Big Stories

AP Politics : ఏపీలో మళ్లీ 2014 కాంబినేషన్..చంద్రబాబుకు ఆహ్వానం అందుకేనా?

AP Politics : ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తోంది. మళ్లీ 2014 కాంబినేషన్ సిద్ధమవుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక ఈ కూటమిలో చేరాల్సిన పార్టీ టీడీపీ మాత్రమే. ఆహ్వానం అందితే చేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో రాయభారం నడుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీని కలుపుకుని పోవాలని జనసేనాని కాషాయ అగ్రనేతలకు చెప్పారని టాక్ వినిపిస్తోంది. విశాఖలో జరిగిన మోదీ-పవన్ భేటీలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారని సమాచారం. టీడీపీకి ఓటు బ్యాంకు బలంగా ఉందన్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారట పవన్. టీడీపీతో కలిసి వెళితేనే బీజేపీకి, జనసేనకు లాభం చేకూరుతుందని మోదీకి చెప్పారని సమాచారం.

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే జనసేనాని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోనని స్పష్టత నిచ్చారు. అంటే కచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. అయితే బీజేపీతోనే అసలు సమస్య ఎదురవుతోంది. టీడీపీని కలుపుకునిపోవడానికి కాషాయ నేతలు సిద్ధంగా లేరు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు బయటకురావడం, మోదీపై తీవ్ర విమర్శలు చేయడం ఇందుకు కారణంగా చాలా మంది బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే ప్రకటిస్తున్నారు. ఏపీలో ముక్కోణపు పోటీ జరిగితే కలిసి వచ్చేది వైఎస్ఆర్ సీపీకే. ఎందుకంటే టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి మధ్య ఓట్లు చీలితే అధికార పార్టీకి లాభం చేకూరుతుంది. అందుకే వైఎస్ఆర్ సీపీ కూడా బీజేపీకి దగ్గరగా ఉంటోంది. సీఎం జగన్ ఇప్పటి వరకు ప్రధాని మోదీని ఒక్క మాట కూడా అనలేదు.

- Advertisement -

అయితే మోదీ-పవన్ భేటీ తర్వాత బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లే కనిపిస్తోంది. టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. విషయం ఏమిటంటే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగుతుంది. మొన్నటి వరకు చంద్రబాబును దూరంగా పెట్టిన బీజేపీ ఇప్పుడు ఈ సమావేశానికి ఆహ్వానం పంపడం ఆసక్తిని రేపుతోంది. ఈ ఆహ్వానం వెనుక అసలు కథ..పొత్తులేనని స్పష్టమవుతోంది.

చంద్రబాబు బీజేపీ, జనసేనను కలుపుకుపోవాలనే భావిస్తున్నారు. విశాఖలో పవన్ కల్యాణ్ ర్యాలీని ప్రభుత్వం అడ్డుకోగానే పవన్ కు మద్దుతుగా మాట్లాడారు. విజయవాడలో జనసేనాని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం నుంచి ఆహ్వానాన్ని రాజకీయ కోణంలో కచ్చితంగా చంద్రబాబు వినియోగించుకుంటారు. ఢిల్లీ పర్యటనలో బీజేపీతో పొత్తుకు బాటలు వేసుకోవడం ఖాయం. ఏపీలో ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీ..టీడీపీతో పొత్తుకు మొగ్గచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఏపీలో రెండు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మను ఓడించింది బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు కావడం విశేషం. ఆ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేల స్థానాలను బీజేపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కలేదు. ఒంటరి పోటీ చేసిన జనసేన ఒక్క సీటుకే పరిమితమైంది.

లెక్కలివే
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ కి దాదాపు 50 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి దాదాపు 40 శాతం ఓట్లు పడ్డాయి. జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. టీడీపీ, జనసేన కలిస్తే 46 శాతం ఓటింగ్ ఈ కూటమికి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ కూటమికే పడితే అధికారం దక్కించుకోవడం పెద్దకష్టమేమికాదు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగితే ..2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News