EPAPER

Biju Patnaik : ఆ గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు.. బిజూ

Biju Patnaik : ఆ గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు.. బిజూ
Biju Patnaik

Biju Patnaik : 1927లో మహాత్మాగాంధీ ఖాదీ ప్రచారం కోసం ఒడిశా పర్యటనకు వచ్చారు. కటక్ నగరంలో కాంగ్రెస్ నిర్వాహకులు గాంధీజీ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే ఆయన గురించి విన్న ఓ పదకొండేళ్ల పిల్లాడు పొరుగింటివాళ్లతో కలిసి సభా వేదిక వద్దకు వెళ్లాడు. గాంధీజీని దగ్గరి నుంచి చూసి నమస్కరించాలనేది ఆ బాలుడి కోరిక. అయితే.. ఆ రోజు సభలో బ్రిటిష్ అధికారులు లాఠీచార్జ్ చేసిన కారణంగా ఆ బాలుడికి మహాత్మాగాంధీని చూసే అవకాశం దక్కలేదు. తన్నుకొస్తున్న దు:ఖంతో ఇంటికొచ్చి తండ్రితో చెప్పుకుని బోరుమన్నాడు.


‘ఇలా ఏడ్చే బదులు నిన్ను గాంధీజీ వద్దకు వెళ్లకుండా ఆపిన బ్రిటిష్ ఆఫీసర్ చెంప పగలకొడితే నేను సంతోషించేవాణ్ణి’ అన్నాడు తండ్రి. ఆ మాటతో బాలుడి ఏడుపు ఆగిపోయింది. అతని ఆలోచనలోనూ గొప్ప మార్పు వచ్చింది. సీన్ కట్ చేస్తే.. మరో పదేళ్లకు ఆ బాలుడు పైలట్ అయ్యాడు. మరో పదేళ్లకు బిజినెస్ మ్యాన్‌గానూ రాణించాడు. మరో పదేళ్లకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని.. జనం మనసులో స్థానం సంపాదించుకున్నాడు. రెండు పర్యాయాలు ఒడిశా సీఎంగా పనిచేసి.. ఆధునిక ఒడిశా నిర్మాతగా జనం మనసులో నిలిచిపోయారు. ఆయనే.. బిజయానంద పట్నాయక్. మనందరికీ బిజూ పట్నాయక్‌గా పరిచయమైన ఒడిసా మాజీ ముఖ్యమంత్రి. నేటి ఒడిసా సీఎం ఈయన కుమారుడే.

లక్ష్మీనారాయణ్ పట్నాయక్, ఆశాలతా దంపతులకు 1916 మార్చి 5న కటక్‌లో బిజూ జన్మించారు. వీరి స్వస్థలం గంజాంలోని అస్కా. తండ్రి జ్యుడీషియల్ సర్వీసులో ఉద్యోగి. తండ్రి నుంచి దేశభక్తిని, సంస్కారాన్ని అలవరచుకున్న బిజూ చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలని అనుకునేవాడు. దీంతో బీఎస్సీ చదువును వదిలేసి, ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఆఫ్ ఏరోనాటిక్స్‌ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి పైలట్ ట్రైనింగ్ పూర్తిచేశాడు. తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొంది ఇండియన్ నేషనల్ ఎయిర్‌వేస్‌లో, ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు.


1942లో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా పనిచేస్తూనే తన దేశభక్తిని చాటుకునేవారు. ముఖ్యంగా రెండవ ప్రపంచయుద్ధం ముగిసే సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పిలుపు మేరకు.. జపాన్ సేనలు మన ఈశాన్య సరిహద్దులో ప్రవేశించే వేళ.. ఆయా ప్రాంతాల్లో క్విట్ ఇండియా ఉద్యమం, ఆజాద్ హింద్ ఫౌజ్ కరపత్రాలను విమానం నుంచి కిందికి జారవిడిచేవాడు. అదే సమయంలో.. బర్మా రంగూన్ లో జరుగుతున్న జపనీస్ దాడుల నుంచి ఎందరో బ్రిటీషర్స్ ఫ్యామిలీస్ ను రెస్క్యూ చేసి కాపాడారు. అలాగే.. నాడు ఉద్యమంలో ప్రముఖ నేతలైన రామ్ మనోహర్ లోహియా, జై ప్రకాశ్ నారాయణ్, అరుణా అసఫ్ అలీ లాంటి నేతలను బ్రిటిషర్ల కళ్లుగప్పి వేర్వేరు ప్రాంతాలకు తరలించాడు. పైలెట్‌గా ఉంటూ ఈ పనులు చేస్తున్నాడనే ఆరోపణతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1943 జనవరిలో అరెస్టు చేసి రెండేళ్లు జైలులో పెట్టింది. జైలులో ఉండగా దేశవిముక్తికి మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు.

ఆ తర్వాత కళింగ ట్యూబ్స్ పేరుతో ఆసియాలోనే అతి పెద్ద పైపుల తయారీ కేంద్రం వ్యవస్థాపకుడిగానే గాక కళింగ ఎయిర్ లైన్స్‌ యజమానిగానూ బిజూ బాగా రాణించారు. తర్వాతి రోజుల్లో 1944లో జర్మనీపై సోవియట్ యూనియన్ సేనలు పోరాడ లేని స్థితిలో ఉన్నప్పుడు.. తన డకోటా ఎయిర్ క్రాఫ్ట్‌లో వెళ్లి.. హిట్లర్ బలగాలపై బాంబుల వర్షం కురిపించి వారిని చెదరగొట్టి.. ఆ ప్రాంతంలో రష్యా బలం పెరిగేందుకు దోహదపడ్డారు. నాటి ఆయన సేవలను గుర్తించిన సోవియట్ యూనియన్ ప్రభుత్వం తర్వాతి రోజుల్లో తమ దేశపు అత్యున్నర పౌర పురస్కారంతో బిజూను గౌరవించింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన నెలనాళ్లకే పాకిస్థాన్ సేనలు.. కశ్మీర్ మీద దండయాత్ర చేశాయి. మళ్లీ బిజూ ప పైలట్ అవతారం ఎత్తి.. సేనల తరలింపు, సామాన్య పౌరులను సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి వెనక్కి తీసుకువచ్చారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అధికారికంగా లొంగిపోయిన తర్వాత.. ఆగ్నేయాసియాలో తాము పాలిస్తున్న దేశాల నుంచి పోర్చుగీసు (డచ్) పాలకులు వైదొలగటంతో ఇండోనేషియా 1945, ఆగస్ట్ 17న స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది. కానీ.. ఆ దేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వటానికి నాటి విదేశీ పాలకులు నిరాకరించారు. దీనిని నాటి భారత ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతర్జాతీయ నేతలతో ఈ అన్యాయం గురించి నెహ్రూ మాట్లాడి.. ఇండోనేసియాకు తన మద్దతు ప్రకటించారు.

దీంతో ఇండోనేసియా స్వాతంత్ర్యం కోసం అక్కడి నేతలు సుకర్ణో, జహ్రీర్, మహమ్మద్ హుట్టా వంటి నేతలను నాటి డచ్ పాలకులు గృహనిర్బంధం చేశారు. దీంతో 1947 జులై 21న ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్ణో.. ఆ దేశ మాజీ ప్రధాని సహ్రీర్‌ను ఎలాగైనా సరే దేశం నుంచి తప్పించుకొని వెళ్లి.. భారత్‌లో జరుగుతున్న తొలి ఇంటర్-ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఆదేశించారు. పోర్చుగీస్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టాలని సూచించారు. కానీ డచ్ సేనలు ఇండోనేసియా సముద్ర, వాయు మార్గాలను తమ నియంత్రణలోకి తీసుకున్నాయి.

ఆ సమయంలో నెహ్రూ అభ్యర్థన మేరకు తన భార్య జ్ఞానాదేవి(ఆమె కూడా పైలట్)తో కలిసి డచ్ గగనతల నిఘాను కూడా తప్పించుకుని జకార్తా చేరారు. తమ గగనతలంలోకి విమానాన్ని కూల్చేస్తామన్న డచ్ పాలకుల హెచ్చరికలను సవాలు చేస్తూ.. అదే జరిగితే.. భారత గగనతలంలో ఎగిరే ప్రతీ డచ్ విమానాన్ని తామూ కూల్చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు బిజూ. జకార్తా సమీపంలోని ఓ ఎయిర్‌స్ట్రిప్ మీద విమానాన్ని దించి, జపాన్ మిలిటరీ డంపుల్లో పడి ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని వాడుకొని సుకర్ణో వంటి నేతలను సింగపూర్ మీదుగా ఢిల్లీ సదస్సుకు తీసుకొచ్చారు. అలా ఇండోనేసియా నుంచి డచ్ పాలకులు వెళ్లిపోవటంలో బిజూ కీలకపాత్ర పోషించారు. 1953లో కళింగ ఎయిర్ లైన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో విలీనమైంది. ఇండియా-టిబెట్ మధ్య ఎయిర్ లింక్స్ పునరుద్ధరించడంలోనూ బిజూది కీలకపాత్ర. అప్పటికే చైనా దురాక్రమణలతో సతమతమవుతున్న టిబెటన్ ఫైటర్స్ కూ బిజూ పట్నాయక్ సాయమందించారు.

తర్వాత నార్త్ కటక్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఎంపీగా సేవలందించారు. 45 ఏళ్ల వయసులో 1961లో తొలిసారి, 1990 – 1995 కాలంలో ఒడిసా సీఎంగా పనిచేశారు. కేంద్రంలో ఉక్కు మరియు గనుల శాఖ మంత్రిగానూ పని చేశారు. యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు..రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చేశారు. పారాదీప్ పోర్టు ఏర్పాటుకు, నాల్కో కంపెనీ ఏర్పాటుకు చొరవ చూపారు. మహిళలు, దళితులు, గిరిజనుల అభివృద్ధి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి తన కళింగ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్‌ ఆటకు ప్రాచుర్యం కల్పించటానికి కళింగ ఫుట్ బాల్ క్లబ్‌ను ప్రారంభించారు.

ఇండోనేసియా ప్రభుత్వం ఆయనకు గౌరవ పౌరసత్వం ఇవ్వడంతోపాటు.. విదేశీయులకు అరుదుగా ఇచ్చే ‘భూమి పుత్ర’ అవార్డును అందించింది. 1995లో తమ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బిజూ పట్నాయక్‌కు తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘బిన్‌టంగ్ జసా ఉటామా’ను ప్రకటించింది. అంతేగాకుండా.. ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయంలో.. బిజూ మెమరీస్ పేరుతో ఓ ప్రత్యేక గదినే కేటాయించింది. అలాగే.. హిట్లర్ దాడుల నుంచి తమ సేనలను కాపాడటంతో నాడు బిజూ అందించిన సేవలను రెండవ ప్రపంచం ముగిసిన 50 ఏళ్ల వేడుకల్లో రష్యా సైతం స్మరించుకుంది.

నాటి ఇండోనేసియా అధ్యక్షుడైన సుకర్ణోతో బిజూ పట్నాయక్‌కు ప్రత్యేక అనుబంధం ఉండేది. తనకు ఆడపిల్ల పుట్టిందని సుకర్ణో.. బిజూ పట్నాయక్‌కు ఫోన్ చేసి చెప్పారట. ఆ సమయంలో బిజూ విమానం నడుపుతున్నారట. ‘నేనిప్పుడు మేఘాల్లో ఉన్నాను కనుక.. మీ అమ్మాయికి మేఘావతి అని పెట్టు’ అన్నారు. మిత్రుడి మాట మేరకు మేఘావతి సుకర్ణో పుత్రి అనే పేరునే ఆ బాలికకు పెట్టారు. 2001-04 మధ్య కాలంలో ఆమె ఇండోనేసియా అధ్యక్షురాలిగా ఎన్నిక కావటం విశేషం.

ఇందిర హయాంలో ఎమర్జెన్సీ కారణంగా బిజూ పట్నాయక్ కూడా జైలు పాలయ్యారు. జీవితాంతం దేశం కోసం తపించిన ఈ మహానేత.. 1997 ఏప్రిల్ 17న ఆయన పరమపదించారు. ఈయన పార్థివ దేహం మీద భారత్‌తోపాటు, రష్యా, ఇండోనేసియా జెండాలను ఉంచారు. ఈ అరుదైన గౌరవం పొందిన ఏకైక భారతీయుడు బిజూ పట్నాయక్ మాత్రమే.

బిజూ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి కుమార్తె గీతా మెహ్రా గొప్ప ఆంగ్ల రచయిత. వీరి పెద్ద కుమారుడు ప్రేమ్ పట్నాయక్ ఢిల్లీలో పారిశ్రామికవేత్త కాగా.. వీరి రెండవ కుమారుడైన నవీన్ పట్నాయక్ ప్రస్తుతం వరుసగా 5వ సారి ఒడిసా సీఎంగా ఉన్నారు. ఈయన కూడా గొప్ప కవిగా గుర్తింపు పొందారు.
పావలా పనిచేసి పాతిక రూపాయలు ప్రచారం కోరుకునే నేతలున్న ఈ కాలంలో.. ఏ ప్రచారాన్ని, గుర్తింపును ఆశించక, అత్యంత నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగించిన నేతగా బిజూ పట్నాయక్ నేటికీ ఒడిసా ప్రజల మనసులో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారంటే ఆశ్చర్యం లేదు.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×