Pawan Kalyan : జనసేనాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నారు. సోమవారం హస్తినలో కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్ తో సమావేశమైయ్యారు. మంగళవారం కూడా మరోసారి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మురళీధరన్ తో భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. మురళీధరన్ నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై మురళీధరన్, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు సమాలోచనలు చేసినట్లు సమాచారం. జనసేనానితోపాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా చర్చల్లో పాల్గొన్నారు.
జనసేనానికి ఏపీ బీజేపీ నేతలకు మధ్య గ్యాప్ ఉంది. కొంత మంది కాషాయ నేతలు జనసేనతోనే కలిసి పోటీ చేస్తామంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి నేతలు జనసేన.. బీజేపీకి సహకరించడం లేదని బహిరంగంగానే విమర్శించారు. ఈ రెండు పార్టీ కలిసి కార్యక్రమాలు చేపట్టన సందర్భాలు లేవు. పేరుకు మిత్రులుగా ఉన్నారు గానీ ఉమ్మడిగా ముందుకు వెళ్లడంలేదు.
టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ ఆలోచిస్తున్నారని ఇటీవల చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒంటరిగా పోటీకి దిగితే వీరమరణం తప్పదని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. తమ గౌరవానికి తగ్గకుండా సీట్లు ఇస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని తేల్చిచెప్పేశారు. ఏడాది వ్యవధిలోనే చంద్రబాబుతో పవన్ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. పొత్తులపై పూర్తి కార్లిటీ ఇవ్వకపోయినా… కలిసే వెళతామనే సంకేతాలు బలంగా పంపించారు.
బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేది లేదంటోంది. దీంతో చంద్రబాబుకు బీజేపీకి మధ్యలో జనసేనాని ఉన్నారు. మరి మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిర్చే బాధ్యత పవన్ తీసుకుంటారా..? ఆ దిశగా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తారా..? ఢిల్లీ పర్యటనతో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?