Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పిఠాపురం ప్రజల అండతోనే తాను విజయం సాధించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులపై పవన్ మాట్లాడారు. ఇసుక అక్రమరవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. సీఎం స్వపక్షానికి, ఎన్డీఏ ఎమ్మెల్యేలకు క్లారిటీగా చెప్పారని తెలిపారు. కానీ కొంతమందికి బాగా తినడం అలవాటైందని, చంద్రబాబు చెప్పినా వినడంలేదన్నారు. ఇసుకను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Also read:షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?
గత ప్రభుత్వం మాదిరిగా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రజలు కూడా చైతన్యంతో ఉండాలన్నారు. సొంత అవసరాలకు ఇసుక తెచ్చుకోవచ్చని పవన్ స్పష్టం చేశారు. కంపెనీలు వ్యర్థాలను సముద్రంలో కలిపేయడం వల్ల మత్స్యకారులు నష్టపోతున్నారని అన్నారు. ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులకు అరబిందో కంపెనీ, ఇతర కంపెనీల వల్ల నష్టం జరుగోందని ఫిర్యాదు చేశారన్నారు.
ఫార్మా ఇండస్ట్రీలు పొల్యూటెడ్ వాటర్ శుద్ధి చేయకుండా సముద్రంలోకి పంపడం వల్ల మత్స్య సంపదకు నష్టం కలుగుతోందన్నారు. ఒక పరిశ్రమ నిర్మించినప్పుడు ఇతరులు నష్టపోకుండా చూడటం కష్టమైన విషయమేనని చెప్పారు. కంపెనీల వాళ్లు మాట్లాడితే అన్నీ బానే చేస్తున్నామని వివరిస్తున్నారని అన్నారు. తాను ఏమైనా మాట్లాడితే ఆ కంపెనీలు ఇబ్బంది పడతాయన్నారు. లాభాల బాటలో జరుగుతున్న నష్టాలు కూడా కంపెనీలు గుర్తించాలని హెచ్చరించారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు.