Tirumala Darshan : పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్న బీఆర్ నాయుడు.. తాను వెంకటేశ్వర స్వామి వారి సేవలో నీతిగా, నిజాయితీగా పనిచేస్తానని అన్నారు. ఏదో సంపాదించాలని తనకు ఆశ లేదన్న నాయుడు.. తన సొంత ఖర్చులతోనే తిరుమలలో విధులు నిర్వహిస్తానని ప్రకటించారు. ఛైర్మన్ గా తిరుమల దేవస్థానం డబ్బులు ఒక్కరూపాయి కూడా ముట్టుకోనని ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అరాచకం సృష్టించారని విమర్శించారు. అందుకే తాను ఐదేళ్లుగా తిరుమల వెళ్లలేదన్న నాయుడు.. వెంకటేశ్వర స్వామి దేవస్థానం పవిత్రతను పూర్తిగా చెడగొట్టారని ఆగ్రహించారు. జగన్ పాలనా కాలంలో అక్కడ జరుగుతున్న ఘటనలు చూసి తాను చాలా బాధపడినట్లు తెలిపిన బీఆర్ నాయుడు. బాధ్యతలు స్వీకరించాక సీఎం చంద్రబాబుతో మాట్లాడి తిరుమల ప్రతిష్టతను కాపాడేందుకు, అక్కడ తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని ప్రకటించారు.
తనకు ఇప్పటికే కొన్ని ఆలోచనలు ఉన్నాయన్న బీఆర్ నాయుడు.. తిరుమల క్షేత్రంలో ప్రతీ ఒక్కరూ హిందూ ధర్మానికి చెందిన వారే ఉండాలన్నారు. ఇతర మతస్తులకు అక్కడ విధులు కేటాయించడం మంచి పద్ధతి కాదన్నారు. వారిని విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. దీనిపై ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. తిరుమలలోని ఇతర మతస్తులకు వీఆర్ఎస్ ఇవ్వాలా, లేదా ఇతర శాఖలకు పంపించాలా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని వెల్లడించారు.
పవిత్ర తిరుమల క్షేత్రంలో అడుగడుగునా అనేక తప్పటడుగులు వేశారన్న బీఆర్ నాయుడు.. తాను బాధ్యతలు స్వీకరించాక శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేస్తానని ప్రకటించారు. శ్రీవారి క్షేత్రానికి ఇప్పటికే ట్రస్ట్ ఉండగా.. కొత్త ట్రస్ట్ అవసరం ఏమెచ్చిందో తెలియడం లేదన్నారు. ప్రజలకు శ్రీవాణీ ట్రస్ట్ పై అనేక అనుమానాలున్నాయన్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి దానిని తప్పకుండా రద్దు చేస్తామని వెల్లడించారు. అలాగే.. శ్రీవారి దర్శనం సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. భక్తుల్ని కంపార్ట్ మెంటుల్లో 18, 20 గంటల పాటు ఉంచడం దారణమన్నారు. గత ఐదేళ్లుగా దేవుడి దర్శనం కోసం వచ్చే చిన్నారులకు కంపార్టుమెంట్లల్లో కనీసం పాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు పాలు ఇస్తున్నా.. అసలు అంత సమయం ఎందుకు ఎదురు చూడాలని ప్రశ్నించారు. సామాన్యులకు తక్కువ సమయంలోనే దర్శనం అయ్యేలా ప్రయత్నిస్తానన్నారు.
Also Read : ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..
గత ప్రభుత్వం హయంలో వెంకటేశ్వర స్వామి వారి వెనుక.. రెండు కొండల మధ్య టన్నుల కొద్దీ చెత్తను వేశారని.. బాధ్యతలు తీసుకున్నాక వాటిని శుభ్రం చేస్తామని ప్రకటించారు. తిరుమలలో తాను చేపట్టబోయే ప్రతీ పనిని ఆగమ శాస్త్ర పండితులు, నిపుణుల సలహాలు, సూచనల మేరకే పని చేస్తామని ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు అందించే లడ్డు, భోజనం వంటి వాటి విషయంలో నాణ్యతకు పెద్దపీట వేస్తామన్నారు. నాణ్యమైన ముడి సరకులు అందించే వారికే కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. అలాగే… వివిధ కమిటీలను ఏర్పాటు చేసి తిరుమలలో పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు.
Also Read : టీటీడీ బోర్డులో జనసేన, బీజేపీ.. ముగ్గురు చొప్పున ఛాన్స్
తిరుమల శ్రీవారి నిధులతో నడిచే ఆసుపత్రుల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామన్న బీఆర్ నాయుడు.. అక్కడ సిబ్బంది, సౌకర్యాలు, పనితీరుపై సమగ్రంగా వివరాలు తెలుసుంటామన్నారు. తిరుమల దేవస్థానం నిర్వహించే కాలేజీలు, పాఠశాలలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి.. మౌలిక వసతులు, ల్యాబులు, ఫర్నీచర్ వంటి వాటిపై పరిశీలన చేసి.. వాటిని బాగు చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు.