EPAPER

AP : రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

AP : రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..




AP : ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పర్యటలు చేస్తున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గట్టుగానే టీడీపీ కార్యక్రమాలకు జనం భారీగా వస్తున్నారు. అలా రావడం వల్లే నెల్లూరు జిల్లా కందుకూరులో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజులలోపే మరో ఘటన జరిగింది .ఈసారి గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు వచ్చి కానుకల పంపిణీ ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఫలితంగా మరో దారుణం. ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు.


ఈ రెండు ఘటనలపై టీడీపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బాబు ప్రచార యావకు సామాన్యులు బలైపోతున్నారని వైసీపీ ఎటాక్ కు దిగింది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. ఈ రెండు ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతుండగానే …ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులపై ర్యాలీలు, సభలను నిషేధించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రోడ్లపై ఈ నిబంధన వర్తిస్తుందని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాలీలు, సభలు నిర్వహించాలనుకునేవారు రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది కలిగించని ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్‌ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారీకేడ్ల నిర్మాణం లాంటి లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. ఇటు ఇలాంటి ప్రమాదాలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 1861 పోలీస్‌ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.


రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయా­లని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజ­లకు ఇబ్బంది కలగకని ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

కొన్ని సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్‌ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతిచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలని పేర్కొంది. సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు, కచ్చితమైన రూట్‌ మ్యాప్, హాజరయ్యేవారి సంఖ్య, సక్రమ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. వాటిపై జిల్లా ఎస్పీ/ పోలీస్‌ కమిషనర్‌ సంతృప్తిచెందితే నిర్వాహకుల పేరిట షరతులతో అనుమతినిస్తారు. వైసీపీ కార్యక్రమాలకు పర్మిషన్ ఇచ్చేందుకు ఈ నిబంధన తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రతిపక్షాల కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇకపై చంద్రబాబు రోడ్ షోలు ఏ విధంగా నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం కోసం వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. అసలే పవన్ కార్యక్రమాలకు యువతే పోటెత్తుతారు. పవన్ కనిపించగానే రచ్చరచ్చ చేస్తారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనలు పాటిస్తూ జనసేనాని టూర్ సాగడం సాధ్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైవు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈ యాత్రలో రహదారి కూడళ్లలో మీటింగులకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు నారా లోకేష్ పాదయాత్రలోని కార్యక్రమాలపై ప్రభావం చూపించనున్నాయి. ప్రభుత్వం నిబంధనల పేరుతో తీసుకొచ్చిన సవాళ్లను అటు టీడీపీ, ఇటు జనసేన ఎలా అధిగమించి ముందుకుసాగుతాయో చూడాలిమరి.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×