YSR Family: ఎట్టకేలకు వైఎస్ విజయమ్మ నోరు విప్పారు. తన కుటుంబంలో నెలకొన్న వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టే చర్యలలో భాగంగా విజయమ్మ నోటి మాట బయటకు వచ్చిందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య నెలకొన్న వివాదం ఫుల్ స్టాప్ పడినట్లేనా అన్న చర్చలు ఊపందుకున్నాయి.
గత కొద్దిరోజుల క్రితం దివంగత సీఎం వైఎస్సార్ ఫ్యామిలీకి సంబంధించి ఆస్తుల వివాదం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్ తన ఆస్తులకు సంబంధించి కోర్టు మెట్లెక్కారు. ఆ విషయంపై వైఎస్ షర్మిళ స్పందించి, ఓ లేఖ కూడా జగన్ కు రాశారు. ఇదంతా వారి మధ్య రహస్యంగా సాగగా, హఠాత్తుగా టీడీపీ సోషల్ మీడియా ద్వారా షర్మిళ రాసిన లేఖ బయటకు వచ్చింది. దీనితో అప్పుడు వీరిద్దరి మధ్య సాగుతున్న వివాదం బయటకు రాగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
దీనితో వైసీపీ తరపున పలువురు నేతలు ఈ విషయంపై స్పందించారు. అలాగే వైఎస్ షర్మిళను ఉద్దేశించి విమర్శలు కూడా చేశారు. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించిన షర్మిళ, మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై విమర్శలు చేసే వారు వైసీపీ హయాంలో పదవులు చేపట్టి, ఆర్థికంగా బలోపేతమయ్యారని రివర్స్ అటాక్ చేశారు షర్మిళ. అలాగే ఓ లేఖను కూడా వదిలి అసలు తమ మధ్య ఏమి జరిగిందో మళ్ళీ వివరించారు. అలాగే వైఎస్సార్ అభిమానులు అసలు విషయం తెలుసుకోవాలని కోరారు. ఇలా షర్మిళ రాసిన లేఖపై మాజీ సీఎం జగన్ కూడా స్పందించి మరో లేఖను విడుదల చేశారు.
ఈ వివాదం సాగుతున్న సమయంలోనే, మాజీ మంత్రి బాలినేని ఎంటరయ్యారు. ఆస్తుల వివాదంలో విజయమ్మ జడ్జిగా వ్యవహరించి కుటుంబ సమస్యను పరిష్కరిస్తారని, మిగిలిన నేతల జోక్యం అనవసరం అంటూ మాట్లాడారు. అప్పుడు బాలినేనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించి నేరుగా బాలినేనిపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా జగన్ ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు ఊపందుకున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలా వైసీపీ, విజయమ్మ పేరిట ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ఉన్నది విజయమ్మ సంతకం కాదని కూడా టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది.
Also Read: YSRCP Social Media: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే
చివరకు గతంలో బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పినట్లుగానే విజయమ్మనే రంగంలోకి దిగారు. తాను రాసిన లెటర్ ఫేక్ కాదని, ఆస్తుల వివాదం ఉన్నంత మాత్రాన తాను తల్లి కానా, నాకు జగన్ బిడ్డ కాదా.. షర్మిళకు జగన్ అన్న కాడా అంటూ ఘాటుగానే ట్రోలింగ్ బ్యాచ్ కి క్లాస్ పీకారని చెప్పవచ్చు. అయితే తమ కుటుంబ విషయానికి సంబంధించి త్వరలోనే ఆస్తి వివాదాలకు విజయమ్మ ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లే అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇద్దరు బిడ్డల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు సాగాయని, అందుకే విజయమ్మ వీడియో రిలీజ్ చేశారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.