Tirumala News: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే నాగుల చవితి పర్వదినం సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు.
తిరుమలలో నవంబరు 5వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తారు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు.
Also Read: Gold Rate Today: గోల్డ్ కొనేవారికి ఊరట.. స్థిరంగా బంగారం ధరలు
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 నుండి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 74,651 మంది భక్తులు దర్శించుకోగా.. 24,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.14 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.