Neeraja Reddy: పాటిల్ శేషిరెడ్డి. పత్తికొండ ఎమ్మెల్యే. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థుల చేతిలో చనిపోయారు. భర్త పోయాక.. భార్య నీరజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఓసారి ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. ఇప్పుడు విధి ఆడిన నాటకానికి బలైపోయారు.
ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతున్నట్టుంది. భర్త అలా.. భార్య ఇలా.. చనిపోవడం బాధాకరం. కర్నూల్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు పాటిల్ నీరజారెడ్డి. అంతలోనే ఢాం అంటూ పెద్ద శబ్దం. కారు వెనుక టైరు పగిలిపోయింది. వేగంగా వెళ్తున్న వాహనం పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నీరజారెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుప్రతిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయారు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి. గద్వాల్ జిల్లా బీచుపల్లి దగ్గర జరిగిందీ ప్రమాదం. కారు టైరు పగిలి చనిపోవడం బ్యాడ్‌లక్ కాక మరేంటి!
భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు నీరజారెడ్డి. 2004లో పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి ఎస్వీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో ఆలూరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు నీరజారెడ్డి.
ఉన్నత విద్యావంతురాలైన నీరజారెడ్డి ఇప్పుడిప్పుడే బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు. బళ్లారిలో నివాసం ఉంటూ తరుచూ ఆలూరు వచ్చివెళ్తుంటారు. రెగ్యులర్‌గా ప్రయాణాలు చేసే ఆమెను.. అదే ప్రయాణం కబళించడం శోచనీయం.