Tirumala: అంతా శివనామ స్మరణమయం. ఎటు చూసినా శివోహం అనే పవిత్ర మంత్రం జపిస్తున్న వేళ.. ఆ శివయ్య కరుణ కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున శైవక్షేత్రాల బాట పట్టారు. కార్తీక మాసం ఆ గరళకంఠునికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో కార్తీక సోమవారాన్ని ఎంతో పవిత్రమైన రోజుగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో తొలి సోమవారంను పురస్కరించుకొని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఈ సంధర్భంగా తిరుపతిలో గల కపిల తీర్థంలోని పుష్కరిణి వద్దకు సోమవారం తెల్లవారుజామున భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా పుష్కరిణిలో స్నానమాచరించి పుణ్యదీపాలను వెలిగించారు. తెల్లవారజామున 4 గంటల నుండి కపిల తీర్థం ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. స్వామి వారికి పలు అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించగా, భక్తులు తమ కోరికలను విన్నవించుకున్నారు.
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో, భక్తులు సుదూర ప్రాంతలా నుండి ఇక్కడికి తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, కొద్దిసేపు ధ్యానముద్రలో స్వామి వారిని ఆరాధించారు. పూజలకు హాజరైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అలాగే కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే తొలి కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు భక్తులు చేరుకున్నారు.
Also Read: Horoscope Nov 4: ఈ రోజు మేష రాశి నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుందంటే..
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 84,489 మంది భక్తులు దర్శించుకోగా.. 28,871 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.76 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.