EPAPER
Kirrak Couples Episode 1

YSRCP : వైసీపీలో ఆధిపత్య పోరు.. జగన్ వద్ద పంచాయితీలు..

YSRCP : వైసీపీలో ఆధిపత్య పోరు.. జగన్ వద్ద పంచాయితీలు..

YSRCP : ఏపీలో ఎన్నికలకు 16 నెలల మాత్రమే సమయం ఉంది. అవినీతికి దూరంగా ఉండండి అని సీఎం జగన్ మంత్రులకు ఈ మధ్యే హితబోధన చేశారు. ఒకవైపు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను ఇంటింటికి తిరగాలని ఆదేశిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం విజయవాడ వేదికగా బీసీ సదస్సు నిర్వహించి ఆ వర్గాల ఓట్లపై పూర్తి పట్టు సాధించే ప్రయత్నం చేశారు. ఇలా జగన్ ఎన్నికలకు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో వర్గపోరు సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. అనేక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లూ పైకి మాట్లాడని నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటారు.


జోగి Vs వసంత
నేతల మధ్య ఆధిపత్య పోరు పంచాయితీలు జగన్‌ వద్దకు చేరుతున్నాయి. తాజాగా మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్‌ వల్ల పార్టీలో విభేదాలు వస్తున్నాయని పలువురు కార్యకర్తలు సీఎంకు ఫిర్యాదు చేశారు. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్‌ మైలవరం పరిధిలో నివాసం ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మైలవరం నియోజకవర్గానికి అవసరమైతే కొత్తగా పార్టీ సమన్వయకర్తను నియమించుకోండని ఎమ్మెల్యే బహిరంగంగానే ప్రకటించారు. మంత్రి, ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని కార్యకర్తలు సీఎంకు వివరించారు. వారంలోగా మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌లను పిలిచి మాట్లాడతానని సీఎం పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అదే సమావేశంలో టీడీపీ నేత దేవినేని ఉమాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం. చంద్రబాబు మనిషి మీ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, జోగి రమేష్‌ మనం పెంచిన బీసీ నాయకుడు, ఆయన పెడనలో మళ్లీ గెలుస్తారని స్పష్టం చేశారు. వసంత కృష్ణప్రసాద్‌కు తోడుగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

కృష్ణప్రసాద్ కు టిక్కెట్ వస్తుందా?
నియోజకవర్గాల సమీక్షల్లో జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మైలవరం విషయంలో మాత్రం కృష్ణప్రసాద్‌కు కార్యకర్తలు తోడుగా ఉండాలని చెప్పడమే తప్ప కచ్చితంగా ఆయనే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అనే స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ కూడా తనకు టికెట్‌ ఖరారైందని స్పష్టం చేయలేకపోతున్నారు. టికెట్‌ విషయంలో జగన్‌ నిర్ణయం తనకు శిరోధార్యమని చెబుతున్నారు. అయితే టికెట్ ఇవ్వకపోతే ఇదే మాట చెబుతారానేది సందేహమే.


మడకశిరలో ముసలం
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే ఎమ్మెల్యే తిప్పేస్వామి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్‌డౌన్‌, అవినీతి చక్రవర్తి అంటూ నినాదాలు చేయడం వివాదాన్ని రేపింది. ఎంత చెప్పినా వారు వినకపోవడంతో మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్గాలుగా విడిపోతే పార్టీకి చెడ్డపేరు వస్తుందని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు మాజీమంత్రి నరసేగౌడ, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి వర్గం ఓ వైపు, ఎమ్మెల్యే వర్గం మరోవైపు వేర్వేరుగానే పెద్దిరెడ్డి స్వాగతం పలికారు.

హిందూపురంలో రచ్చ
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడంతో ఆ పార్టీలో ముసలం రేగింది. ఎంపీ ప్రకటనపై చౌళూరు మధుమతి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇక్బాల్‌కే టికెట్‌ ఇస్తారని ఎంపీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో అక్కడ నుంచి రెడ్డి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనార్దన్‌రెడ్డి బయటకు వెళ్లిపోయారు. వేదిక కింద ఉన్న కొందరు ఇక్బాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పెద్దిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎవరికీ టికెట్‌ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. ఇలా చాలా చోట్ల మంత్రి పెద్దిరెడ్డికి ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి.

ఉరవకొండలో అన్నదమ్ముల సవాల్
ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి తీవ్రం నష్టం కలుగుతోందని పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ చాలాచోట్ల వైసీపీ నేతలు వీధికెక్కుతున్నారు. టిక్కెట్ వేటలో ముందడుగు వేసేందుకు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. కొందరు అధినేత వద్దకే పంచాయితీలను తీసుకెళుతున్నారు. మరికొందరు మంత్రుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరి సీఎం జగన్ నేతల మధ్య రగులుతున్న ఆధిపత్య జ్వాలలను ఎలా చల్లార్చుతారో చూడాలి మరి.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Jagan Tirumala Tour : జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

Union Minister Comments On Tirumala Laddu: తిరుమల లడ్డు వివాదం.. బాంబ్ పేల్చిన కేంద్ర మంత్రి

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

Big Stories

×