Big Stories

BJP: ఈటల వచ్చాక ఢిల్లీకి బండి.. అందుకేనా?

BJP: నిజమే. బీజేపీలో ఏదో జరుగుతున్నట్టే ఉంది. రాష్ట్ర నేతల్లో ఆధిపత్య పోరు ఉన్నట్టే ఉంది. అధిష్టానం ఈటల రాజేందర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టే ఉంది. అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయారిటీ తగ్గినట్టే కనిపిస్తోంది. లేటెస్ట్ పరిణామాలు ఆ ప్రచారానికి మరింత ఊతం ఇస్తున్నాయి. ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి.. పార్టీ పెద్దలతో మంతనాలు జరిపొచ్చాక.. ఆ మర్నాడు బండి సంజయ్ తీరిగ్గా హస్తిన వెళ్లారు. పైకి పర్సనల్ ట్రిప్ అని చెబుతున్నా.. లోలోన ఏదో జరుగుతోందని అంటున్నారు.

- Advertisement -

తెలంగాణ బీజేపీలో చాలా గ్రూపులు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, వివేక్ వెంకటస్వామి.. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూప్ మెయిన్‌టైన్ చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయే అయినా.. ఆయన మాటను మిగతా వారు కేర్ చేయడం లేదని టాక్. అర్వింద్, రఘునందన్‌లు ఓపెన్ గానే.. బయటపడుతున్నారు. ఇక, ఇటీవల బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల మధ్య కోల్డ్ వార్ బాగా ముదిరిందని చెబుతున్నారు.

- Advertisement -

బీజేపీ అధిష్టానం ఈమధ్య ఎమ్మెల్యే ఈటలకు టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ఆయన్ను ఏకంగా చేరికల కమిటీ ఛైర్మన్‌ను చేసింది. బూర నర్సయ్య గౌడ్ తదితరులను పార్టీలోకి లాగి హైకమాండ్ దగ్గర మంచి మార్కులే కొట్టేశారు. అదే ఊపులో పొంగులేటి, జూపల్లిల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వారితో మాట్లాడుతున్న విషయం తనకు తెలీదంటూ, తనకు చెప్పలేదంటూ.. బండి సంజయ్ మీడియా ముందే ఆక్రోషంతో కూడిన ఆవేదన వెళ్లగక్కారు. తాను మాత్రం అమిత్ షా ఆదేశాలతోనే పొంగులేటితో భేటీ అయ్యానంటూ ఈటల.. బండికి కౌంటర్ ఇవ్వడం మరింత రచ్చ రాజేసింది.

కట్ చేస్తే, కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. సౌత్ గేట్ మూసుకుపోయింది. ఇక తెలంగాణనే రహదారిగా మార్చుకొని.. దక్షిణాదిపై దండయాత్ర చేయాలని చూస్తోంది. అందుకే, కర్నాటకలో పోయిన పరువును తెలంగాణలో గెలిచి నిలుపుకోవాలని డిసైడ్ అయింది. అందుకు తగిన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, చేరికలపై చర్చించడానికి ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించింది అధిష్టానం. కర్నాటక ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ఈటల ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి అమిత్ షా, తదితరులతో చర్చలు జరిపారు. ఇది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఇంతటి కీలక అంశాలపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కాకుండా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో చర్చించడాన్ని ఎలా చూడాలి? ఈటల ప్రయారిటీ పెరిగినట్టేగా? బండి ఇమేజ్ తగ్గినట్టేగా? అంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈటల రాజేందరే సీఎం అవుతారంటూ ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిణామాలన్నీ బండి సంజయ్‌ను మరింత అసహనానికి గురి చేస్తున్నట్టున్నాయి.

ఈటల గురువారం ఢిల్లీ నుంచి తిరిగిరాగా.. శుక్రవారం హస్తిన బయలుదేరి వెళ్లారు బండి సంజయ్. హెల్త్ చెకప్ కోసమే బండి ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. హెల్త్ కోసమైతే హైదరాబాద్ లేదా? ఢిల్లీకే వెళ్లాలా? అందులోనూ ఆయన రాగానే.. ఈయన వెళ్లారంటే ఏమనుకోవాలి? పెద్దలను కలిసి తానున్నానని గుర్తు చేయడానికేనా? చర్చల సారాంశం తెలుసుకోవడానికా? ఇలా అనేక ప్రశ్నలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News