సీఎం చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోషల్ మీడియా తాజాగా ప్రశంసలు కురిపిస్తోంది. థాంక్యూ చంద్రబాబు అంటూ వైసీపీ శ్రేణులు వరుస పోస్టులు పెడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే బాబుపై వైసీపీ మీడియా ప్రశంసలు కురిపించడానికి ఓ కారణం కూడా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో హంగులతో రుషికొండ ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విలాసవంతంగా ఉండేందుకు, తన సతీమణి కోసమే కొండను తవ్వి మరీ రుషికొండ ప్యాలెస్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.
కానీ ఏపీలో ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆ ప్యాలెన్ ను ఏం చేయాలనే ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నేతలు, కొందరు అధికారులతో కలిసి రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రుషికొండ ప్యాలెస్ ను వరల్డ్ క్లాస్‌లో నిర్మించారని అన్నారు. ఇదే పాయింట్ పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రశంసించారని, జగన్ పనితీరును మెచ్చుకున్నారని థాంక్యూ చెబుతోంది. కానీ చంద్రబాబు స్పీచ్ మొత్తం అందుకు విరుద్దంగానే ఉంది.
ప్యాలెస్ నిర్మాణంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగినా ఎక్కడా ఇలాంటి కాస్ట్లీ ప్యాలెస్ చూడలేదని చెప్పారు. ఎవరూ కలలో కూడా ఊహించనిదని, ఒక వ్యక్తి తన విలాసవంతమైన జీవితం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూసిన తరవాతనే తెలిసిందన్నారు. కేవలం బాత్ టబ్ కోసమే రూ.36 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారని ఇలాంటి షాండియర్లు తాను ఎక్కడా చూడలేదని అన్నారు. ఈ భవనాలు అందరికీ చూపిస్తామని, వీటిని వేటికి వాడుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటివి కట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.