Big Stories

AP : ఏపీ అప్పుల భారం ఎంత..? అసలు లెక్క తేలేదెప్పుడు..?

AP : ఆంధ్రప్రదేశ్ మొత్తం రుణ భారం రూ. 9 లక్షల కోట్లు దాటిపోయిందా? అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏపీ అప్పుల కుప్పుగా మారిపోయిందని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ ఈ అంశంపై ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. సీఎంకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఇలా ఏపీలో అప్పల పరిస్థితిపై రాజకీయం వేడెక్కింది.

- Advertisement -

రుణాల లెక్కలను జగన్ సర్కార్ దాస్తోందని విమర్శలు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న వేల కోట్ల రుణాల తాజా గణాంకాలను అధికారికంగా వెల్లడించడం లేదు. ఢిల్లీ నుంచి కాగ్‌ అధికారుల బృందం ప్రత్యేకంగా వచ్చి రాష్ట్ర సచివాలయంలో కొన్నిరోజులుగా తనిఖీ చేస్తోంది. వారికి అడిగిన లెక్కల వివరాలు ఇవ్వొద్దని కిందిస్థాయి అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం తన వద్ద ఉన్న పెండింగు బిల్లుల మొత్తాన్నీ అధికారికంగా వెల్లడించడం లేదు. ఈ కారణాల వల్ల ఏపీ రణభారంపై పూర్తి లెక్కలు తేలడంలేదు. రాష్ట్ర ఆర్థికశాఖలో గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు ఏపీ రుణభారం రూ.9,16,696 కోట్లు ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.

- Advertisement -

నిపుణుల అంచనా ప్రకారం ఏపీ అప్పులు
రాష్ట్ర ప్రభుత్వ రుణం.. రూ. 4,65, 860 కోట్లు
కార్పొరేషన్ల రుణం.. రూ. 1, 78, 603 కోట్లు
నాన్ గ్యారంటీ అప్పులు రూ. 87, 233 కోట్లు
పెండింగ్ బిల్లులు రూ. 1, 85, 000 కోట్లు

మరోవైపు రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి ఏపీ రుణాలు రూ.4,42,442 కోట్లుగా ప్రకటించారు. ‘స్టేట్‌ ఫైనాన్సెస్‌ : ఏ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ 2022-23’ పేరిట ఆర్బీఐ ప్రచురించిన పుస్తకంలోని గణాంకాల ఆధారంగా కేంద్రం ఈ లెక్కలు ప్రకటించింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లో ప్రతిపాదించిన, సవరించిన గణాంకాల ఆధారంగానే ఆర్బీఐ ఈ లెక్కలు చూపిస్తోంది. అంటే… రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన, ఆర్బీఐ చూపిన లెక్కలు.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలే. అందువల్ల ఏపీ అప్పులపై స్పష్టత రావడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌, పబ్లిక్‌ అకౌంట్‌ నుంచి రుణాలను సమీకరిస్తుంది. బహిరంగ మార్కెట్‌ రుణాలను కేంద్ర ఆర్థికశాఖ అనుమతుల మేరకు ఆర్బీఐ నిర్వహించే వేలం ద్వారా సేకరిస్తుంది. అందువల్లే బహిరంగ మార్కెట్‌ రుణం ఎంతనేది ఆర్బీఐకి స్పష్టంగా తెలుస్తుంది. పబ్లిక్‌ అకౌంట్‌ రుణాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలు కూడా నిజానికి గతంలో బ్యాంకు ఖాతాల్లో ఉండేవి. ఆ తర్వాత కాలంలో వాటిని పీడీ ఖాతాల్లో ఉంచి ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఈ కారణంగానే ఈ అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా బయటకు వెల్లడించడం లేదు. దీంతో అసలు అప్పులు ఎంతో తెలియడం లేదు.

ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ… ఇలా తీసుకునే రుణాల మొత్తం సమగ్రంగా లెక్కించకపోవడం, వాటిని యథాతథంగా బయటపెట్టకపోవడంతోనే ఈ సమస్య వస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జీపీఎఫ్‌ బకాయిల విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య వివాదం సాగుతోంది. కార్పొరేషన్ల అప్పులపై తాము వివరాలు కోరుతున్నా ఆ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం లేదని కాగ్‌ తన నెలవారీ నివేదికల్లో స్పష్టం చేస్తోంది.

ఇక ప్రభుత్వం నాలుగేళ్లుగా అనేక బిల్లులు చెల్లించకుండా పెండింగులో ఉంచింది. ఈ బకాయిలు గత మూడేళ్లలోనే రూ.1.50 లక్షల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 35 వేల కోట్ల వరకు పెండింగు బిల్లులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద ఏపీ అప్పుల లెక్కలు మిస్టరీగానే ఉన్నాయి. మరి ఈ లెక్కలు కాగ్ తేలుస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వమే బయటపెడుతుందా చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News