New Parliament Building Inauguration(Telugu news updates) : పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభమే కాలేదు. అప్పుడే వాకౌట్‌లు మొదలయ్యాయి. వాటిపై టాకౌట్లు కూడా షురూ అయ్యాయి. అసలా భవన ప్రారంభోత్సవం రాజకీయ పార్టీల బలప్రదర్శనకు వేదికగా మారిందా? రాష్ట్రపతి కాకుండా ప్రధాని ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ సూటిగా ప్రశ్నించిన విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. 19 విపక్షాలు ఏకంగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడంపై విపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మోదీకి మద్దతుగా నిలవడంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడ్డాయనే చెప్పాలి. పార్టీలకు అతీతంగా ఏకమై కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిన సమయమంటూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. బహిష్కరించిన విపక్ష పార్టీలు పునరాలోచన చేయాలని సూచించారు. అటు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవానికి మద్దతు ప్రకటించారు. నిజానికి.. అటు వైసీపీ, ఇటు టీడీపీ కేంద్రంలోని NDA ప్రభుత్వంలో భాగస్వాములు కావు. కానీ తమ తమ రాజకీయ అవసరాలతోనే సంపూర్ణ మద్దతు ప్రకటించాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సపోర్టు అవసరం. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల అమలు అనుకున్నట్టు సాగాలంటే నిధులు కావాలి. మొన్ననే కేంద్రం 10 వేల 461 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును విడుదల చేసింది. సామరస్యంగా ఉంటేనే మరింత మేళ్లు జరుగుతాయని భావిస్తున్నారు సీఎం జగన్. తొలినుంచీ కేంద్రానికి సపోర్టుగానే ఉంటున్నారు. అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు.
టీడీపీ విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీని ఢీ కొట్టడానికి బీజేపీని కలుపుకుని పోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే.. విపక్షాలు ఏకమవ్వాలనే ఫార్ములాను తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో మోదీ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వ్యతిరేకించే అవకాశమే లేదు. సో ఎన్టీఆర్ జయంతి వేళ ఒకే వేదికపై కనిపించబోతున్నారు వైసీపీ, టీడీపీ నాయకులు. ఎందుకంటే అదే రోజున పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం. ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని అటు.. టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ మద్దతు పలికాయి. దీంతో ఆ రెండు పార్టీల ఎంపీలు ఆ వేదికపై కనిపించనున్నారు.
ఇక బీఆర్ఎస్ దారేది? ఇప్పటివరకు క్లారిటీ లేదు. గురువారం నిర్ణయం ప్రకటిస్తారు. ఆ డెసిషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. బీజేపీతో వైరం ఉందని చెప్తున్నా.. టైఅప్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి మద్దతు తెలిపితే కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు తప్పవు. ముసుగు తొలిగి పోయిందంటూ ఆ పార్టీ విరుచుకుపడుతుంది. అదే సమయంలో మోదీని వ్యతిరేకిస్తే అప్పుడు విపక్షాల సరసన చేరినట్టు అవుతుంది. దీంతో ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే ఆలోచన కూడా BRS చేస్తుందని చెప్తున్నారు.
Leave a Comment