Ganesh Selfie Video: గొంతులో ఆవేదన.. ఇంకా ఏం చేయలేనన్న నిస్సహాయత.. నమ్మినవారిని, నమ్ముకున్నవారిని నట్టేట ముంచుతున్న బాధ.. ఇవి ఆఖరి క్షణాల ముందు అతని గొంతులో వినిపించిన వేదన. ఇంకా నేను పోరాటం చేయలేనని చెబుతూ.. ఆఖరి క్షణాల ముందు తన బాధను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చేరాలంటూ ఓ వీడియెను రికార్డ్ చేశాడు.. ఆ తర్వాత తనువు చాలించాడు.
ఈ వ్యక్తి పేరు కొవూరు గణేష్. ఉభయ గోదావరి జిల్లాలో దుర్గ గణేష్ మార్కెటింగ్ పేరుతో బిజినెస్ చేసేవారు. కూల్ జోన్ పేరుతో పలు స్టోర్స్ నిర్వహించేవారు. గణేష్ తన చావుకు కారణం సోనో విజన్ అధినేత భాస్కరమూర్తినే కారణం అంటున్నాడు. తను పెట్టిన వేధింపుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నాడు. తనను నమ్ముకొని వంద కుటుంబాలు ఉన్నాయని.. వాటికి న్యాయం చేయలేకపోతున్నానని చెబుతున్నాడు. పవన్ వినాలనే చినిపోయే ముందు సెల్ఫీ వీడియో చేశాడు గణేష్. మరోవైపు గణేష్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని వద్ద పనిచేసే సిబ్బంది కూడా సోనో విజన్ కారణంగానే గణేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.
అయితే సోనో విజన్ భాస్కరమూర్తి వర్షన్ మాత్రం మరోలా ఉంది. గణేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధకరమే కానీ.. దానికి తాను బాధ్యుడిని కాదని చెబుతున్నారు. తాము న్యాయంగానే వ్యాపారం చేస్తున్నామని.. ఎవరిని వేధించలేదు.. బెదిరించలేదు అని చెబుతున్నారు. తాను ఎవరి స్టోర్లను మూయించలేదని.. ఎవరి స్టోర్లపై దాడులు చేయించలేదంటూ పలు సాక్ష్యాలను చూపుతున్నారు. ఆర్థిక సమస్యల వల్ల గణేష్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని చెబుతున్నారు.
Also Read: పవన్ టార్గెట్ మారిందా.. కూటమిలో కుంపటి వాస్తవమేనా.. ఏం జరగనుంది?
గణేష్ చనిపోయేముందు చెప్పిన దానికి.. భాస్కరమూర్తి ఇప్పుడు చెబుతున్నదానికి అస్సలు ఎలాంటి సంబంధం లేదు. దుర్గ గణేష్ మార్కెటింగ్ ఉన్న భవనంలోనే సోనో విజన్ స్టోర్ ఉంది. అయితే తాను యాజమానులకు 90 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తేల్చాల్సింది పోలీసులు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో సెల్ఫీ సూసైడ్ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. గణేష్ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ రాధ రంగ రాయల్ ఆర్గనైజేషన్ పేరుతో డిమాండ్ చేస్తున్నారు. 48 గంటల్లో సాయి గణేష్ కుటుంబానికి సోనోవిజన్ యాజమాన్యం.. న్యాయం చేయకపోతే అన్ని సోనోవిజన్ షాపులను ముట్టడించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా గణేష్ అకాల మరణంతో.. వీదిన పడ్డ 150 మంది ఉద్యోగులకు సోనో విజన్ భరోసా కల్పించాలని కాపు సంఘం యువకులు కోరుతున్నారు. పోలీసులు ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.