EPAPER

One Family One Ticket: ఒక కుటుంబానికి ఓక సీటు మాత్రమే.. రాయలసీమ టిడిపిలో కలవరం..

One Family One Ticket: ఒక కుటుంబానికి ఓక సీటు మాత్రమే.. రాయలసీమ టిడిపిలో కలవరం..
TDP latest news telugu

TDP latest news telugu(AP politics):

టిడిపి యువనేత నారా లోకేష్ సూచిస్తున్న రెండు నిర్ణయాలు రాయలసీమ టిడిపిలో కలవరం పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక, ఇప్పుడు లోకేష్ నిర్ణయంతో పలు నియోజవర్గాల్లో పార్టీ పరిస్థితిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, లోకేష్ ప్రతిపాదిస్తున్న ఆ నిర్ణయాలు ఏంటీ ? అవి అమలైతే పరిస్థితి ఎలా ఉండబోతోంది ? అసలు దీనిపై పార్టీ నేతల్లో ఉన్న అభిప్రాయమేంటి ?


టిడిపి ఆవిర్భావం తర్వాత ప్రారంభంలో పార్టీకి రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు కంచుకోటలా ఉన్నాయి. ఆయా నియోజవర్గాల్లో బిసి సామాజిక వర్గాలతో పాటు యువకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో అన్ని సామాజిక వర్గాల నాయకులు పార్టీకి అండగా నిలిచారు. దీంతో తిరుగులేకుండా పార్టీ అన్ని వర్గాల్లోకి దూసుకుపోయింది. అయితే, తర్వాత పరిణామాలతో పార్టీలో పాతుకుపోయిన నాయకులు పార్టీ కంటే తాము బలమైనవారమన్న రీతీలో వ్యవహారించారనే వాదన వచ్చింది. దీనితో పాటు పార్టీలోకి వచ్చిన కొత్త వ్యక్తులు పార్టీని, కార్యకర్తలను ఓన్ చేసుకోకపోవడం వల్ల పార్టీ క్యాడర్‌కు అండగా ఉండే నాయకులు కూడా కరువయ్యారనే విమర్శలు ఉన్నాయి. అలాగే, పార్టీ వల్ల అంగబలం, ఆర్థిక బలం సంపాదించుకున్న నేతలు కూడా క్యాడర్‌ను పట్టించుకోక పోవడంతో పార్టీ శ్రేణులు పార్టీ కార్యకలపాలకు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ పరిణామాన్ని అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకోలేదనే వాదన ఉంది. ఇవన్నీ కలిసి, 2019లో పార్టీని సీమలో ఘోరంగా దెబ్బతీసాయని కొందరు భావిస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రస్తుతం టిడిపి యువనేత నారా లోకేష్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే వరస ఓటములు చవిచూసిన వారికి టికెట్ లేదంటునే.. మరో వైపు ఒక కుటుంబానికి ఓక సీటు మాత్రమే ఇస్తామని అధిష్టానం నిర్ణయం తీసుకుందట. యువనేత తీసుకున్న నిర్ణయంతో రాయలసీమలో ప్రముఖ రాజకీయ కుటుంబాలు ఆలోచనలో పడ్డాయని తెలుస్తోంది. ఇప్పటికే, కర్నూలు నుంచి ఈ నిర్ణయాల ఆచరణ కూడా ప్రారంభం కావడంతో సీమ నేతలందరిలో కలవరం మొదలయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, సీమలో పార్టీ వెనుకబడి ఉందని భావిస్తున్న టిడిపి అధినేత నిర్ణయాన్ని గౌరవించాలా.. లేదా అనే సందేహంలో ప్రముఖ కుటుంబాలు, పార్టీ శ్రేణులు ఉన్నాయని తెలుస్తోంది.


2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి శాసనసభ, పార్లమెంటు అభ్యర్థులు ఘోరంగా ఓటమిపాలు కావడం వల్ల పార్టీ క్యాడర్ కూడా దెబ్బతింది.పార్టీ బలంగా ఉందనుకున్న చోట.. తిరుగులేని నాయకులు సైతం ఓటమి పాలయ్యారు. రాయలసీమ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో కలసి 52 సీట్లకు గాను 3 చోట్ల మాత్రమే విజయం లభించింది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, హిందుపురం నుంచి బాలక్రిష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. ఇక ఎంపిల విషయానికి వస్తే అన్నిచోట్ల పరాజయమే ఎదురయ్యింది. ఇలాంటి స్థితిలో పార్టీలో మేథోమథనం మొదలయిందని తెలుస్తోంది. అయితే, ప్రముఖ రాజకీయ కుటుంబాల కంటే పార్టీ గొప్పదనే సిద్ధాంతాన్ని ఇప్పుడు టిడిపి సీరియస్‌గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని అధిష్టానం ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో పరిటాల, జేసి కుటుంబాలు.. చిత్తూరు జిల్లాలో నల్లారి ఫ్యామీలి, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి కుటుంబం.. కర్నూలు జిల్లాలో కోట్ల, భూమా, కేఈ కుటుంబాలు.. అలాగే, టీజే ఫ్యామీలీ.. వీరంతా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రజల ముందు వీరెవ్వరు కనిపించట్లేదనే విమర్శ కూడా ఉంది. ఇప్పుడు ప్రజలంతా వీరి గత చరిత్ర కూడా మర్చిపోయారనే టాక్ వినిపిస్తుంది. దీనితో, పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

యువగళం పాదయాత్రకు ముందు జరిగిన మహానాడులోనే నారా లోకేష్ ఈ అభిప్రాయాలు చెప్పారు. వరుసగా మూడు సార్లు ఓటమిపాలైన వారికి టికెట్ ఇవ్వకూడదని అప్పుడే నిర్ణయించారు. అదే సమయంలో ఫ్యామిలీకి ఓకే సీటు అనే అంశాన్ని కూడా వెల్లడించారు. అప్పట్లో దీనిపై పార్టీ వర్గాల్లో కొంత చర్చ కూడా నడిచినట్లు తెలుస్తోంది. పార్టీలోని తల పండిన నేతలు, సీనియర్లు కూడా భుజాలు తడుముకున్నట్లు అనుకున్నారు. అయితే, పాదయాత్రతో రాటుదేలిన లోకేష్ ఇదే ఫైనల్ నిర్ణయం అని చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగానే, కర్నూలు జిల్లాలోని నంద్యాలకు నియోజవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మనందరెడ్డిని తొలగించి, మాజీ మంత్రి ఫరూఖ్‌కు అవకాశం కల్పించారు. దీంతో సీమ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో కదలిక మొదలయ్యింది.

ఇక..అనంతపురం జిల్లాకు సంబంధించి టిడిపిలో పరిటాల, జెసి కుటుంబాలు రెండు సీట్ల కోటాలో ఉన్నాయి. ధర్మవరం మాజీ ఎంఎల్‌ఎ గోనుగుంట్ల సూర్య నారాయణ 2019 ఎన్నికల తర్వాత.. అప్పటి రాజకీయ పరిస్థితులతో బిజెపిలో చేరాడు. పార్టీ మారిన తర్వాత కూడా తాను చంద్రబాబు విధేయుడే అనే విధంగా వ్యవహారించాడనే టాక్ ఉంది. ఇక, అప్పట్లో పరిటాల శ్రీరామ్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే, రాప్తాడు, ధర్మవరం రెండు చోట్లా ఈ ఫ్యామీలి టికెట్ ఆశిస్తుంది. కాని లోకేష్ రూల్ ప్రకారం ఒకరికే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఇదే ప్రాంతంలో జేసీ ఫ్యామీలి విషయానికొస్తే.. జేసీ సోదరుల కూమారులిద్దరు 2019 ఎన్నికల్లో పోటీ చేసారు. అనంతపురం ఎంపిగా జేసీ దివాకర్ రెడ్డి కూమారుడు పవన్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్‌ఎగా జేసీ అచ్యుత్ రెడ్డి పోటీ చేసారు. అయితే ఓటమి తర్వాత పవన్ రెడ్డి రాజకీయ కార్యకలపాలకు దూరంగా ఉన్నారు. చివరకు పాదయాత్రలో కూడా పాల్గొనలేదు. దీనితో, ఈసారి ఈ కుటుంబం నుండి ఎవరికి సీటు ఇస్తారో అనే సందేహం ఉంది. ఇక, లోకసభ సీటును బిసి వర్గాలకు ఇస్తామని ఇప్పటికే టిడిపి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనంతపురం నుంచి కూడా బిసి ఎంపి అభ్యర్థి ఉంటారనే టాక్ వినిపిస్తుంది. కాగా, తాడిపత్రి అసెంబ్లీకి మాత్రమే జేసీ కుటుంబం పరిమితం అవుతుందని ప్రచారం జరుగుతోంది.

కర్నూలు జిల్లాలో అయితే పార్టీ నేతలకు సంబంధించి చాంతాడంతా క్యూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల కుటుంబం నుంచి ముగ్గురు టికెట్ అశిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపిగా.. ఆయన భార్య సుజాతమ్మ అలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆ రెండే కాకుండా తమ కూమారుడికి ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వమని అడుగుతున్నారంట. మరో సీనియర్ నేత మాజీ మంత్రి కేఈ క్రిష్ణమూర్తి కుటుంబం కూడా ఈసారి రెండు టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. గత ఎన్నికల్లో కేఈ క్రిష్ణమూర్తి కూమారుడు కేఈ శ్యాం, పత్తికొండ నుంచి.. క్రిష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్, డోన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే.. ఈసారి డోన్ నుంచి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ టికెట్ అశిస్తున్నట్లు సమాచారం. ఇక, నంద్యాల జిల్లాలో అయితే కుటుంబ పోటీ తీవ్రంగా ఉంది. భూమా కుటుంబం నంద్యాల, ఆళ్ళగడ్డ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అఖిలప్రియ ఆళ్ళగడ్డ నుంచి.. భూమా బ్రహ్మనందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరో వైపు, బనగానపల్లి మాజీ ఎంఎల్ఎ జనార్ధన రెడ్డి తన కుటుంబానికి ఎంపి, ఎంఎల్ఎ టికెట్లు ఇస్తే నంద్యాల పార్లమెంటు ఖర్చు మొత్తం భరిస్తాననే బంపర్ ఆఫర్ కూడా పెట్టాడంట. మరి పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో తేలాలి.

కడప జిల్లాకు సంబంధించి, రాయచోటి ఇంఛార్జ్ రమేష్ రెడ్డి ఇప్పటికే వరుస ఓటములతో ఉన్నాడు. అయితే, ఈయన సోదరుడు శ్రీనివాసరెడ్డిని కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన భార్య మాదవీ రెడ్డిని ప్రస్తుతం కడప అసెంబ్లీ ఇంఛార్జ్‌గా ప్రకటించారు. కాగా.. గతంలో వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన వారికి ఈసారి అవకాశం ఉండదనే యువనేత నిర్ణయం ఇప్పటికే వచ్చేసింది. అయితే.. ఇప్పుడు కడప పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాస రెడ్డిని అల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో.. తనకు ఖచ్చితంగా టికెట్ కావాలని రమేష్ రెడ్డి పట్టుబట్టాడుతున్నట్లు సమాచారం. అనంతపురంలో టికెట్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరనే రీతిలో డిమాండ్ చేయడానికి సిద్దమవుతున్నాడంట రమేష్ రెడ్డి. ఇక మరో వైపు మాజీ ఎంఎల్సీ పుత్తా నరసింహారెడ్డి తనకు కమలాపురం టికెట్, తన కూమారుడికి కడప టికెట్ ఇవ్వమని అడుగుతున్నారని సమాచారం. మాజీ మంత్రి వీరారెడ్డి కుటుంబానికి చెందిన ఆనం కూమార్తె కైవల్య రెడ్డికి నెల్లూరులోని ఆత్మకూరు స్థానం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరో స్థానం ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాత్రమే ఇలా కుటుంబ సీట్ల పంచాయితీ లేనట్లు కనిపిస్తోంది.

ఇక.. ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే, దాని ప్రభావం రాజకీయంగా ఏ పార్టీకైనా ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం అంటే ఆర్థికంగా ఖర్చు భరించాలి. దీంతో పాటు ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అంగబలాన్ని రెండు చోట్లకు సర్ధాల్సి ఉంటుంది. దీనికి తోడు, కొత్తగా వచ్చే ఓౌత్సాహికులకు అవకాశాలకు గండి పడుతుంది. దీని వల్ల, అప్పటి వరకూ అవకాశం దక్కించుకోలేని సామాజిక వర్గాలు కూడా పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే, యువనేత లోకేష్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియక పార్టీ క్యాడర్ కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే, అన్నింటిని చాక చక్యంగా నడిపే అపర చాణుక్యుడు చంద్రబాబు సెట్ చేస్తాడని క్యాడర్ అనుకుంటుందట. ఏదైమైనా.. ఏ ఫ్యామీలికి ఎన్ని టికెట్లు ఇచ్చినా.. సగం స్థానాల్లో మాత్రం రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×