Big Stories

BJP: సౌత్ గేట్ బంద్.. ఇక తెలంగాణే రహదారి? కేసీఆర్‌కు కమలం టెన్షన్..

- Advertisement -

BJP: రెండు సీట్ల స్థాయి నుంచి.. రెండుసార్లు అఖండ మెజార్టీతో దేశాన్ని ఏలుతున్న స్థాయికి ఎదిగింది బీజేపీ. ఆ పార్టీని అస్సలు తక్కువ అంచనా వేయలేం. సమర్థులైన నాయకులు, భారీ ఆర్థిక వనరులు, ప్రమాదకరమైన రాజకీయ వ్యూహాలు.. గ్రౌండ్ లెవెల్‌లో ఆర్ఎస్ఎస్ సహకారం.. ఇలా ఓ పార్టీని చిరకాలం అధికారంలో ఉంచగల శక్తిసామర్థ్యాలు బీజేపీకి సొంతం. ఇప్పుడేదో కర్నాటకలో ఓడింది కదాని.. ఇక కమలం పని ఖతం.. కాంగ్రెస్‌దే రాజ్యం అనుకోవడానికి లేదంటున్నారు.

- Advertisement -

సౌత్ ఇండియా కాషాయ పార్టీకి ఎప్పుడూ గట్టి సవాళ్లే విసిరింది. సౌత్ గేట్‌గా భావించే కర్నాటక వరకే రానిచ్చారు దక్షిణాది ప్రజలు. ఇప్పుడు ఆ సౌత్ గేట్ కూడా మూసుకుపోయింది. అలాగని, ఇక దక్షిణాదిని బీజేపీ వదులుకుంటుందా? కానేకాదు.. మరింత ఛాలెంజింగ్‌గా తీసుకుంటుంది. అదే ఇప్పుడు గులాబీ బాస్‌కు గుబులు పుట్టిస్తోంది.

దక్షిణాదిన ఒక్కరాష్ట్రంపైనైనా కాషాయ జెండా ఎగరాలని ఆ పార్టీ గట్టిగా కోరుకుంటుంది. కర్నాటక మిస్ అయింది.. తమిళనాడులో కాలు పెట్టడం ఇప్పట్లో సాధ్యం కాదు. కేరళలో అయితే వేలు కూడా పెట్టనివ్వడం లేదు. ఇక మిగిలింది తెలంగాణ ఒక్కటే. కాస్తోకూస్తో కాదు.. కర్నాటక తర్వాత సౌత్‌లో తెలంగాణలోనే బీజేపీకి మంచి విజయావకాశాలు ఉన్నాయనేది ఆ పార్టీ లెక్క. అందుకే, కర్నాటకలో పోయిన పరువును.. తెలంగాణలో నిలుపుకోవాలని మరింత గట్టిగా పోరాడుతుందనడంలో డౌటే అక్కరలేదంటున్నారు.

కర్నాటకలో అధికారంలో ఉందికాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు, అవినీతి ఊబిలో కూరుకుపోవడంతో అక్కడ ప్రభుత్వం పడిపోయింది. కానీ, తెలంగాణలో అలా కాదు. ఇంతవరకు అధికారంలోకి రాలేదు. బీజేపీ పాలన ఎలా ఉంటుందో ఇక్కడి ప్రజలు రుచి చూడలేదు. కాబట్టి, ఫ్రెష్ లుక్‌తో, ఫ్రెష్ ఎజెండాతో నెగ్గుకురావొచ్చనేది ఆ పార్టీ అభిప్రాయం. బీజేపీ అధికారంలోకి వస్తే రామరాజ్యం తెస్తాం.. ఎంఐఎంను మట్టికరిపిస్తాం.. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం.. మసీదులు తవ్వేస్తాం.. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం.. ఇలా ఏవేవో మాటలు చెప్పి.. ప్రజలను ఈజీగానే తమవైపునకు తిప్పుకోవచ్చని భావిస్తోంది. ఎలాగూ కేసీఆర్ పాలనపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉంది కాబట్టి.. అదంతా బీజేపీకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది.

సౌత్‌లో కర్నాటక పోయింది కాబట్టి.. తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని మరింత ఉడుంపట్టు పడుతుంది బీజేపీ. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఐటీలు తెలంగాణనే కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసుకున్నాయి. మోదీ, షా, నడ్డాలు పదే పదే రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలు సైతం యమ దూకుడు మీదున్నారు. అన్నీకలిసొస్తే.. దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రంపై కాషాయ జెండా ఎగరేయాలనే బీజేపీ ఆశ.. దురాశ ఏమీ కాకపోవచ్చని అంటున్నారు. కాకపోతే మధ్యలో కాంగ్రెస్ ఉండటమే ఆ పార్టీకి బిగ్ మైనస్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News