TDP on Pawan Kalyan: ఆ జిల్లాలో ఓ టీడీపీ నేత చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. అయితే ఈ నేత తీవ్ర వ్యాఖ్యలు చేసింది వైసీపీ నేతలపై కాదు.. ఏకంగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనే. ఇందుకు వేదికగా మారింది టీడీపీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన కార్యక్రమం. అయితే ఈ నేత వ్యాఖ్యలపై స్థానిక జనసేన నాయకులు భగ్గుమన్నారు. తమ పార్టీ అధినేతకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అంటూ.. సదరు టీడీపీ నాయకుడు కామెంట్స్ చేయడంపై ఆ జిల్లా జనసేన అద్యక్షుడు కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళిందని ప్రచారం సాగుతోంది.
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై ఎమ్మేల్యే స్పందిస్తూ.. పార్టీ కోసం కష్టపడ్డ ఎవరికీ అన్యాయం జరగదని, కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నీ సమస్యలు ఒకేసారి తీర్చడం కాదన్నారు.
ఇదే సమావేశంలో స్థానిక టీడీపీ నాయకుడు శశిభూషణ్ మాట్లాడుతూ.. ఇటీవల జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డిపై శివాలెత్తారు. ఏకవచనంతో బాలినేనిని సంభోదిస్తూ.. బాలినేని ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో తాము పడ్డ ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావని, అక్రమ కేసులు తమపై బనాయించి వేధించారన్నారు. అంతటితో ఆగక.. ప్రస్తుతం రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని జనసేన గుర్తుంచుకోవాలని, బాలినేనిని పార్టీలో చేర్చుకొనే ముందు తమను సంప్రదించాలన్న ఇంగిత జ్ఞానం జనసేన పార్టీ ప్రధాన నాయకులకు ఉండాలన్నారు. అంటే ఈ కామెంట్స్ పవన్ ను ఉద్దేశించి చేసినట్లుగా జనసేన భగ్గుమంది. అంతేకాదు తాము కూడా కూటమి ప్రభుత్వంలో భాగమన్న విషయాన్ని మరచిపోవద్దని జనసేనకు ఆ నేత హెచ్చరించారు.
ఇలా ఈ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బహిరంగ సమావేశాలలో ప్రసంగించే సమయంలో ఆచితూచి మాట్లాడాలన్నారు. తన స్థాయి కూడా మరచి టీడీపీ నేత శశిభూషణ్ కామెంట్స్ చేశారని, సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కు ఇంగిత జ్ఞానం ఉందా అనే రీతిలో.. ప్రశ్నించడం తగదన్నారు. మరోమారు ఇలాంటి కామెంట్స్ చేస్తే జనసేన ఊరుకోదని కూడా హెచ్చరించారు. తమ పార్టీ అంశాలను అధినేత చూసుకుంటారని, ఆ విషయాన్ని టీడీపీ పార్టీ సభ్యత్వ సమావేశంలో ప్రశ్నించడం ఏమిటన్నారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులు ఈ కామెంట్స్ పై గరం కాగా, ఈ విషయం అధిష్టానానికి చేరినట్లు సమాచారం. టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా ఈ వివాదం వెళ్లగా, అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాన్ని తమతో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ.. టీడీపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, మరి జనసేన, టీడీపీ అధిష్టానాలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.