Big Stories

Viveka Murder Case: అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తాం.. కస్టడీలో ప్రశ్నిస్తాం.. సీబీఐ సంచలనం

Viveka Murder Case: సీబీఐ పట్టు వదలడం లేదు. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేదాకా వదిలేలా లేదు. వివేకా హత్య కేసులో ఆయనది కీ రోల్ అంటోంది. కావాలనే దర్యాప్తునకు సహకరించట్లేదని చెబుతోంది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇలా అయితే కుదరదు.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిందే.. అంటూ హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది సీబీఐ. ఆ కౌంటర్‌లో అవినాష్ పాత్రను ఫిక్స్ చేసేలా పలు కీలక అంశాలు ప్రస్తావించింది.

- Advertisement -

సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారు.. నిజాలు చెప్పట్లేదు.. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు.. అంటోంది సీబీఐ. అవినాష్‌ అనుచరుల వల్ల విచారణకు ఆటంకం కలుగుతోందని.. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. హైకోర్టుకు తెలిపింది. అవినాష్‌కు నేరచరిత్ర ఉందని.. నాలుగు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని.. సాక్షులను ప్రభావితం చేశారని.. వివేకా పీఏ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డిలను ప్రభావితం చేశారని ఆరోపించింది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత ర్యాలీలు జరపటం కూడా సాక్షులను ప్రభావితం చేయడమేనని..
అందుకే అవినాష్‌ను అరెస్టు చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందనేది సీబీఐ వెర్షన్.

- Advertisement -

ఇక, అవినాష్‌రెడ్డి ప్రెస్‌మీట్లు, సెల్ఫీ వీడియోలో లేవనెత్తిన పలు అంశాలకూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సీబీఐ. వివేకా హత్య కేసును ఆయన కూతురు, అల్లుడు, రెండోభార్య, వివేకా రాసిన లేఖల చుట్టూ తిప్పుతున్నారు అవినాష్. అయితే, వారి పాత్రేమీ లేదంటూ సీబీఐ చెబుతోంది. వివేకా హత్యలో సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డికి ప్రమేయంపై ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వివేకా రాసిన లేఖను దాచడంలోనూ దురుద్దేశం కనిపించట్లేదని తెలిపింది.

తాము వచ్చే వరకు లేఖను దాచాలని వివేకా పీఏకు ఆయన అల్లుడు రాజశేఖర్‌ చెప్పారని.. అందుకే అతను కాసేపు ఆ లెటర్‌ను హైడ్ చేశాడని సీబీఐ చెబుతోంది. సునీత, రాజశేఖర్‌ రాగానే ఎస్పీ సమక్షంలో ఆ లేఖను పోలీసులకిచ్చారని.. ముందుగా దాచిపెట్టినందునే ఆ లెటర్‌ను కాపాడగలిగారని అంటోంది. ఇక, షమీమ్‌తో పెళ్లికి వివేకా హత్యకు సంబంధం లేదని తమ విచారణతో తేలిందని సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. కడప ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వాలని వివేకా అడిగారని.. ఒకవేళ తనకు కాకుంటే షర్మిలకు కానీ, విజయమ్మకి కానీ టికెట్‌ ఇవ్వాలని జగన్‌ను కోరారని.. కడప నుంచి పోటీకి షర్మిలను వివేకానందరెడ్డి ఒప్పించారని.. ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తావించింది సీబీఐ.

వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలు చెరిపేయడంలో అవినాష్ ప్రమేయం ఉందని.. హత్యాస్థలిలో ఆధారాలు చెరిపేయడం కుట్రలో భాగమేనని.. సీబీఐ అంటోంది. హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి ఇంటికి సునీల్‌ యాదవ్‌ ఎందుకెళ్లాడో తేల్చాలి.. కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందేమో తెలుసుకోవాలి.. మార్చి 15న అవినాష్‌రెడ్డి ఎక్కడెక్కడున్నారో నిర్ధారించాలి.. నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామన్నారని గంగాధర్‌రెడ్డి చెప్పాడు.. ఇవన్నీ తేల్చాలంటే అవినాష్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. అందుకే, సీబీఐ ప్రస్తావించిన విషయాలు చూస్తుంటే.. ఎంపీ అవినాష్‌కు ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ కూడా పక్కా అనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News