడావుడి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చేతులెత్తేసిందో, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటో తర్వాతి కథనంలో చూద్దాం.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×