EPAPER

Telangana Budget : చారణా కోడికి బారణా మసాలా..!

Telangana Budget : చారణా కోడికి బారణా మసాలా..!
  • బడ్జెట్‌లో ఒక్క కొత్త పాలసీ లేదు
  • మా అప్పులు సరే.. మేం ఏర్పరచిన ఆస్తులు?
  • మేం తెచ్చిన పెట్టుబడులే మళ్లీ చెప్పారు
  • రుణమాఫీ అందరికీ కాలేదే?
  • కొలువులపై అసత్య ప్రచారం
  • అది నిరూపిస్తే.. రాజీనామా చేస్తా
  • ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ ఫైర్

గత అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ తన హామీలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో బుధవారం జరిగిన ద్రవ్య వినిమ‌యం బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2014లో కొత్తగా తెలంగాణ వచ్చినప్పుడు పూర్తి అనిశ్చిత వాతావరణం ఉండేదని, తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించామని చెప్పుకొచ్చారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలన అన్ని విధాలా అస్తవ్యస్తంగా ఉందని ఆయన విమర్శించారు.


మా పాలనపై విమర్శలా?

సాగునీరు, విద్యుత్, పాలనాపరమైన సమస్యలతో బాటు ప్రతికూల వాతావణంలో తెలంగాణ ఏర్పడినా, కానీ ఆ సమస్యలను అధిగమించి రాష్ట్ర ప్రగతిని పట్టాలకెక్కించామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలనచేశామని, తమ హయాంలో మానవాభివృద్ధి సూచికలో తెలంగాణకు మెరుగైన స్థానం సాధించిందన్నారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడినా, ఆర్బీఐ గ‌ణాంకాలు నిజాల‌ను నిగ్గు తేల‌స్తున్నాయన్నారు.


సర్‌ప్లస్‌తో అప్పగించాం

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ అన‌డం స‌రికాదని, 2014లో రెవెన్యూ సర్‌ప్లస్ రూ. 369 కోట్లు కాగా, 2022-23 నాటికి అది రూ. 5,944 కోట్లకు చేరిందన్నారు. ఏమీ చేయకుండానే ఇంత వృద్ధి సాధ్యమైందా? అని నిలదీశారు. జీతాలకూ అప్పులు తెస్తున్నామ‌ని భట్టి అన‌డం సరికాదనీ, తమ హయాంలో కరోనా వచ్చినా.. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, ఆస‌రా, రైతుబంధు వంటి పథకాలకు నిధులిచ్చామన్నారు. 74 శాతం డెవ‌ల‌ప్‌మెంట్ ఎక్స్‌పెండించ‌ర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని లెక్కచెప్పారు.

అంతా తిరోగమనమే..

కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు, చేనేత ఆత్మహత్యలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలతో రాష్ట్రం తిరుగోమన అడుగులేస్తుందన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని అనొద్దన్నారు. బ‌డ్జెట్‌లో, శుష్క ప్రియాలు..శూన్య హ‌స్తాలు, గ్యారెంటీల‌కు టాటా, లంకె బిందెల వేట‌, డిక్లరేష‌న్లు డీలా.. డైవ‌ర్షన్ల మేళా, హామీ ప‌త్రాలకు పాత‌ర‌.. శ్వేత ప‌త్రాల జాత‌ర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు.. జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు, నేతన్నలకు ఆత్మహత్యలు.. ఆటో అన్నలకు బలవన్మరణాలు, ఓటర్లకు ఎన్నికలకు ముందు అభ‌య హ‌స్తం.. ఓట్లు ప‌డ్డాక శూన్య హ‌స్తం, మ్యానిఫెస్టో అర‌చేతిలో స్వర్గం.. బ‌డ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం, మూడు తిట్లు.. ఆరు అబ‌ద్దాల‌తో పొద్దున లేస్తే బ‌ట్ట కాల్చి మీద వేసే ప‌నులు తప్ప ఈ బడ్జెట్‌లో ఇంకేమీ లేదని కేటీఆర్ సెటైర్ వేశారు.

అప్పుల మీద అసత్యాలు..

తమ హయంలో చేసిన మొత్తం నికర అప్పు.. రూ. 3,85,340 కోట్లు మాత్రమేనని, కానీ, కాంగ్రెస్ నేతలు రూ. 6.71 లక్షల కోట్ల అప్పులున్నట్లుగా ప్రచారం చేస్తోందని తెలిపారు. తమ హయాంలో మూసీ సుందరీకరణకు రూ.16 వేల కోట్లతో ప్లాన్ రూపొందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తొలుత రూ.50 వేల కోట్లకు పెంచి, ఇప్పుడు ఏకంగా రూ. లక్షన్నర కోట్లు చేసిందని, దీని డీపీఆర్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వమే పనికిరాని స్కీమ్‌గా అభివర్ణించిందని, కనుక మంచి బీమా పథకం గురించి ఆలోచించాలని సలహా ఇచ్చారు. గత 8నెలల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేతన్నలకు సాయం అందించాలన్నారు.

పెట్టుబడులు తెస్తే మంచిదే..

సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో పెట్టుబడుల కోసమని అమెరికా వెళుతున్నారని, అయితే, గతంలో దావోస్ పర్యటనలో ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల లెక్కలలో గోల్‌మాల్‌ను సరిచూసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. వెస్ట్‌గోదావరి మహేశ్ గోడి ఇండియా అనే కంపెనీ వార్షిక రిపోర్టులో రూ. 27 లక్షల లాస్ లో ఉన్నట్లు చూపిస్తుంటే.. అలాంటి కంపెనీ రూ. 8000 కోట్లు ఎలా పెట్టుబడి పెడుతుందని ఒప్పందం కుదుర్చుకున్నారో అర్థం కావటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పడం సరికాదని, అందులో సగానికి పైగా తాము తెచ్చిన పెట్టుబడులేనన్నారు.

రైతు రుణమాఫీలో కోతలు..

రుణమాఫీ అంతా గోల్‌మాల్ వ్యవహారంగా ఉందని, రూ. లక్ష లోపు రుణాల మాఫీకి రూ. 16వేల కోట్లు ఖర్చయితే, రూ. 1.5 లక్షల రుణమాఫీకి 12 వేల కోట్లే ఎలా సరిపోతాయో తెలియటం లేదన్నారు. పెద్దసంఖ్యలో అర్హులైన రైతుల పేర్లు తొలగించినట్లు అనుమానం వస్తోందన్నారు. మొదట రూ. 40 వేల కోట్లతో రుణమాఫీ అని చెప్పుకొని, తర్వాత దానిని రూ 31 వేల కోట్లకే పరిమితం చేసి, ఆనక బడ్డెట్‌లో మాత్రం రూ. 25 వేల కోట్లే పెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో 6.47 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే.. మంత్రి ఉత్తమ్ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని అసత్యాలు ప్రచారం చేయటం సరికాదన్నారు.

రాజీనామా చేస్తా: కేటీఆర్

తెలంగాణలోని నిరుద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు మెడికల్‌ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు లేవన్నారు. తాము చేసిన అప్పులతో బాటు ఏర్పరచిన ఆస్తుల గురించీ చెప్పాలన్నారు. ప్రభుత్వం వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవటం నిజంకాదనీ, సీఎం, ఆర్థిక మంత్రితో కలిసి తాను అశోక్ నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళదామని.. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు అక్కడి నిరుద్యోగులు చెబితే.. తాను అక్కడే ఎమ్మెల్యే పదవికి రాజీనామాయే గాక రాజకీయ సన్యాసం చేస్తానని, రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

Related News

Nimmala Ramanaidu: నిమ్మల గ్రేట్ జాబ్.. చంద్రబాబు ప్రశంసలు

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

Chakali Ailamma: తెలంగాణ హక్కుల బావుటా.. ఐలమ్మ..!

HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2

Nandigam Suresh: నందిగం సురేష్‌కి.. బిగిస్తున్న ఉచ్చు..

Mahesh Kumar Goud:హేమా హేమీలు పోటీలో ఉన్నా.. టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడే ఎందుకంటే?

Kaloji Narayana Rao: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!

Big Stories

×