EPAPER

Bengaluru Water Crisis: బెంగుళూరు ఖాళీ అయిపోతుందా?.. నీటి సమస్య ఎప్పటివరకంటే..?

Bengaluru Water Crisis: బెంగుళూరు ఖాళీ అయిపోతుందా?.. నీటి సమస్య ఎప్పటివరకంటే..?
Bengaluru Water Crisis
Bengaluru Water Crisis

Bengaluru Water Crisis: కృష్ణ జిల్లాకు చెందిన వెంకటపతి రాజు, గత 12 సంవత్సరాలుగా బెంగుళూరులో నివసిస్తున్నారు. 2011లో వెంకటపతి ఒక స్టార్ట్ అప్ లో ఉద్యోగం పొందారు. ఆ స్టార్ట్ అప్ లో విజయం సాధించి యూనికార్న్ గా ఎదిగింది. కంపెనీ ఎదుగుదలతోపాటు వెంకటపతి కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. బెంగుళూరు లోని మంచి పాష్ ఏరియాలో 4 BHK ప్లాట్ లో కుటుంబంతో సహా స్థిరపడ్డారు. ఆయన నివసించే కమ్యూనిటీ కూడా హై ఎండ్ కమ్యూనిటీ. ఆయన రోజు ఆఫీసు వెళ్లాలంటే కారులో 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ హెవీ ట్రాఫిక్ వల్ల ఆయన రోజు తొందరగా బయలుదేరాలి. అందుకే ప్రతి రోజు లాగే ఉదయాన్నే లేచి.. బాత్ రూం వెళ్లారు. కానీ పాపం.. బాత్ రూంలో నీళ్లు లేవు. పోనీ పక్కింట్లో ఓ బకెట్ తీసుకుందామని పోతే.. బిల్డింగ్ లో అసలు నీళ్లు లేవని.. ట్యాంక్ ఖాళీ అని తెలిసింది. ఇక ఆ రోజు స్నానం చేయకుండానే ఆఫీసుకు బయలుదేరితే తెలిసింది.


బెంగుళూరులో ట్రాఫిక్ కంటే పెద్ద సమస్య ఒకటి వచ్చిందని.. అదే బెంగుళూరు సిటీలో నీటి కొరత. ఈ సమస్య వారం క్రితం మొదలైంది. ఇప్పుడు వారం రోజుల తరువాత ఈ సమస్య ఇంకా తీవ్రంగా మారింది. సిటీలోని ఇళ్లకు నీటి సరఫరా ఆగిపోయింది. కేవలం రాత్రి పూట రెండు గంటలపాటు నీళ్లు వస్తున్నాయి. అవి కూడా పూర్తిగా మట్టి నీళ్లు. ఆ నీళ్లను తాగడం కాదు కదా.. స్నానం చేయడానికి కూడా ఉపయోగించలేం.

వెంకటపతి నివసించే అపార్ట మెంట్ కమ్యూనిటీ వాళ్లు తినేందుకు, తాగేందుకు డిస్పోజబుల్ గ్లాస్, ప్లేట్స్ ఉపయోగించాలని నిర్ణయించారు. చాలామంది ఇంట్లో నీళ్లు లేకపోవడంతో జిమ్ కు కెళ్లి స్నానం చేస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. టాయిలెట్ కోసం ఇంట్లో నీళ్లు లేక వెంకటపతి దెగ్గరలో ఉన్న ఫోరమ్ మాల్ లో టాయిలెట్ వెళుతున్నారు. వెంకటపతి లాంటి వాళ్లు చాలా మంది లక్షల జీతం పొందుతున్నా.. ఇప్పుడు సామాన్య జనంలాగా వాటర్ ట్యాంకర్ ముందు లైన్ లో నిలబడుతున్నారు.


కర్ణాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఇళ్లకు కూడా నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. ఇక మీరే ఊహించండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో కూడా నీళ్ల కోసం ట్యాంకర్ తెప్పిస్తున్నారంటే.. ఆ రాష్ట్రంలో పేదవాళ్లు నీటి కోసం ఎంత కష్టపడుతున్నారో!

ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ సిటీగా పేరుపొందిన బెంగుళూరు ఈ రోజు నీటి చుక్క కోసం ఎందుకు విలవిల లాడుతుందో చర్చిద్దాం.

బెంగుళూరు.. ఈ పేరు వినగానే మన మైండ్ లో ఏం కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తున్న బిల్డింగ్స్. సాయంత్రమవుతూనే కళకళ లాడే రోడ్లు. టాప్ ఇన్ఫాస్ట్రెక్ష్చర్. ఐటీ కంపెనీలు స్థాపించడానికి అందరి పేవరెట్ సిటీ. కూల్ వాతావరణం. మంచి ఎయిర్ క్వాలిటీ. ఎక్కువ స్టార్ట్ అప్స్ ఉండడంతో బెంగుళూరుని అమెరికా సిలికాన్ సిటీతో అందరూ పోలుస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రోత్ అండ్ డెవలెప్ మెంట్ విషయంలో బెంగుళూరు టాప్ సిటీ.

కానీ ప్రస్తుతం బెంగుళూరు నగరం నిత్యావసరమైన నీరు లేక ఎండిపోతోంది. బెంగూళూరు నగరంలో టోటల్ పాపులేషన్ 1.45 కోట్లు. ప్రతి రోజు సిటీ అవసరాల కోసం 270 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఇందులో దాదాపు 170 కోట్ల లీటర్ల నీరు కావెరీ నది జలాల నుంచి వస్తుంది. మిగతా నీటి అవసరాల కోసం సిటీ ప్రజలు బోర్ వెల్స్ పై ఆధారపడి ఉన్నారు.

అయితే ప్రతి రోజు కావాల్సిన 270 కోట్ల లీటర్ నీళ్లకు బదులు 110 కోట్ల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బోర్ వెల్స్ లో నీళ్లు లేకపోవడం. బెంగుళూరులోని మొత్తం 14700 బోర్ వెల్స్ లో
6697 బోర్ వెల్స్ ఎండిపోయాయి. బెంగుళూరులోని మొత్తం 236 తాలుకాలుండగా.. 223 తాలుకాలలో నీళ్లు లేవు. ఈ గణాంకాలు చూస్తుంటేనే తెలుస్తోంది.. సమస్య చాలా పెద్దదని.

బెంగుళూరు లాంటి కోట్లు కురిపించే నగరంలో ఇంత పెద్ద వాటర్ సార్టేజ్ ఎలా మొదలైంది? దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
1. తగినంత వర్షాలు కురవకపోవడం
2. భూగర్భ జలాలు ఎండిపోవడం.. లేదా తగ్గిపోవడం
3. అన్ ప్లానెడ్ నిర్మాణాలు

ఒకసారి ఈ మూడు కారణాలు గమనిస్తే.. మొదటి రెండు ఒకదానికి మరొకటి రిలేటెడ్ గా కనిపిస్తాయి. అంటే వర్షాలు కురిస్తే.. ఆ వర్షపు నీళ్లు మట్టిలో ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా తక్కువ వర్షాలు కురవడంతో భూ గర్భ జలాలు కూడా తగ్గిపోయాయి.

పైగా బెంగుళూరు నగరం సముద్ర మట్టం కంటే 920 మీటర్ల ఎత్తులో ఉండడంతో ఈ సమస్య తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు. నగరం అంత ఎత్తులో ఉండడం, వర్షాలు లేక భూగర్భజలాలు మరింత కిందకు తగ్గిపోవడంతో ఒక్కసారిగా నీటి కొరత ఏర్పడింది.

ఇక మూడో కారణం అన్ ప్లానెడ్ నిర్మాణాలు. అంటే నగరంలో ప్లానింగ్ లేకుండా బిల్డింగ్స్ కట్టేయడం. గత రెండు దశాబ్దాలుగా బెంగుళూరు చుట్టూ ఉన్న చాలా చెరువులు పూడ్చేసి.. అక్కడ బిల్డింగ్స్ కట్టేశారు. దీంతో సిటీ చుట్టూ ఉన్న జలాశయాల సంఖ్య భారీగా పడిపోయింది. వేగంగా సిటీ సరిహద్దులు వ్యాపించే క్రమంలో గవర్నమెంట్, బిల్డర్స్ పెరుగుతున్న జనాభా నీటి అవసరాలను నిర్లక్ష్యం చేశాయి. అందుకే ప్రకృతి ప్రకోపాన్ని ఈ రోజు బెంగుళూరు ప్రజలు ఎదుర్కొంటున్నారు.

డేటా ప్రకారం.. చూస్తే.. 2011-2021 మధ్య కాలంటో బెంగుళూరు జనాభా ఏకంగా 47 శాతం పెరిగింది. 2010 వరకు బెంగుళూరు జనాభా 80 లక్షల కంటే తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు నగరంలో కోటి 40 లక్షలకు పైగా జనాభా ఉంది. ఈ పెరిగిన జనాభా నివసించడానికి పెద్ద పెద్ద buildings నిర్మించారు. ఇప్పుడా ఆ బిల్డింగ్స్ చుట్టూనే ప్రధానంగా నీటి కొరత ఎక్కువగా ఉంది. వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు ఎక్కువ శాతం ఇప్పుడు డ్రైనేజ్ లో వెళ్లిపోతోంది. ఇంతకుముందు ఆ నీరు మట్టిలో చేరి భూమిలోపల నిలువ ఉండేది. దీని వల్ల చుట్టూ ఉన్న చెరువుల్లో కూడా నీళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు కాంక్రీట్ కట్టడాలతో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు.

2007 -2024 మధ్య బెంగుళూరులో మొత్తం 110 గ్రామాలు విలీనం అయ్యాయి. ఈ గ్రామాలన్నింటికీ నీటి ఆధారం.. భూగర్భజలాలే. కానీ గత 20 సంవత్సరాలుగా బెంగుళూరు చుట్టూ ఉన్న అడవులు, చెట్లు ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం మాయమైపోయింది. ఆ ప్రదేశాల్లో పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. 1970లో బెంగుళూరు సిటీ చుట్టూ 68 శాతం ఉన్న గ్రీన్ కవర్ అంటే చెట్లు.. 2023 వచ్చేసరికి 4 శాతం కంటే తక్కువ ఉంది. 1961లో నగరంలో మొత్తం 261 చెరువులుంటే.. ఇప్పుడు 81 చెరువులున్నాయి. వాటిలో కూడా కేవలం 30 చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. చాలా చెరువులు చెత్తతో నిండిపోయి ఉన్నాయి. పైగా వర్షాలు తగ్గిపోవడంతో కావేరి నదిలో వాటర్ లెవెల్ కూడా భారీగా తగ్గిపోయింది. బెంగుళూరు నగరానికి కావేరి నది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గత 40 సంవత్సరాల్లో నగరం చుట్టూ ఉన్న 88 శాతం అడవులు, 79 శాతం జల వనరులు తగ్గిపోయాయి. పైగా ఈ సమస్యను ఇంత కాలంగా గత ప్రభుత్వాలు కానీ, పర్యావరణ వేత్తలు కానీ సీరియస్ గా తీసుకోలేదు. మూడు నెలల క్రితమే బోర్ వెల్స్ లో నీళ్లు లేవు. అయినా అప్రమత్తం కానీ బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్.

నీటి వనరులను కాపాడడం, వర్షపు నీటిని నిలువ చేయడం కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు. ఇది ప్రతి మనిషి బాధ్యత. బెంగుళూరు లాంటి మెట్రో నగరాల్లో అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ స్టోరేజ్ అనే పద్ధతులు ఎవరూ పాటించక పోవడం ఒక సీరియస్ అంశం.

మరి విషయం ఇంత సీరియస్ గా మారడంతో బెంగుళూరు ప్రజలు నగరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ సమస్యను త్వరగా పరిష్కిరించకపోతే ఆ పరిస్థితులు కూడా రావొచ్చు. దీని కోసం ప్రభుత్వం కూడా సీరియస్ గా చర్యలు తీసుకుంటోంది.

మనమంతా కరోనా లాక్ డౌన్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ చూశాం. ఇప్పుడు బెంగుళూరులో వాటర్ ట్యాంకర్స్ బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. సాధారణ సమయంలో 600 రూపాయలున్న ఒక వాటర్ ట్యాంకర్ ధర ఇప్పుడు ఏకంగా రూ.2000 వరకు చేరింది. ఈ బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి డిప్యూటీ సిఎం శివకుమార్ చర్యలు తీసుకుంటున్నారు. బెంగుళూరుమున్సిపల్ కార్పొరేషన్లో వారం రోజుల క్రితం ఆయన అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. వాటర్ ట్యాంకర్లన్నింటికీ వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లో రిజిస్టర్ చేయాలని చెప్పారు. బెంగుళూరులో మొత్తం 3500 వాటర్ ట్యాంకర్లుండగా.. ఇప్పటివరకు కేవలం 220 ట్యాంకర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి.

తాగునీరుని జాగ్రత్తగా వినియోగించాలని ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాగునీటితో స్నానాలు చేయడం, కార్ వాష్ చేయడం వంటివి చేస్తే 5000 రూపాయలు ఫైన్ విధిస్తున్నారు.

కర్ణాటక ప్రభుత్వం ప్రజల నీటి సమస్యను తీర్చడానికి నీటి సమస్య లేని ప్రాంతాలను గుర్తించి.. అక్కడి నుంచి వేగంగా నీటి కొరత ఉన్న చోటికి తరలిస్తోంది. వీలైనంత వరకు ప్రజలకు అతి తక్కువ ధరకు తాగునీరు అందేలా ప్రయత్నిస్తోంది. అయినా సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. ఈ రోజు వారి నీటి అవసరాలు తీరడంలేదు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని మోనిటర్ చేస్తున్నారు. నీటి ట్యాంకర్లు సరిపోకపోవడంతో వినియోగంలో లేని పాల ట్యాంకర్లను ఉపయోగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఈ నీటి సమస్యను తీర్చడానికి కర్ణాటక ప్రభుత్వం యుద్ద ప్రతిపాదికన 556 కోట్ల రూపాయలు విడుదల చేసింది. బెంగుళూరు లోని నియోజకవర్గాల్లో నీటి కొరత సమస్యను తీర్చేందుకు ప్రతి MLAకి 10 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనికి తోడు.. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ 148 కోట్లు, బెంగుళూరు వాటర్ బోర్డు 128 కోట్లు కేటాయించాయి.

ఇక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మార్చి 4న వృశభావతి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ (Vrishabhavati Lift Irrigation Project)కు శంకు స్థాపన చేశారు. రూ.5240 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ ద్వారా బెంగుళూరు నగరం చుట్టూ 70 చెరువుల్లో నీరు నింపి వాటి ద్వారా భూగర్భజలాలను మళ్లీ పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే బెంగుళూరు నీటి సమస్య శాశ్వతంగా తీరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదంతా జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

మరోవైపు ఈ సంవత్సరంలో కూడా వర్షాలు తక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ నివేదిక ద్వారా తెలిసింది. పైగా ఎండాకాలంలో నీటీ సమస్య మామూలుగా ఉండదు. SO ఈ సంవత్సరం వర్షాలు పడేవరకు బెంగుళూరులో నీటి కష్టాలు తప్పవు. అంతవరకు ఈ వాటర్ స్టోరేజ్ సమస్యలు తీరిపోతాయని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది.

Also Read: Telangana Politics: శ్రీమంతులే బీజేపీ టార్గెట్.. ప్రజా నేతలు కాంగ్రెస్ వైపు చూపు..

ఇక చివర్లో మన అందరికీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. అదే ఈ నయా జమానాలో అభివృద్ది సాధించడానికి మనుషులు చెల్లిస్తున్నమూల్యం ఏమిటి? Hi Fi నగరాలు నిర్మించడానికి అడువులను, పచ్చని చెట్లను నరికివేయడం కరెక్ట్ నా. అలా ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే.. ఈ అభివృద్ధికి మనుగడ ఉంటుందా?

అయినా ఈ ప్రశ్న.. మనమందరం కష్టాలు పీకల మీదకు వచ్చినప్పుడే ఎందుకు లేవనెత్తుతాం. బెంగుళూరులో పెద్ద కొరత వచ్చినప్పుడో లేకపోతే కేదార్ నాథ్ లో వరదలు వచ్చినప్పుడు మాత్రమే అందరికీ ప్రకృతి గురించి గుర్తుస్తొంది. అంతుకు ముందే దీని గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరు? దీనికి సమాధానం ఒకటే.. అభివృద్ధి సాధించడానికి లేక ధనం సంపాదించడానికి స్వార్థంతో మనిషి కళ్లు మూసుకుపోవడం. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇప్పుడు బెంగుళూరు కష్టాలు చూసి దేశంలోని మిగతా నగరాలు జాగ్రత్త పడాలని ఆశిద్దాం.

Tags

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×