EPAPER

CM’s Meeting : మీటింగ్ డే.. సమస్యలు కొలిక్కి వస్తాయా?

CM’s Meeting : మీటింగ్ డే.. సమస్యలు కొలిక్కి వస్తాయా?
  • నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
  • ప్రజా భవన్ వేదికగా చర్చలు
  • విభజన సమస్యలే ప్రధాన ఎజెండా
  • షెడ్యూల్ 9, 10 అంశాలే కీలకం
  • రూ.లక్షన్నర కోట్ల ఆస్తుల పంపకంపై చర్చ
  • సీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి
  • ఇరు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు కూడా హాజరు

రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలను ఓ కొలిక్కి తెచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు సమావేశమవుతున్నారు. ప్రజాభవన్ వేదికగా శనివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తయిన వేళ, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన సందర్భంలో విభజన తాలూకా పెండింగ్ అంశాలపై జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులూ హాజరు కానున్నట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా తొలిసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల మీదా ఇరు పక్షాల నుంచి అభ్యంతరాలున్నాయి.


రూ. 1.42 లక్షల కోట్ల ఆస్తులు..

విభజన చట్టంలోని ఆస్తులు, అప్పులు, సంస్థల పంపకాల్లో కొన్నింటిపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం గత పదేళ్ల కాలంలో తెగని పంచాయితీగా మారాయి. వీటిలో విద్యుత్తు సంస్థల బకాయిలు ప్రధానమైనది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉండగా, రూ.7 వేల కోట్లు తెలంగాణ నుంచి తమకు రావాలని ఏపీ వాదిస్తోంది. షెడ్యూల్‌ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడీ కమిటీ వేయగా, అందులో 68 సంస్థల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరినా, 23 సంస్థల పంపిణీ పీటముడి పడింది.

ఇక.. 10వ షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్‌ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. అలాగే.. విభజన చట్టంలోని సెక్షన్‌ 64 ప్రకారం ఉమ్మడి సంస్థల ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా 58:42 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుండగా, తెలంగాణ అందుకు అంగీకరించలేదు. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలతో పాటు ఏ షెడ్యూల్‌లో చేర్చని 12 ఉమ్మడి సంస్థల పంపకమూ నాటినుంచి పెండింగ్‌లోనే ఉంది. 9,10 షెడ్యూలులోని, ఏ జాబితాలో లేని ఉమ్మడి సంస్థలు 245 కాగా, వీటి మొత్తం ఫిక్స్‌డ్‌ ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లకు పైమాటే. ఈ కీలక అంశాలపై ఈ పదేళ్లలో 30కి పైగా సమావేశాలు జరిగినా.. వీటి పంపకం మాత్రం జరగలేదు.


Also Read : ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

సీఎంల చొరవ

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా అధికారం చేపట్టటంతో ఈ విభజన అంశాలపై వీరిద్దరూ ఒక సానుకూల పరిష్కారం చూపగలరనే అభిప్రాయం రెండు రాష్ట్రాలవైపు నుంచీ వ్యక్తమైంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్చి నెలలో తీసుకున్న చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా రేవంత్ చొరవతో వీడిపోయింది. దీనికి కొనసాగింపుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ సమస్యలను పరిష్కరించుకుందామంటూ ఇటీవల ఒక లేఖను తెలంగాణ సీఎంకు రాయటం, దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో నేటి భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటూనే విభజన సమస్యలు పరిష్కరించుకుంటామని శుక్రవారం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

కీలక అంశాలు

నేటి సమావేశంలో చర్చకు రానున్న ఇతర అంశాల్లో కృష్ణా జలాల పంపిణీపై ఏకాభిప్రాయం, జలజగడాలపై వేర్వేరు కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం వంటివీ చర్చకు వచ్చే అవకాశముంది. ఏది ఏమైనా, వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఇద్దరు సీఎంలు.. ఈభేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రేవంత్.. జాగ్రత్త

ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ తెలంగాణ ముఖ్యమంత్రికి కత్తి మీద సాములాంటిదని అభివర్ణించారు. ఈ చర్చల విషయంలో తేడావస్తే.. రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా ప్రచారం చేసేందుకు ప్రత్యర్థులు రెడీగా ఉన్నారని కామెంట్ చేశారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అవిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు జటిలం కాకముందే పరిష్కరించుకుంటే విభజన కాలపు గాయాలు.. మాసిపోతాయని, రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయని పేర్కొన్నారు.

Related News

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

Balineni vs Prakasam Riyaz: బాలినేని మైండ్ గేమ్.. షాక్ ఇస్తున్న శిష్యుడు

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

Kakatiya University: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌ సస్పెండ్!

Big Stories

×