Pawan kalyan tour in pithapuram: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలు పార్టీల మారడం కాసేపు పక్కనబెడితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి రానున్నారు. తొలుత రెండురోజుల పర్యటన ఖరారు చేసినప్పటికీ, కేవలం ఒక్కరోజుకే కుదించినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. మరి కొన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారట.
సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గన్నవరం నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నేరుగా కాకినాడ మీదుగా పిఠాపురం వెళ్లనున్నారు.
ససాతన ధర్మాన్ని కాపాడేందుకు నారసింహ వారాహి సేన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేనలో ఇదొక విభాగం అన్నమాట. ఇటు ఏపీ, అటు తెలంగాణలోనూ ఈ విభాగం పని చేయనుంది. దీని ద్వారా అన్ని మతాలను గౌరవిస్తామని ఆ మధ్య తిరుపతి వారాహి సభలో ఓపెన్‌గా చెప్పారు పవన్ కల్యాణ్.
పిఠాపురం వేదికగా సనాతన ధర్మం పరిరక్షణకు కొత్తగా ఓ విభాగాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారని హిందూ సంఘాలు భావిస్తున్నాయి. అయితే షెడ్యూళ్లలో మార్పులు జరగడంతో కేవలం శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సీఎం పరిమితం కావచ్చని అంటున్నారు.
ఇంతకీ పవన్ మదిలో ఏముంది? హిందూ సంఘాలు భావించినట్టుగా పిఠాపురంలో పరిరక్షణకు ప్రత్యేకంగా వింగ్‌ను ఏర్పాటు చేస్తారా? సమయంలో లేదని కొద్దిరోజులు బ్రేక్ ఇస్తారా? అన్నది వెయిట్ అండ్ సీ.