YS Jagan: అసలే ఘోర పరాభవంతో కుంగిపోయిన వైసీపీలో.. వర్గ విభేదాలు కూడా భగ్గుమంటుండడం పార్టీ అధినేత వైఎస్ జగన్ కి కునుకు లేకుండా చేస్తున్నాయి. విజయవాడలో ఫ్యాన్ పార్టీకి కీలకంగా ఉన్న ఆ ముగ్గురు నాయకుల మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా చర్చ జరుగుతోంది. నాయకుల మధ్య సమన్వయం లేక ఎవరికి వారే.. యమునా తీరుగా వ్యవహరిస్తున్నారని.. అనుకుంటున్నారు. అధికారం కోల్పోవడమే కాకుండా నేతలంతా వరుసగా వలస బాట పడుతున్న తరుణంలో.. రాజధాని ప్రాంతంలో వైసీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయని పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నువ్వా నేనా అంటూ వ్యవహరిస్తున్న ఆ నేతలు ఎవరు ? అసలు బెజవాడ వైసీపీలో ఏం జరుగుతుంది?
వైసీపీకి ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని ఘోర పరాజయం
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో అద్భుత విజయం సాధించి.. దేశం మొత్తం తమ వైపు చూసేలా చేసుకుంది వైసీపీ. గత ఎన్నికల్లో మాత్రం ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దారుణ ఓటమితో కుంగిపోతున్న ఫ్యాన్ పార్టీకి.. నేతల వలసలకు రెక్కలు విరిగిపోతున్నాయి. కొంతమంది శాశ్వతంగా గుడ్‌బై చెబుతుంటే.. ఇంకొంతమంది వైసీపీకి భవిష్యత్ లేదని ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. వైసీపీ నేతలంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటు సీనియర్లు కూడా సైలెంట్ అయిపోవడంతో.. అసలు వైసీపీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా తయారైంది.
ఓటమి నుంచి కోలుకుంటూ అప్పుడప్పుడు జనంలోకి జగన్
ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటూ అప్పుడప్పుడు జగన్ జనంలో కనిపిస్తున్నారు. అయినా కానీ పలువురు నేతలు ఇంకా తీరు మార్చుకోలేదని అనుకుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకుండా.. ఆధిపత్య పోరు కోసం ప్రయత్నాలు చేస్తుండడం పార్టీకి మైనస్ గా మారుతుందట. రాజధాని ప్రాంతమైన విజయవాడలో నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమనడం పొలిటికల్ గా హీట్ రాజేస్తోంది. పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్.. తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ మధ్య కోల్డ్ వార్
మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్,సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి తమదైన శైలిలో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారట. కానీ దేవినేని అవినాష్ మాత్రం నా రూటే సపరేటు అనేట్టుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారట. దీంతోనే రాజకీయంగా ఎవరు ఎత్తుగడలు వాళ్లు వేస్తున్నారా అనే అనుమానాలు వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయట. రీసెంట్ గా జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సైతం నాయకుల మధ్య సమన్వయ లోపం బయట పడిందని అంటున్నారు. వెల్లంపల్లి తన కార్యాలయంలో జయంతి వేడుకలు చేయగా.. ఆయనతో పాటు మల్లాది విష్ణు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాత్రం సపరేట్ గా తన కార్యాలయంలో పొట్టి శ్రీరాములుకి నివాళి అర్పించారట.
Also Read: టీటీడీ బోర్డు సభ్యుల లిస్ట్ మారనుందా? కొత్తగా ఛాన్స్ కొట్టేది ఎవరు?
కార్యక్రమాలు సపరేట్ గా చేయడం పట్ల నేతల అయోమయం
ఒకవైపు వెల్లంపల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే.. ఇంకో వైపు దేవినేని అవినాష్ కూడా మరో కార్యక్రమం నిర్వహించడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని అనుకుంటున్నారు. మరోవైపు కూటమిగా ఉన్న ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసి సమన్వయంతో పని చేస్తుంటే.. ఒక పార్టీలోని నేతలే ఎవరి సొంత కుంపటి వారు పెట్టడం ఎంతనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించక ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని నేతలంతా గాబరా పడుతున్నారట.
చిన్న రగడలే చిలికి చిలికి గాలి వానగా మారతాయని చర్చ
వైసీపీకి ఇప్పటికే ముఖ్య నేతలు గుడ్ బాయ్ చెప్తున్న తరుణంలో.. రాజధాని లాంటి ప్రాంతంలో కీలకంగా ఉన్న నేతలు.. ఈ తరహా వ్యవహార శైలితో ఉండడం వైసీపీ నేతలను కలవర పెడుతుందట. ఇలాంటి రగడలే చిలికి చిలికి గాలి వానగా మారి.. పార్టీ క్యాడర్ ని పై దెబ్బ పడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అధికారం కోల్పోయి ఏడాది కూడా కాక ముందే ఇలా ఉంటే భవిష్యత్తులో పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుందట.
భవిష్యత్తులో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందా ?
పార్టీ డ్యామేజ్ అవుతున్నా.. వైసీపీ అధినేత జగన్ మాత్రం నోరు మెదపక పోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురి చేస్తోందట. కనీసం నేతలను పిలిచి ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషణ చేసి.. చక్కదిద్దే చర్యలు తీసుకోకపోతే.. రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారట.