EPAPER

Demonetisation : నోట్ల రద్దుకు ఆరేళ్లు.. అనుకున్న లక్ష్యం నెరవేరిందా?

Demonetisation : నోట్ల రద్దుకు ఆరేళ్లు.. అనుకున్న లక్ష్యం నెరవేరిందా?

Demonetisation : పెద్దనోట్ల రద్దు జరిగి ఆరేళ్లు పూర్తైంది. మరి నోట్ల రద్దు సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలేమయ్యాయి? ఎంతవరకూ కార్యరూపం దాల్చాయి? మధ్య తరగతి, పేద ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందా? అసలు అనుకున్న లక్ష్యం నెరవేరిందా?


2016 నవంబర్ 8.. దేశ ప్రజలంతా ఎవరి పనుల్లో వాళ్లున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు.. పిడుగు లాంటి వార్త దేశాన్ని ఊపేసింది. అదే పెద్ద నోట్ల రద్దు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ… 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకూ మార్కెట్లో ఉన్న 86 శాతం కరెన్సీ చిత్తు కాగితాలుగా మారిపోయింది. ఇది అవినీతిపై మాస్టర్‌ స్ట్రోకన్నారు ప్రధాని మోడీ. నోట్లు రద్దు తర్వాత తనకు 50 రోజులు గడువు కావాలని కోరారు… ప్రధాని మోడీ. డిసెంబర్ 30 వరకూ గడువిస్తే… ఆ తర్వాత నోట్ల రద్దు నిర్ణయం తప్పని తేలితే.. ఏ చౌరస్తాలో నిలబెట్టి శిక్ష విధించినా భరిస్తానన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు శరాఘాతంగా మారిన నల్లధనాన్ని అరికట్టడానికే నోట్ల రద్దు నిర్ణయమని చెప్పారు… మోడీ. ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఇది సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ భారత్ దిశగా ఇదో పెద్ద ముందడుగు అన్నారు.. ప్రధాని.

నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక… బడాబాబులు ఏ మాత్రం కష్టపడకుండా కరెన్సీని మార్చుకుంటే… సామాన్య ప్రజలు మాత్రం తమ దగ్గరున్న పాత కరెన్సీని మార్చుకోడానికి మూడు, నాలుగు నెలల పాటు బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిల్చుని నానా బాధలూ పడ్డారు. నోట్లు మార్చుకునే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వంద మందికిపైగా చనిపోయారు కూడా. కానీ… నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. వ్యవస్థలో చలామణిలో ఉన్న 99 శాతం కరెన్సీ బ్యాంకుల్లో జమ అయిందని RBI ప్రకటించింది. కొందరు పాత కరెన్సీని ఆస్తుల రూపంలోకి మార్చుకున్నారని తేల్చింది. అంతేకాదు… కేంద్రం ఏకంగా రూ.2000 నోట్లు ప్రవేశపెట్టడంతో… మెల్లగా వాటి దొంగనోట్లు కూడా మార్కెట్లోకి రావడం మొదలైంది. దీంతో కేంద్రం రూ.2000 నోటు ముద్రణను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో…
కేంద్రం నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. నోట్ల రద్దు నల్లధనంపై కాదు… ఆర్థికవ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్ అని మండిపడ్డాయి. కేవలం కొందరు బడా కార్పొరేట్ వ్యాపారుల కోసం… కోట్ల మంది ప్రజల్ని కష్టపెట్టారని విరుచుకుపడ్డాయి.


నోట్ల రద్దు… దేశ జీడీపీపై పెను ప్రభావం చూపింది. ఆర్ధికవృద్ధి తగ్గుముఖం పట్టి 5 శాతం దగ్గరే స్థిరపడింది. కొన్ని రోజుల పాటు వ్యాపారాలన్నీ మందగించాయి. నిరుద్యోగ రేటు కూడా గరిష్టస్థాయికి చేరుకుంది. నోట్ల రద్దు తర్వాత ఉద్యోగాలపై, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని పలు సర్వేలు వెల్లడించాయి. భారత స్థూల విలువ జోడింపులో సగ భాగంగా పరిగణించే వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాలు నోట్ల రద్దుతో కుదేలయ్యాయి. దేశంలో ఉద్యోగాలు సృష్టించడంలో ఈ మూడు రంగాలదే కీలక పాత్ర. జీవీఏను మొత్తం ఉత్పత్తుల విలువ, అందించిన సేవల ఆధారంగా లెక్కిస్తారు. నోట్ల రద్దుకు ముందు ఈ మూడు రంగాలు 8 శాతం వృద్ధి రేటుతో ఉండగా… ఆ తర్వాత 4.6 శాతానికి పడిపోయింది. నోట్ల రద్దు ప్రభావం 15 బిలియన్ డాలర్లు… అంటే జీడీపీలో 1.5 శాతం వరకూ ఉందని అంచనా వేశారు. నోట్ల రద్దు తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలతో ఆర్థిక రంగం గాడిన పడుతున్న సమయంలో… కరోనా, లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బకొట్టాయి. దేశం స్తబ్దుగా మారి కొన్ని నెలల పాటు పారిశ్రామిక రంగం నిస్తేజమైంది. తర్వాత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినా… దాదాపు రెండేళ్ల పాటు ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయింది.

కేంద్రం ఏ లక్ష్యంతో నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందో… ఆ నిర్ణయం సరైంది కాదని ఎన్నో సందర్భాల్లో రుజువవుతూనే వస్తోంది. నోట్లు రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయినా… ప్రజల్లో నగదు చలామణి ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఓ రేంజ్ లో పెరిగింది. 2016 నవంబర్ 4 నాటితో పోలిస్తే ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగి… రూ.17.7 లక్షల కోట్ల నుంచి రూ.30.88 లక్షల కోట్లకు చేరినట్లు RBI తాజా గణాంకాలు వెల్లడించాయి.

ఇక నోట్ల రద్దుతో కాస్తో కూస్తో ప్రయోజనం ఏదైనా కలిగిందంటే… అది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్లే అని చెప్పక తప్పదు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ భారీగా పెరిగాయి. ప్రత్యేకించి, పన్ను చెల్లింపులను ఎగ్గొట్టి తిరిగే వ్యాపారుల చీకటి యత్నాలకు అడ్డుకట్ట పడిందని చెప్పొచ్చు. దీనికి తోడు పౌరులు, ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాల ఆస్తులను తప్పనిసరిగా బహిర్గతం చేయడం, ఆస్తులతో ఆధార్ లింకింగ్ వంటి అంశాలు నల్లధనాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి. ప్రతీ లావాదేవీని నమోదు చేయాల్సి రావడంతో… పన్ను చెల్లింపులు పెరిగాయి. కొత్తగా పన్ను పరిధిలోకి 56 లక్షల మంది వచ్చి చేరారు. ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలు పాతిక శాతానికి పైగా పెరిగింది. వ్యక్తిగత ఆదాయపన్నులో ముందస్తు వసూళ్లు 50 శాతానికి పైగా పెరిగాయి. 2 లక్షలకు పైగా డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దై పోయాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు కూడా నగదు లభ్యత తగ్గింది. పాత నోట్లను మార్చుకునే దారి లేకపోవడంతో… ఉగ్ర సంస్థలు నిధుల సమస్యతో విలవిలలాడాయి. ప్రధానంగా జమ్మూకశ్మీర్‌లో .. ఉగ్రదాడులు, రాళ్ల దాడులు తగ్గాయి. నక్సలైట్ల పైనా నోట్ల రద్దు ప్రభావం పడింది. హవాలా లావాదేవీలు సగానికి తగ్గాయి. పాకిస్తాన్‌లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. మొత్తమ్మీద పెద్దనోట్ల రద్దు కారణంగా చాలా నష్టాలు, కష్టాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ… అనుకున్న లక్ష్యాల్లో కొన్నే నెరవేర్చగలిగింది… కేంద్రం. ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాల్ని అందుకోవడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×