Janasena In TTD: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యింది. దీనికి సంబంధించి రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యారు.
మొత్తం 24 మందితో ఏర్పడిన మండలిలో టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి చెందిన ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణ నుంచి ఐదుగురు కాగా, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒకొక్కరికి ఛాన్స్ లభించింది.
తొలుత జనసేన విషయానికొద్దాం.. సినీ ఆర్ట్స్ డైరెక్టర్ ఆనందసాయి. శ్రీకాకుళానికి చెందిన ఆయన, చెన్నైలో ఉన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే పవన్ కు అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా తన సేవలందించారాయన.
మరొకరు బొంగునూరి మహేందర్‌రెడ్డి. తెలంగాణలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు నుంచి మహేందర్‌రెడ్డితో పవన్ కల్యాణ్‌కు మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, యువరాజ్యం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఏపీలో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయి.
జనసేనకు చెందిన మరొ మహిళ అనుగోలు రంగశ్రీ. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె భర్త ఆ పార్టీ కోశాధికారి. పలు ధార్మిక కార్యక్రమాల్లో చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలైపోయారు.
మహరాష్ట్ర నుంచి ఒకరు టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. సౌరభ్ హెచ్ బోరా. వైసీపీ ప్రభుత్వంలో 2021-23 మధ్య టీటీడీ సభ్యుడిగా పని చేసిన అనుభవం ఈయన సొంతం. మహారాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుతో ఆయనకు మళ్లీ అవకాశం లభించింది.
తమిళనాడు నుంచి ఇద్దరికి ఛాన్స్ లభించింది. అందులో ఒకరు హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితులు. చెన్నైకి చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్. 2015 నుంచి వరుసగా టీటీడీకి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కంచి కామకోటి పీఠం కో-ఆర్డినేటర్, అథెనా ఎమ్రా పవర్ డైరెక్టర్‌గా ఉన్నారు.
తొలిసారి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్‌కు టీటీడీ పాలక మండలిలో చోటు దక్కింది. గతంలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2014-15 మధ్య కాలంలో పని చేశారు. ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు కూడా.
ఏపీ బీజేపీ నుంచి ఎవరు పాలక మండలిలో కనిపించలేదు. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగానే హైకమాండ్ వారిని పక్కన పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ నుంచి ప్రతిపాదన పంపితే ఒకరిని పాలక మండలి సభ్యుడిగా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.