Kamala Harris Vs Trump: ఉన్నట్టుండి.. ట్రంప్ నోట.. హిందుత్వం మాట ఎందుకొచ్చింది? భారత్‌లో అంటే ఓకే.. అమెరికా ఎన్నికల్లో హిందుత్వ ఎజెండా ఎలా ముందుకొచ్చింది? ఈ ఎన్నికల్లో.. హిందూ అమెరికన్ల ఓట్లే కీలకంగా మారబోతున్నాయా? ట్రంప్.. ఎందుకు హిందూ కార్డ్‌ని బయటకు తీశారు? అక్కడున్న మనోళ్లు.. అమెరికన్ ట్రంప్ వైపా? హిందుత్వ మూలాలున్న కమలా హ్యారిస్ వైపా? అగ్రరాజ్యంలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి?
అమెరికా ఎన్నికల్లో.. అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కామన్. బట్ ఫర్ ఏ ఛేంజ్.. అమెరికాలో హిందూ ఓటర్ల కోసం.. పెద్ద రాజకీయమే నడుస్తోంది. ఇప్పటికే.. అమెరికా ఎన్నికల్లోకి హిందుత్వ ఎజెండా వచ్చి చేరింది. హిందుత్వాన్నే.. డొనాల్డ్ తన ట్రంప్ కార్డ్‌గా వాడతారని ఎవ్వరూ ఊహించలేదు. దీపావళి రోజున ఇండియాలో పటాసులు పేలితే.. అమెరికాలో మాత్రం టపాసులను మించి ట్రంప్ చేసిన ట్వీట్ పేలింది. హిందువులపై ఆయన ఒలకబోసిన ప్రేమకు.. అంతా అవాక్కయ్యారు.
ట్రంప్ చేసిన కామెంట్లు చూశాక.. అందరికీ వచ్చిన డౌట్ ఒక్కటే! ఈసారి జరగనున్న అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో.. హిందువుల ఓట్లు కీలకంగా మారనున్నాయా? అని! కేవలం.. దీపావళి కాబట్టే.. ట్రంప్ ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చనుకునేందుకు చాన్స్ లేదు. ఎందుకంటే.. దానికోసమే అయితే.. జస్ట్ హ్యాపీ దీపావళి అని సింపుల్‌గా తేల్చేసేవాడు. కానీ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను ప్రస్తావించడమే కాదు.. అమెరికాలోని హిందువులకు తాను రక్షణగా ఉంటానని చెప్పడం వెనుక.. రాజకీయమే దాగుందనే విషయం క్లియర్‌గా తేలిపోయింది. హిందూ అమెరికన్ల ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకే.. ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారనే విషయం అర్థమవుతోంది.
ట్రంప్ హిందూ కార్డ్ బయటకు తీయడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్‌లో భారతీయ-అమెరికన్ల ప్రభావం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే యూకే ఎన్నికల్లో బ్రిటీష్ ఇండియన్ల ప్రభావం కనిపించింది. ఇప్పుడు.. యూఎస్‌లోనూ అదే పరిస్థితి! పైగా.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి ప్రధానమైన ఎన్నికల్లో.. హిందూ ఓటర్లు కీ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా.. అమెరికాలో! ఎందుకంటే.. డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ రేసులో ఉన్న కమలా హ్యారిస్.. ఓ భారతీయ హిందువు కుమార్తె.
ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ద్వారా.. కమలకు హిందూ మతంతో స్ట్రాంగ్ లింక్ ఉంది. పైగా.. ఆమె పేరు కూడా హిందువులు పెట్టుకునేదే! చాలా సార్లు.. ఆమె హిందూ మతంతో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. ఇప్పుడు.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో ఉన్నది కూడా ఆవిడే! అందుకే.. ట్రంప్ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ఉన్న హిందూ అమెరికన్ల ఓట్లు గంపగుత్తగా కమలకే పడిపోకుండా.. కొంతమందినైనా తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసమే.. దీపావళి రోజు ఆయన హిందువులను ఆకర్షించేలా ట్వీట్ చేసినట్లు అర్థమవుతోంది.
Also Read: హాలోవీన్ వేడుకల్లో కాల్పులు జరిపిన ఉన్మాది.. ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ మరొకటుంది. అమెరికా ఎన్నికల పోరులో.. కమల గుర్తించదగిన హిందూ పేర్లలో ఒకరు. ఆవిడ పేరే కాదు.. ఆమెకున్న హిందూ మూలాలు కూడా భారతీయ అమెరికన్లకు ఎమోషనల్‌గా కనెక్టింగ్ పాయింట్. ఇది గనక డెమొక్రాట్లకు వర్కవుట్ అయితే.. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు కొంత మేర నష్టం తప్పదనే అంచనాకు ట్రంప్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసినప్పుడే.. ఆమెకు హిందువుల నుంచి దక్కిన మద్దతును ట్రంప్ ప్రత్యక్షంగా చూశారు. అందుకే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ తీసుకోవద్దని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. హిందూ అమెరికన్ల ఓట్లను ప్రసన్నం చేసుకోవడం ద్వారా.. డెమొక్రాట్లను ఎంతో కొంత దెబ్బ తీయొచ్చని ట్రంప్ టీమ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ లెక్కతోనే దీపావళి రోజున ట్రంప్‌తో హిందువులను ఆకర్షించేలా ట్వీట్ చేశారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
ప్రస్తుతం.. అమెరికాలో హిందూ మతం నాలుగో అతిపెద్ద కమ్యూనిటీగా ఉంది. పైగా.. అమెరికాకు వలసొచ్చే వారిలో భారతీయులే రెండో అతిపెద్ద ఇమ్మిగ్రెంట్ గ్రూప్. యూఎస్ మొత్తం జనాభాలో దాదాపు 6 శాతంగా ఉన్న ఆసియా అమెరికన్లలో.. పది శాతం మంది హిందూ మతాన్నే అనుసరిస్తున్నారు. అమెరికాలోని మొత్తం జనాభాలో 20 లక్షల మందికి పైగా హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే హిందువులు ఎక్కువగా ఉన్న ఎనిమిదో దేశం.. అమెరికానే! ఈ సంఖ్య.. ఇంకా పెరిగే అవకాశం ఉందని.. కొన్ని రీసెర్చ్‌లు చెబుతున్నాయ్. 2050 నాటికి.. అమెరికా ఐదో అతిపెద్ద హిందూ జనాభాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే.. ఆసియా నుంచి యూఎస్ వెళ్లిన ప్రతి 10 మందిలో ఒకరు హిందువే ఉన్నారని.. ఓ అధ్యయనంలో తేలింది. ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భారతీయులకు రక్షణతో పాటు గౌరవం పెరిగింది. అందుకే.. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో హిందూ అమెరికన్ల ప్రస్తావన బాగా పెరిగింది. అమెరికాలో స్థిరపడిన హిందువుల్ని ప్రసన్నం చేసుకునేందుకు.. అటు డెమొక్రాట్లు, ఇటు ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో హిందువులు ఎవరి వైపు ఉంటారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారతీయ హిందూ మూలాలన్న కమల హ్యారిస్ వైపు నిలబడతారా? లేక.. హిందువులకు రక్షణగా ఉంటానని హామీ ఇస్తున్న ట్రంప్‌కు మద్దతు తెలుపుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.