Varahi: గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర పూర్తైంది. నెక్ట్స్ విశాఖలో విజయ విహారానికి రెడీ అవుతోంది. పట్టున్న ప్రాంతాల్లో ముందుగా పని పూర్తి చేయాలనేది జనసేనాని వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, ముందుగా తన ఇలాఖా అయినా గోదావరి జిల్లాలను చుట్టేశారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఏరియాను ఇప్పటికే కవర్ చేసేశారు. ఎన్నికల నాటికి మళ్లీ ప్రచారానికి రాలేక పోయినా.. ఇంకేం పర్వాలేదనేలా వారాహి యాత్ర కొనసాగింది. పవన్ కల్యాణ్ సభలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన ప్రసంగాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జగన్ సర్కారును జనాల ముందు దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో.. నేను లోకల్.. తరహాలో తొలివిడత వారాహి విజయవంతమైందనే చెప్పాలి.
నెక్ట్స్ ఎక్కడ? అని గట్టి కసరత్తే చేసింది జనసేన. పవన్‌కు స్టేట్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నా.. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచే బరిలో దిగారు జనసేనాని. ఆ రెండుచోట్ల తనకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని భావించారు. ఆ లెక్కన.. గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు విశాఖలోనే బలమెక్కువ. అందుకే, ఈసారి వారాహి విజయయాత్ర అక్కడే.
అందులోనే, విశాఖ రాజకీయంగా కీలక ప్రాంతంగా మారింది. మూడేళ్ల క్రితమే ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రభుత్వం ప్రకటించడం.. త్వరలోనే విశాఖ నుంచి పాలనంటూ ఏడాదిగా ఊదరగొడుతుండటంతో.. ఆ విశాఖలోనే జగన్ సర్కారుతో తేల్చుకునేందుకు ముందుకొస్తున్నారు పవన్ కల్యాణ్. రాజధాని పేరుతో భూదందా, వైసీపీ నేతల భూకబ్జా, రుషికొండ తవ్వకాలు, భీమిలీ బీచ్ అరాచకాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ఇలా మాట్లాడటానికి, పూనకంతో ఊగిపోవడానికి చాలా అంశాలే ఉన్నాయి విశాఖ చుట్టూ. వారాహి యాత్రకు కావలసినంత ముడిసరుకు ఉండటంతో.. గోదావరి తర్వాత విశాఖనే ఎంచుకున్నారు పవన్ కల్యాణ్.