EPAPER

Rajahmundry Politics : రాజమండ్రి వారియర్స్ ఎవరు..? రసవత్తరంగా అభ్యర్ధి ఎంపిక..

Rajahmundry Politics : రాజమండ్రి వారియర్స్ ఎవరు..? రసవత్తరంగా అభ్యర్ధి ఎంపిక..

Rajahmundry Politics : రాజమండ్రి సీట్ల రాజకీయం ఎవ్వరికీ అంతుబట్టిని పజిల్ లా ఉంది. ఓ వైపు అధికార పార్టీకి అభ్యర్థిని ఖరారు చేయడం కత్తిమీద సాములా ఉంటే… మరోవైపు, ప్రతిపక్ష పొత్తులో ఎవరికి సీటు దక్కుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. స్థానిక నేతలకైతే కొదువ లేదు గానీ, సెలక్షన్ మాత్రం టెన్షన్ పుట్టిస్తోంది. ఎవర్నీ నిలబెడితో ఎవరు అలకబూనుతారో తెలియక పార్టీలన్నీ పరేషాన్‌లో ఉన్నాయి. ఇలాంటి ఆసక్తి కలిగించే రాజకీయాలతో రాజమండ్రి రణరంగం రంజు రంజుగా మారింది.


ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం ఎప్పుడూ వాడిగా వేడిగానే ఉంటుంది. ఆ ప్రాంతం నుండి అధిక సీట్లు ఉండటం, అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీనే గద్దెనెక్కుద్దనే సెంటిమెంట్ ఉండటం వల్ల పార్టీలన్నీ అక్కడ ఎక్కువ దృష్టి పెడతాయి. అందులోనూ రాజమండ్రి సెగ్మెంట్ సీట్ల వ్యవహారం ఎప్పుడూ ఇంట్రస్టింగ్ మలుపులు తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిస్థితి అలాగే ఉంది. రాజకీయాల్లో పోలింగ్ తర్వాత ఫలితాల కోసం నేతలంతా టెన్షన్తో ఎదురుచూస్తున్నట్లు ఉంది ఇక్కడ సీట్ల కేటాయింపు. ఒకపక్క అధికార పార్టీ అభ్యర్థులను మార్చే దిశగా అడుగులు వేస్తుంటే.

టీడీపీ జనసేన ఆశావాహులు మాత్రం సీటు ఎవరికి దక్కుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టిడిపి నుంచి బుచ్చయ్య చౌదరి, జనసేన నుంచి కందుల దుర్గేష్ బరిలో ఉండగా పొత్తులో భాగంగా ఒకరే పోటీలో ఉండాల్సి ఉంది. కాగా, వీరిలో ఎవరికి ఛాన్స్ ఉంటుందో తెలియక అయోమయంలో ఉన్నారు. అయినా, సీటు మాదంటే మాదంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా పరిస్థితులు ఎలా ఉన్నా రంగంలో దిగేందుకు సిద్ధం అంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఏం జరుగుతుందో తెలియక పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి కంచుకోటగా ఉన్న రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ నియోజక వర్గాలను అధికార వైసీపీ తన ఖాతాలో వేసుకోడానికి వ్యూహం రచించింది. అధికార పార్టీ వైసీపీలో ఇక్కడ నుండి కాస్త స్పష్టత కనిపిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ను రాజమండ్రి టౌన్ నుండి పోటీ చేయించడానికి… రాజమండ్రి రూరల్ నుండి ప్రస్తుతం రామచంద్రపురం నుండి గెలిచి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రంగంలోకి దింపేందుకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే, రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ నియోజక వర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సీయం జగన్ వేవ్‌ను కూడా పక్కన పెట్టి రాజమండ్రి నగరం, రూరల్ సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి. రాజమండ్రి నగరం నుండి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి భవాని విజయం సాధించగా, రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరీ గెలుపొందారు. రెండు పర్యాయలుగా ఈ రెండు నియోజక వర్గాల్లోనూ టీడీపీదే పైచేయిగా ఉంది. కాగా, ఈ రెండు నియోజక వర్గాల్లో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే, ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గం జనసేనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే, పార్టీ ఏదైనా రాజమండ్రి నగరం సీటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబానికే కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఇక, రాజమండ్రి నగరం విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ నుండి గత ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాష్ పోటీ చేసి ఓటమిని పొందారు. అప్పటి నుండి నగరంలో పెద్దగా యాక్టీవ్‌గా లేరనే టాక్ వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రాజమహేంద్రవరం నగరం నుండి పోటీ చేసేందుకు అటు అధిష్టానాన్ని, ఇటు నగరంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై సీఎం జగన్ నుండి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే గుడ్ మార్నింగ్ రాజమండ్రి వంటి పలు కార్యక్రమాల్లో మార్గాని భరత్ ప్రజలకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది. ఈయన రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటికీ… మొదటి ప్రిఫరెన్స్‌గా రాజమండ్రి నగరంలో తన మార్కు వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. రాజమండ్రి నగరంలో భరత్ మార్కుతో పాటు వైసీపీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు భారీగా చేస్తున్నారు.

అయితే, గత కొంత కాలంగా ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్యా టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును, ఆదిరెడ్డి వాసును అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ కొంత సానుభూతిని సొంతం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి వచ్చి ఆదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడంతో టీడీపీకి భారీగానే మైలైజ్ పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ద్వారా మొదట నుండి క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీడీపీకి మరింత బలం చేకూరందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ… అంగబలం, ఆర్ధిక బలం పుష్కలంగా ఉన్న ఎంపీ భరత్‌కు ప్రజల బలం కూడా తోడు కావడంతో రాజమండ్రి నగరంలో గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ కోటను కూల్చడానికి అధికార వైసిపి వేసిన వ్యూహంలో భాగంగా ఎంపీ భరత్‌ను బరిలోకి దింపే అవకాశం ఎక్కువుగా కనిపిస్తుంది. ఇక, ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గంలో ఏం జరగుతుందో వేచిచూడాలి.

ఇక, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే… ఈ నియోజకవర్గంలో రెండు మండలాలు, కొన్ని వార్డులు రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ నుండి ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్, కడియం, మరో పదమూడు వార్డులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజక వర్గం మొదటి నుండి టీడీపీ పార్టీకీ కంచుకోటగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ రెండు పర్యాయలుగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు.

కాగా, ఈ నియోజకవర్గంలో టీడీపీ నుండి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరీ… వైసీపీ తరుఫున అభ్యర్థిగా ఉన్న ఆకుల వీర్రాజుపై సుమారు పదివేల ఓట్లు తేడాతో విజయం సాధించారు. అయితే, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నప్పటీకీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు కచ్ఛితంగా జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు. అందులోనూ, జనసేన మొదటి నుండి రూరల్ నియోజకవర్గంలో బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో సుమారు మూప్పై వేల ఓట్లు ఆ పార్టీ సాధించింది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన కందుల దుర్గేష్‌ మళ్లీ సీటు కావాలని అడుగుతున్నట్లు సమాచారం.

కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుండి జిల్లాలోనే కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఫర్వాలేదు అనిపించుకున్నారు. ఇక, ఈసారి తెలుగుదేశంతో కూడా పొత్తు ఉండటం వల్ల ఈ స్థానం తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది. అందుకే, జనసేన ఈ సీటును పోగొట్టుకోదనే టాక్ వినిపిస్తుంది. ఇలా జనసేకు ఈ స్థానం ఇస్తే గోరంట్లకు ఏ నియోజకవర్గంలో అవకాశం దక్కుతుందనేది అంశంలో ఎలాంటి స్పష్టతా లేదు. చివరికి జనసేన అభ్యర్ధికి అవకాశం వస్తే గోరంట్ల మద్దతు అత్యంత కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఒక పక్క టీడీపీ కంచుకోట, మరోపక్క జనసేన బలంగా ఉన్న నియోజక వర్గాల్లో రాజమండ్రి రూరల్ ప్రధానమైంది కావడంతో ఈ నియోజక వర్గంలో ప్రత్యేర్ధులకు గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను నియోజక వర్గం మారుస్తూ రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేయ్యాలని సూచించడంపై కొంత చర్చ నెలకొంది. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ చెప్పిన విధంగా నేను ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నాని అన్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రెండు లక్షల యాబై వేలు పైగా ఓట్లు ఉన్న పెద్ద నియోజక వర్గం. అయితే, ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు అత్యధికంగా ఉండడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆ సామాజిక వర్గంలో మంచి పేరు తెచ్చుకున్న మంత్రి వేణుగోపాల్‌ని రంగంలోకి దింపేందుకు అధికార పార్టీ రంగం సిద్దం చేసినట్లు సమాచారం.

ఈ నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉండడంతో ఆ సెంటీమెంట్‌ను రాజకీయంగా తెరపైకి తీసుకుని రావడంతోపాటు, పక్క నియోజక వర్గం రాజానగరం ఎమ్యెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కడియం నియోజక వర్గంలో జక్కంపూడి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

కడియం నియోజక వర్గం ఉన్నప్పడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జక్కంపూడి రామ్మోహనరావు కొడుకు జక్కంపూడి రాజా పక్కనియోజక వర్గంలోనే ఉండడంతో ఆ ప్రభావం కూడా ఈ నియోజక వర్గంపై కనిపిస్తుంది. అధికార పార్టీ ఒకవైపు బీసీ ఓటు బ్యాంకు కొల్లగొడుతూనే మరో పక్క కాపులను సమీకరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో ప్రత్యర్ధులను ఓడించేందుకు అధిస్థానం పెద్ద ప్లాన్ వేసినట్లు కనిపిస్తుంది.

ఈ నియోజక వర్గంలో బీసీల తర్వాత ఎక్కువ ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గాలనికి ఉంది. కనుక జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్‌కి ఈ సీటు కేటాయిస్తే కాపులు మద్దతు పలికే అవకాశం ఉంది. అదే టీడిపి తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అనే అనుమానం కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ఫైట్ ఏ విధంగా ఉండబోతుందని విశ్లేషకులు సైతం అంచనాలు వేయలేకపోతున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×