ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే తొక్కిపట్టి నారతీస్తామని వైసీపీ నేతలు కొడాలి నాని, రోజాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. విమర్శించే ప్రతిఒక్కరికీ ఒకే మాట చెబుతున్నా ఇష్టానుసారంగా వ్యహరిస్తాం..సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కుటుంబ సభ్యులను తిడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తటి ప్రభుత్వం కాదని అన్నారు. తాను ఇప్పటి వరకు ఏమీ అనలేదని కానీ జోలికి వస్తే ఊరుకోనని అన్నారు. పవన్ కల్యాణ్ నేడు జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యుద్దమే కావాలంటే కావాల్సినంత యుద్దం చేస్తామని అన్నారు.
గొడవలే కావాలంటే కావాల్సినంత గొడవలకు సిద్ధమని చెప్పారు. కానీ తన గొడవ అభివృద్ధికి దోహదపడే గొడవ అని చెప్పారు. సన్నాసులను చిత్తకొట్టి అభివృద్ధికి బాటలు వేసే గొడవ అని అన్నారు. నాలుగు నెలలు చూశామని తనకు సహనం పోయిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అన్నారు. అదే విధంగా ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని అన్నారు. వాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తోందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను దారుణంగా దూషిస్తున్నారని వాళ్లందరినీ గుర్తిస్తున్నామని చెప్పారు. ఎవ్వరినీ వదిలి పెట్టమని హెచ్చరించారు. ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
సోషల్ మీడియాలో ఆకతాయిల కోసం డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తోందని తెలిపారు. ఆ యాక్ట్ వస్తే ఎవరు తప్పు చేసినా క్రిమినల్ రికార్డు ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో ఆడవాళ్లను దూషిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని, అవన్నీ రికార్డు అవుతాయని ముందే హెచ్చరిస్తున్నామని తెలిపారు. మానవ హక్కులను నిలబెట్టడం కోసమే తాము గత ప్రభుత్వంపై పోరాటం చేశామన్నారు. ఏనాడూ తాము ఆడవాళ్ల గురించి అన్యాయంగా మాట్లాడలేదన్నారు. ఆ నాయకుడి సొంత సోదరే తన ప్రాణాలకు రక్షణ కావాలని, సెక్యురిటీ కావాలని కోరుతోందని అన్నారు. మీ అన్న భద్రత కల్పించలేదేమో కానీ మేము రక్షణ కల్పిస్తామని మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.