Pawan Kalyan Latest News(Janasena Party News): మైత్రీ మూవీస్‌పై ఐటీ దాడులు. ఏపీలో రాజకీయ విమర్శలకు కారణమైంది. ప్రముఖ చలన చిత్ర నిర్మణ సంస్థలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పెట్టుబడులు ఉన్నాయంటూ విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఐటీ శాఖకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. జనసేన ఆరోపణలపై ఎమ్మెల్యే బాలినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ నిర్మాణ సంస్థలో రూపాయి కూడా పెట్టుబడి లేదని తేల్చి చెప్పారు. ఆరోపణలను రుజువు చేస్తే ఆస్తి మొత్తం రాసిస్తానని.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని చాలెంజ్ చేశారు. తనకు పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరా తీసుకోవచ్చని కూడా సవాల్ చేశారు బాలినేని.
బాలినేని వ్యాఖ్యలు జనసేన మీద బాగానే ఇంపాక్ట్ చూపించినట్టున్నాయి. విషయం పవన్ కల్యాణ్ వరకూ వెళ్లినట్టుంది. జనసేనాని నష్ట నివారణా చర్యలు చేపట్టినట్టున్నారు. ఎక్కడా బాలినేని పేరు ప్రస్తావించకుండా.. జనసైనికులకు సలహాలు, సూచనల పేరుతో బహిరంగ లేఖ రాశారు. అందులో ఉన్న అంశాలు జనసైనికుల తప్పటడుగులను సవరించేలా ఉన్నాయి. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే…
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించేందుకు, భావజాలాన్ని కలుషితం చేసేందుకు కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి. మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లండి. వారి సూచనలు, సలహా మేరకు మాట్లాడండి. పార్టీలోని నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ మాట్లాడే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయొద్దు.. అది పార్టీకి, సమాజానికి మంచిది కాదు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయొద్దు. మీడియాలో వచ్చిందనో.. ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాలపై చెప్పొద్దు”.. ఇలా సాగింది పవన్ కల్యాణ్ బహిరంగలేఖ.
మేటర్ చూస్తుంటే.. పవన్ చెప్పిన జాగ్రత్తలన్నీ బాలినేని ఎపిసోడ్ గురించే అంటున్నారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు అసంబద్ధమని తేలిందేమో. అందుకే, జనసేనాని ఈ లెటర్ రిలీజ్ చేశారని చెబుతున్నారు. బాలినేని సవాల్ బాగానే వర్కవుట్ అయినట్టుంది.