TDP vs Janasena: దెందులూరులో ఆధిపత్య పోరు.. మిత్రపక్షాల మధ్య చిచ్చు పెడుతోందా? టీడీపీ – జనసేన నాయకుల మధ్య వార్ ప్రశాంతంగా ఉండే కొల్లేరు గ్రామాలను అట్టుడుకిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారికి పెన్షన్లు పంపిణీ చేసే అర్హత లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. అభిప్రాయంతో ఒక్కసారిగా సీన్ మారిందట. NDA కూటమిలో బహిరంగ యుద్ధానికి అసలు కారణం వేరే ఉందా..? కుమ్ములాటలతో కూటమి కొంప కొల్లేరేనా..? వాచ్ దిస్ స్టోరీ.
ఏలూరు జిల్లా దెందులూరులో కూటమి నేతల్లో సఖ్యత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇక్కడే కాదు.. ఏదో ఒక చోట NDA కూటమిలో మిత్రపక్షాలైన తెలుగుదేశం – జనసేన పార్టీ నాయకుల మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారుతూనే ఉందట. ప్రధానంగా కొల్లేరు గ్రామాల్లో టీడీపీ – జనసేన మధ్య వార్ బహిరంగయుద్ధంగా మారడంతో రోడ్లపైనే కుమ్ములాటలకు దిగే పరిస్థితి తీసుకొచ్చిందట. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో పెన్షన్ పంపిణీ వ్యవహారంలో ఇరుపార్టీల శ్రేణులూ.. రోడ్లపై బహిరంగంగా కొట్టుకున్న ఘటన.. ఆ పార్టీలో తీవ్రత చిచ్చు రేపుతోందంటూ టాక్ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రెండు పార్టీలు కూడా గేట్లు తెరవడంతో మొదలైన వలసలపర్వం.. ఈ ఘర్షణలకు ఆద్యం పోసిందా.. అనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయట.
వైసీపీ నుంచి జెడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాద్.. తొలుత జనసేనలో చేరుతున్నామంటూ ప్రకటించి, తర్వాత అకస్మాత్తుగా టీడీపీలో చేరడం.. జనసేనలో కోల్డ్ వార్‌కు తెరలేపిందట. ఇదే.. ఈ రెండు పార్టీల మధ్య వైరానికి కారణమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ, మండలస్థాయిలో YSRCP నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు కొంతమంది… జనసేనలో చేరడంతో అంతర్యుద్ధం కాస్తా బహిరంగ యుద్దంగా మారిందట. వైసీపీలో ఉండలేక.. పబ్బం గడుపుకోవడం కోసం జనసేనలో చేరారంటూ.. టీడీపీ నేతలు చేస్తున్న తీవ్ర విమర్శలు మిత్రపక్షాల కార్యకర్తల్లో కలవరం రేకెత్తిస్తున్నాయట.
అసలు గొడవలకు దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి కారణమే వాదనలూ ఉన్నాయి. ఆమె వల్లే కూటమిలో కల్లోలం ఏర్పడిందని టీడీపీ శ్రేణులు, పైడి చింతపాడు కొల్లేరు నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఘంటసాల వర్గం తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఘంటసాల వెంకటలక్ష్మి లక్షల రూపాయలు తీసుకుని.. వైసీపీలోని పైడి చింతపాడు సర్పంచ్, మాజీ సర్పంచ్ సహా కొంతమంది YCP నాయకులను జనసేన పార్టీలోకి చేర్చుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. జనసేనలో వైసీపీ నాయకుల చేరికకు అసలు కారణం వేరే ఉందని కొల్లేరు నేతలు చేస్తున్న విమర్శలతో… రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే కాక…ఆర్థిక పోరు కూడా ఉందని తేటతెల్లం చేస్తోందట.
Also Read: వైసీపీలో లోకేష్ టెన్షన్.. జైలుకి వెళ్లేది వీళ్లేనా?
మొదటి నుంచీ.. కొల్లేరు గ్రామాల్లోని కాంటూరు పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వేలాది ఎకరాల చెరువుల్లో అక్కడి గ్రామస్తులు సాగుచేసుకోవడం.. గ్రామపెద్దలు వాటి సొమ్మును ప్రజలకు పంచడం ఆనవాయితీగా వస్తోందట. అయితే రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడం… కొల్లేరు సహజసిద్ధ సంపద అనేది కారణంగా చూపించి.. కొల్లేరు చెరువుల సొమ్ములపై నేతలు అజమాయిషీ చేయటం కారణంగానే కొల్లేరు గ్రామాల్లో కండువాలు మారుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతల కనుసనల్లోనే… బంటా చెరువులు కానీ, ఆర్థిక లావాదేవీలుగానీ జరుగుతున్నాయట. గతంలో కాంగ్రెస్, తర్వాత టీడీపీ, అనంతరం వైసీపీ..ఇలా ఎవరికి వారు సహజసిద్ధ కొల్లేరులో పార్టీ జెండాలు పాతుతూ ప్రకృతి సంపదను పంచుకుంటూ వచ్చారనే వాదనలు ఉన్నాయి. కొల్లేరు వివాదంలో నేతల జోక్యం విపరీతంగా పెరగడంతో అమాయక ప్రజలు రాజకీయ చట్రంలో ఇరుక్కుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు కూడా కొల్లేరులో మిత్ర పక్షాల మధ్య వార్‌కు ఇదే అసలు కారణంగా తెలుస్తోందని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారట. పైడిచింతపాడులో కొందరు వైసీపీ నాయకులు కొల్లేరు చెరువుల మీద కోట్ల రూపాయలు కాజేసి… వాటిని చెల్లించకుండా ఉండేందుకే జనసేన పార్టీలో చేరారని టీడీపీ నేతల వాదనగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని సైదు సత్యనారాయణ వర్గం ఆరోపించడంతో.. జనసేన శ్రేణులను ఆగ్రహానికి గురిచేసిందట. పైడిచింతపాడులో జరిగిన ఘటనలో సత్యనారాయణ తనయుడు నాగరాజు తీవ్రంగా గాయాలపాలు అయ్యి..ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన- టీడీపీ రగడపై ఆరా తీయడం హాట్ టాపిక్ గా మారిందట. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారికి పెన్షన్లు పంపిణీ చేసే అర్హత ఎక్కడ ఉందని.. ఇది ప్రశ్నించినందుకు టీడీపీ నాయకులపై దాడి చేస్తారా అనేది ప్రభాకర్ వెర్షన్. కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో కష్టపడ్డ వారికే పెన్షన్ల పంపిణీ అర్హత ఉందని.. ఇలాంటి వారిని అడ్డుపెట్టుకొని మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేదిలేదని చింతమనేని హెచ్చరించడంతో మిత్రపక్షాలు ఆలోచనలో పడ్డాయట.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటామని..పార్టీ అధిష్టానాలకు తెలియజేస్తామని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడంతో నియోజవర్గంలో కొల్లేరు గ్రామాల పంచాయితీ.. ఎన్డీయే కూటమి అధిష్టానాలకు తలనొప్పిగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణకు కారకులు ఎవరైనా.. రోడ్డెక్కింది మాత్రం జనసేన- తెలుగుదేశం జెండాలు కావడంతో దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్.. విభేదాలను ఎలా చక్కబెడతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. జనసేనలో ఉన్న ప్రజాప్రతినిధులకు పెన్షన్లు పంపిణీ చేసే అర్హత లేదన్న విమర్శలపై ఎలాంటి సమాధానం చెప్తారనేది ఉత్కంఠగా మారింది.యాగనమిల్లి, మొండికోడు గ్రామాల్లోనూ కొల్లేరు చెరువుల సొమ్ములు కాజేసేందుకు, ఆధిపత్యం చెలాయించేందుకు వైసీపీ నేతలు.. జనసేనలో చేరారని టీడీపీ నాయకులు కరాఖండీగా చెబుతున్నారు. ఇంకా ఎన్నో గ్రామాల్లో మొదలవనుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. NDA కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా గడవకుండానే మిత్రపక్షల మధ్య యుద్ధాలు జరుగుతుండడం… ఇది ఎంతవరకు దారితీస్తుందోనని పార్టీ శ్రేణుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దెందులూరులో కొల్లేరు కార్చిచ్చుపై నీళ్లు చల్లి శాంతింపజేస్తారా.. లేదా..అనేది పెరుమాల్లకే ఎరుక అన్నట్లుగా పరిస్థితి మారింది.