Big Stories

TDP vs Janasena : టీడీపీ+జనసేన పొత్తు!?.. మరి, సీఎం ఎవరు?

TDP vs Janasena : బలమైన జగన్ కు చెక్ పెట్టేందుకు టీడీపీ, జనసేనలు జట్టు కడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్, చంద్రబాబుల భేటీతో.. ఇక పొత్తు ఖాయమనే మెసేజ్ వెళ్లిపోయింది. అవసరమైతే చూస్తాం.. అన్నట్టు టీడీపీ ధోరణి ఉంటే.. ప్రస్తుత మీటింగ్ జస్ట్ ఫార్మాలిటీగానేనని జనసేనాని అన్నారు. అయితే, ఈసారి ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమని పవన్ పదే పదే చెబుతుండటం.. టీడీపీ, జనసేనల మైత్రికి బలం చేకూర్చుతోంది. లేటెస్ట్ విశాఖ ఎపిసోడ్.. ఆ రెండు పార్టీలను మరింత దగ్గరికి చేర్చింది. అయితే, పొత్తుకు ఒక్కటే ప్రధాన అడ్డంకి అంటున్నారు. రెండు పార్టీలు పక్కా వైసీపీ వ్యతిరేకమే. ఇద్దరు నాయకులు జగన్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నవారే. అయినా, ఫ్రెండ్ షిప్ కుదరకపోవడానికి కారణం…. సీఎం సీటు.

- Advertisement -

అవును, సీఎం కుర్చీ విషయంలోనే తేడా వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 15 ఏళ్ల సీనియారిటీ. ఈసారి ఎలాగైనా సీఎం అయిపోవాలనేది పవన్ పట్టు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం చాలా కష్టం. సీఎం సీటును చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. జనసేనాని సైతం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. గతంలో చంద్రబాబు పాలనను పవన్ గట్టిగా ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక.. వైసీపీ కంటే టీడీపీనే బెటర్ అనే భావనకు వచ్చేశారు. రెండు పార్టీల కేడర్ సైతం.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కలిసి పని చేసి కొన్నిచోట్ల సక్సెస్ అయ్యాయి. అందుకే, కలిసి పోరాడేందుకు ఇరువురూ సిద్ధంగా ఉన్నా.. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేదే సందిగ్ధం. ఆ కారణంతోనే టీడీపీ, జనసేనల పొత్తుకు అడుగులు ముందుకు పడటం లేదని అంటున్నారు.

- Advertisement -

జగన్ ను ఓడించాల్సిందేననే బలమైన సంకల్పం. విడివిడిగా పోటీ చేస్తే.. ఓట్లు చీలి మళ్లీ వైసీపీనే గెలుస్తుందనే భయం. పొత్తు ఉంటే.. సీట్ల పంపకం నుంచే గొడవ మొదలైపోతుంది. టీడీపీ ఎక్కువ సీట్లు అడుగుతుంది. జనసేనలో ఆశావహులు అధికం. ఇక సీఎం సీటుపై చిక్కుముడి పడటం ఖాయం. జట్టు కట్టి.. గెలిచాక.. పాలనా కాలాన్ని 50-50 పంచుకునే అవకాశం లేకపోలేదు. మొదటి రెండున్నరేళ్లు ఒకరు.. తర్వాతి రెండున్నరేళ్లు ఇంకొకరు సీఎంగా ఉండాలనే ప్రతిపాదన తెర మీదకు రావొచ్చు. అయితే, మొదటి రెండున్నరేళ్లు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే విషయంలో చంద్రబాబు, పవన్ లు పంతానికి పోవచ్చు. ఒకవేళ డీల్ కుదిరినా.. రెండున్నరేళ్ల తర్వాత అధికారం అప్పగిస్తారా? అనే అనుమానం ఉండకపోదు. గతంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య అలానే జరిగి పొత్తు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. అందుకే, టీడీపీ, జనసేనలు.. పొత్తు పెట్టుకోవాలని బలంగా కోరుకుంటున్నా.. ఎమ్మెల్యే స్థానాలు, సీఎం సీటు విషయంలో తిరకాసు తప్పేలా లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News