తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన నేతలు, బీజేపీ శ్రేణులు నామినేడెట్ పదవుల కోసం ఆశగా పడిగాపులు పడుతున్నాయి . తొలి విడతలో కొన్ని పదవుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పదవుల పంపకం పై మళ్లీ ప్రకటన చేశారు. త్వరలో నామినేటెడ్ పదవుల పంపకం జరుగుతుందని ఆయన ప్రకటన చేసినా ఆచరణలో మాత్రం కన్పించటం లేదు.. కూటమి పార్టీల నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
ఏపీలో సూపర్ విక్టరీ కొట్టిన కూటమి నేతలు నామినేటెడ్ పోస్టులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇవాళ.. రేపు అన్నట్లు ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అది అమలులోకి రాలేదు. మూడు పార్టీల కూటమిలో ఏ పార్టీకి ఎన్ని పదవులు అన్న విషయంపై క్లారీటీ వచ్చినా.. పదవుల పంపకంపై జాప్యం జరగుతుండటం ఎందుకో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
జూన్ 4న ఫలితాలు వస్తే.. అదే నెల 12న కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. అయితే కూటమి భారీ విజయం వెనుక మూడు పార్టీల నేతలు, క్యాడర్ ఎంతో శ్రమపడ్డారు. వీరికి కృతజ్ఞతగా నామినేటెడ్ పదవులను ఇవ్వాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయించారు. ఐతే ఆగస్టు వరకు ఆషాఢం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో నియామకాలపై వాయిదా వేశారు. అయితే మంచి ముహూర్తాలు వచ్చి, సెప్టెంబరు, అక్టోబరు నెలలు గడిచిపోతున్నా పదవుల భర్తీ చేపట్టకపోవడంపై కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సీఎం చంద్రబాబు ఎమోషనల్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే, చావు గురించి ఆలోచించి
తొలివిడతలో 20 కార్పొరేషన్లకు పాలక వర్గాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ నెలలో మలి జాబితా ప్రకటిస్తుందని భావించారు. కూటమిలో నేతల మధ్య ఈ విషయమై సమన్వయ సమావేశాలు కూడా జరిగాయంటున్నారు. మూడు పార్టీల నుంచి చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఎవరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయంట. లిస్టు మొత్తం రెడీగా ఉన్నా విడుదల చేయడంలోనే జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో టీటీడీతో సహా ముఖ్యమైన పది ఆలయాలు, దాదాపు వంద వరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కీలకంగా ఉన్నాయి. ఇవికాక రీజనల్ బోర్డులు, నియోజకవర్గ స్థాయిలోనూ కొన్ని పదవులు ఉన్నాయి. టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి దేవినేని ఉమ, వంగవీటి రాధ వంటి ముఖ్య నేతలకు పదవులు ఖాయమని వారి అనుచరులు నమ్మకంతో ఉన్నారు. అలాగే జనసేన నుంచి డాక్టర్ పీ.హరిప్రసాద్, మలినీడి బాబీ, కన్నా రజిని వంటి వారి పేర్లు పదవుల రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా తమ నేతల లిస్ట్ ఇచ్చిందంటున్నారు.
తొలుత దుర్మూహూర్తాలు అని పెండింగ్ పెట్టగా, ఆ తర్వాత సర్వేల పేరిట కొన్నాళ్లు జాప్యం చేశారు.. అంతా కొలిక్కి వచ్చిందన్న సమయంలో విజయవాడ వరదలతో లిస్టు పెండింగ్‌లో పడిపోయింది. తర్వాత తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. మొత్తానికి డైలీ సీరియల్ ఎపిసోడ్‌లా సాగుతున్న నామినేటెడ్ పదవుల పందారానికి ఈ నెలలో మోక్షం లభిస్తుందని అనుకున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ విదేశ పర్యటనకు వెళ్లడంతో నామినేటెడ్ పదవుల పంపకం వాయిదా పడ్డాయట.. ఆయన అందుబాటులో వున్నప్పుడు పదవుల పంపకం ఎందుకు ప్రారంభించలేదు అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇంతకీ నామినేటెడ్ పదవుల రెండో విడత పంపకం ఎప్పుడు ప్రారంభం అవుతుందో? ఎన్ని విడతల్లో పదవుల పంపిణీ జరుగుందో అన్నది ఎవరికీ క్లారిటీ లేకుండా పోయిందిప్పుడు.